జయశంకర్ భూపాలపల్లి/ పలిమెల, వెలుగు: భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని పలిమెల రెవెన్యూ గ్రామ పరిధిలో ఈ నెల 11న జరిగిన భారీ భూబదలాయింపు కలకలం రేపుతోంది. ఇక్కడి తహసీల్దార్.. రైతులకు తెలియకుండా ఏకంగా 102 ఎకరాల సాగు భూములను డెక్కన్ సిమెంట్స్‌కు రిజిస్ట్రేషన్ చేశారు. అవి వివాదాస్పద భూములని తెలిసినప్పటికీ తహసీల్దార్ కనీసం ఫీల్డ్ ఎంక్వైరీ చేయలేదు. విషయం తెలిసి రైతులంతా లబోదిబోమంటూ కలెక్టర్‌కు మొరపెట్టుకోగా ఆయన సబ్‌కలెక్టర్‌తో విచారణకు ఆదేశించారు.
వివాదాస్పదంగా 300 ఎకరాలు
నిజాం హయాంలో పలిమెల రెవెన్యూ గ్రామ పరిధిలో పాషా దొర (డబీరొద్దీన్) పేరు మీద వందలాది ఎకరాల పట్టా భూములు ఉండేవి. పలిమెల, పంకెన, బోడాయిగూడెం, అప్పాజీపేట గ్రామాలకు చెందిన రైతులు ఈ భూములను సాగు చేసుకునేవారు. నక్సల్స్ ఉద్యమం కారణంగా పాషా దొర ఊరు విడిచి హైదరాబాద్ వెళ్లి, అక్కడే జీవిస్తూ కొన్ని రోజులకు చనిపోయారు. 2008లో కమాలొద్దీన్ అనే వ్యక్తి తానే పాషా వారసుడినంటూ వచ్చాడు. అప్పటి రెవెన్యూ ఆఫీసర్లతో కుమ్మక్కై సుమారు 300 ఎకరాల భూములను తన పేరు మీద, తనకు కావాల్సిన వారి పేర్ల మీద మార్చుకున్నాడు.
తర్వాతి కాలంలో మంథని, ముత్తారం, కమలాపూర్, కాటారం సబ్ డివిజన్‌లోని పలువురు ప్రజా ప్రతినిధులు, పలుకుబడి కలిగిన నాయకులు ఆ భూములను కొనుక్కొని పట్టా పాస్‌బుక్‌లు సంపాదించారు. వీరిలో కొందరు భూమిని స్వాధీనం చేసుకోవడానికి 2010లో పలిమెల గ్రామానికి రాగా సాగులో ఉన్న రైతులు కత్తులు, గొడ్డళ్లతో వెంటపడ్డారు. దీంతో వారంతా ప్రాణభయంతో వెనక్కి వెళ్లిపోయారు. అప్పటి కాంగ్రెస్ప్రభుత్వంలో కాస్తు కాలంలో పేద రైతులే ఉన్నారు.
ధరణి పోర్టల్‌తో రైతుల పేర్లు మాయం
పాషా దొరకు సంబంధించిన భూముల్లో తమకు పట్టా పాస్ బుక్స్ ఇవ్వాలని రైతులు పలుమార్లు బీఆర్‌ఎస్ సర్కారుకు విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత 2017 నుంచి ఏడేండ్ల పాటు పోరాటం చేశారు. కానీ ధరణి వల్ల పట్టాదారుల పేర్లు తొలగించడం ఆఫీసర్లకు సాధ్యం కాలేదు. అయితే బీఆర్‌ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ రెవెన్యూ రికార్డుల నుంచి కాస్తు కాలమ్ తొలగించి కేవలం పట్టాదారు కాలమ్ మాత్రమే ఉంచారు. దీంతో 2014‒15లో రెవెన్యూ ఆఫీసర్లు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండానే దళారులతో కుమ్మక్కై నాన్ లోకల్ పర్సన్స్‌కి పట్టా పాస్ బుక్స్ ఇచ్చారు.
