జీహెచ్‌ఎంసీలో ఆరు విడతల్లో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల కేటాయింపు

జీహెచ్‌ఎంసీలో ఆరు విడతల్లో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల కేటాయింపు

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించడం లేదంటూ.. భాజపా నేత ఎన్‌.ఇంద్రసేనారెడ్డి 2021లో దాఖలు చేసిన పిల్‌పై 2023 ఆగస్టు 10 గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదికను అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,43,544 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు 65,538 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించామని, జీహెచ్‌ఎంసీ పరిధిలో 65,458 ఇళ్లను దశలవారీగా కేటాయిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో సెప్టెంబరు మొదటి వారం నాటికి 12,275 ఇళ్లు కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆరు విడతల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కేటాయిస్తామని.. నవంబరు మొదటి వారం నాటికి ఇళ్లన్నీ లబ్ధిదారులకు కేటాయిస్తామని వెల్లడించింది. ఇళ్ల నిర్మాణం పురోగతిపై నివేదిక సమర్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో పిల్‌పై విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.