హనుమకొండ, వెలుగు: గ్రేటర్వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివాదాస్పద భూములకు ఇంటి నెంబర్ల కేటాయింపు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములపై కన్నేస్తున్న కొంతమంది దుండగులు.. తప్పుడు రిజిస్ట్రేషన్ పేపర్లతో ఇంటి నెంబర్లు తీసుకుంటుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడాల్సి పరిస్థితి నెలకొంటోంది. ఆఫీసర్లు ఎలాంటి ఫీల్డ్ విజిట్ చేయకుండానే అప్లికేషన్లకు ఓకే చెప్తున్నారు. కొందరు ఆమ్యామ్యాలకు అలవాటు పడి, అక్రమార్కులకు వంత పాడుతున్నారు.
ఖాళీ స్థలాలు కనిపడితే చాలు..
వరంగల్ రోజురోజుకు విస్తరిస్తుండడంతో కొంతమంది అక్రమార్కులు ఖాళీ, ప్రభుత్వ స్థలాలకు ఫేక్ డాక్యుమెంట్స్సృష్టిస్తున్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ఆఫీసుల్లో మీడియేటర్లను సంప్రదించి తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అనంతరం జీడబ్ల్యూఎంసీలో ఇంటి నెంబర్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఇల్లు కట్టి, ఆ జాగలను ఆక్రమించుకుంటున్నారు. ఇంటి నెంబర్ కోసం వచ్చిన అప్లికేషన్ను బిల్ కలెక్టర్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ఫీల్డ్ విజిట్చేయాల్సి ఉన్నా.. వారు పట్టించుకోవడం లేదు.
పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యం..
ఇంటి నెంబర్ల కేటాయింపులో గ్రేటర్ సిబ్బంది కూడా నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఖిలా వరంగల్, మట్టికోట, రాతికోటలాంటి కొన్ని హెరిటేజ్ ఏరియాలు, చెరువులు, ఇతర నిషిద్ధ ప్రదేశాల్లోని నిర్మాణాలకు కూడా ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నారు. గతంలో కూడా ఇలాగే కాజీపేటకు చెందిన ఓ లేడీ ఆర్ఐ తన కింది సిబ్బందికి లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఇవ్వడంతో పాటు తన పరిధికాని సర్కిల్ లో దాదాపు 14 ఇండ్లకు అక్రమంగా ఇంటి నెంబర్లు కేటాయించారు. ఇప్పుడు గ్రేటర్ పన్నుల విభాగానికి పర్మినెంట్ అధికారి లేరు. గతంలో ఉన్న ట్యాక్స్ ఆఫీసర్ శాంతి కుమార్ ప్రమోషన్ మీద వేరే జిల్లాకు బదిలీ కాగా అప్పటినుంచి ఆ పోస్ట్ ఖాళీగానే ఉంటోంది. దీంతోనే కిందిస్థాయి సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా క్షేత్రస్థాయిలో ఇంటి నెంబర్ల కేటాయింపులో సిబ్బంది ఇష్టారాజ్యం నడుస్తోందనే విమర్శలున్నాయి.
ఆఫీసుల చుట్టూ బాధితులు
ఓ వైపు నకలీ పేపర్లతో రిజిస్ట్రేషన్లు చేస్తుండటం, వాటినే ప్రామాణికంగా తీసుకుని గ్రేటర్ ఆఫీసర్లు ఇంటి నెంబర్లు కేటాయిస్తుండటంతో జనాలు అవస్థలు పడాల్సి వస్తోంది. వివాదంలో ఉన్న స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయించారని, వాటిని రద్దు చేయాలని ఆఫీసుల చుట్టూ జనం తిరుగుతున్నారు. మున్సిపల్ యాక్ట్ ప్రకారం డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉండి, ఇంటి నెంబర్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే తాము అప్రూవ్ చేస్తామని గ్రేటర్ ఆఫీసర్లు చెబుతున్నారు. తమ ల్యాండ్స్కు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ముందస్తుగానే జీడబ్ల్యూఎంసీలో అప్లికేషన్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
కంప్లైంట్ చేసినా పట్టించుకుంటలేరు
హంటర్ రోడ్డులోని 125/సీ సర్వే నెంబర్ లో మాకున్న స్థలంలో ఓ వ్యక్తి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టాడు. దీంతో మేం కోర్టుకు వెళ్లాం. ఆ కేసు కోర్టులో నడుస్తుండగానే.. గ్రేటర్ ఆఫీసర్లు ఇంటి నెంబర్ కేటాయించారు. ఇదే విషయమై గ్రేటర్ ఆఫీసర్లకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకుంటలేరు. అసలు వివాదంలో ఉన్న స్థలానికి ఇంటి నెంబర్ ఎలా కేటాయించారో అర్థం
కావడం లేదు.
- సిద్ధార్థ, బాధితుడు, న్యూశాయంపేట, హనుమకొండ
ముందస్తు దరఖాస్తు పెట్టుకోవాలి
రిజిస్ట్రేషన్లు, ఇంటి నెంబర్ల కేటాయింపు విషయంలో జనాలు అవగాహనతో మెలగాలి. డాక్యుమెంట్స్ క్లియర్ ఉంటే ఇంటి నెంబర్ ఇష్యూ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఒకవేళ ఏదైనా వివాదం ఉంటే ప్రజలు తగిన ఆధారాలతో ముందస్తుగానే జీడబ్ల్యూఎంసీ కి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇంకా ఏదైనా సమాచారం కావాలన్నా ఆఫీసర్లనూ సంప్రదించవచ్చు.
- అన్సూర్ రషీద్, అడిషనల్ కమిషనర్, జీడబ్ల్యూఎంసీ