డెక్కన్ సిమెంట్స్ పేరిట 102 ఎకరాలు మార్పు
పలిమెల రెవెన్యూ గ్రామ పరిధిలోని 27 సర్వే నంబర్ల పరిధిలో గల 102.35 ఎకరాల పట్టా భూమి డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ పేరిట రికార్డుల్లో నమోదైంది. ఈ నెల 11న 13 మంది నాన్‌లోకల్ పట్టాదారులు తమకు కేసీఆర్ ఇచ్చిన పట్టా పాస్ బుక్స్ ఆధారంగా ఈ భూమిని డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్‌కు అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో తాము పండించుకునే భూములను కోల్పోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ : రైతు బీమా స్వాహాపై విచారణ స్పీడప్.. ఇండ్లకు తాళాలు వేసి పరారైన రైతులు
కలెక్టర్‌కు ఫిర్యాదు.. ఎంక్వైరీకి ఆదేశం
ఏండ్ల తరబడి తమ ఆధీనంలో భూములు డెక్కన్ సిమెంట్ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలుసుకున్న రైతులు ఆందోళనకు గురయ్యారు. తమ తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న తమ భూములపై తమకే హక్కులు కల్పించాలని కోరుతూ సోమవారం భూపాలపల్లి కలెక్టరేట్‌కు వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశాలతో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ మంగళవారం పలిమెలలో ఎంక్వైరీ చేశారు. భూములను రిజిస్ట్రేషన్ చేసిన పలిమెల తహసీల్దార్ సయ్యద్ సర్వర్ కనిపించకుండా పోయారు. ఆయనను సీసీఎల్‌ఏకు సరెండర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
దొంగ పట్టాలు చేసుకున్నరు
నా చిన్నప్పటి నుంచి ఈడనే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నా. ఆరెకరాల భూమి ఎవరో గుంజుకుంటామంటే ఎట్లా ఊకునేది. కొట్లాడుడే గానీ భూమిని ఇడిసేది లేదు. మాకు న్యాయం చెయ్యాలి. దీనికోసం సుప్రీం కోర్టు వరకైనా వెళ్తాం. ఆ భూమి మా హక్కు. ఫ్యాక్టరీ పెట్టి మాకు కొలువులు ఇచ్చేది ఏమీ లేదు. ఇచ్చినా వద్దు. మా తర్వాత పిల్లలు వ్యవసాయం చేసుకొని బతుకుతారు.
– పాగే లక్ష్మి, మహిళా రైతు, పంకెన
తాతముత్తాల కాలం నుంచి సాగు చేసుకుంటున్నం
నాకు 42 ఏండ్లు. మా తాతముత్తాతలు వ్యవసాయం చేసిన భూమిలో ఇప్పుడు నేను సాగు చేస్తున్న. 1986లో వచ్చిన గోదారి వరదలకు ఇంట్ల సామానుతో పాటు అప్పుడు ఇచ్చిన పాస్ పుస్తకాలు కూడా కొట్టుకుపోయినయ్. తహసీల్దార్ ఆఫీస్‌లో ఉండాల్సిన కాగితాలను మాయం చేసిండ్రు. కేసీఆర్ సర్కారులో ధరణి వచ్చిన తర్వాత 90 కుటుంబాలకు రావాల్సిన పట్టా భూములను కేవలం ఇద్దరు, ముగ్గురికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నరు.
–పెద్ది బాపు, బాధిత రైతు, బొడాయిగూడెం
సీసీఎల్‌ఏకు రిపోర్ట్ పంపినం
పలిమెల రెవెన్యూ గ్రామ పరిధిలో 102 ఎకరాల పట్టా భూములు డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ కింద రిజిస్ట్రేషన్ జరిగిన మాట వాస్తవమే. దీనిపై రైతులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కాటారం సబ్‌కలెక్టర్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్‌ను సీసీఎల్‌ఏకు పంపించాను. పట్టా కాలమ్‌లో ఉన్నవాళ్లు ఫీల్డ్‌లో లేరు. సాగులో ఉన్న రైతులకు పట్టాదారు పాస్‌బుక్స్ లేవు. మీ–సేవలో స్లాట్ బుక్ చేస్తే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేశారు. 100 ఎకరాలకుపైగా వ్యవసాయ భూములను ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసే ముందు ఫీల్డ్ వెరిఫై చేస్తే బాగుండేది.
– రాహుల్ శర్మ, కలెక్టర్, భూపాలపల్లి