Pakistan Cricket: పాకిస్తాన్ క్రికెట్‌ నాశనం చేస్తోంది మీరే: ఇఫ్తికార్ అహ్మద్

Pakistan Cricket: పాకిస్తాన్ క్రికెట్‌ నాశనం చేస్తోంది మీరే: ఇఫ్తికార్ అహ్మద్

పాకిస్తాన్ క్రికెట్‌ నాశనం అవ్వడానికి ప్రధాన కారణం ఆ దేశ మీడియానేనని ఆల్‌రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్ ఆరోపించాడు. అందుకు తననే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నాడు. గత రెండేళ్లుగా ఫామ్‌ లేక సతమతమవుతున్న ఈ ఆల్‌రౌండర్ ఇటీవల జరిగిన దేశవాళీ టోర్నీ వన్డే కప్‌లో పర్వాలేదనిపించాడు. అవి కూడా ఆఖరి రెండు మ్యాచ్‌లు మాత్రమే. అంతే..! ఆ దేశ మీడియా అతను తిరిగి ఫామ్ అందుకున్నట్లు పెద్ద పెద్ద కథనాలు ప్రచురించింది. దీనిపై పాక్ ఆల్ రౌండర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

50 పరుగులు చేస్తే వీవీ రిచర్డ్స్ అంటున్నారు

ఏదేని ఆటగాడు 50 పరుగులు చేయగానే ఆకాశానికెత్తడం మానుకోవాలని ఆ దేశ మీడియాకు ఇఫ్తికార్ అహ్మద్ హితవు పలికాడు. ఒకటి.. రెండు సెంచరీలు చేసినంత మాత్రాన ఆటగాళ్లను సర్ బ్రాడ్ మ్యాన్, వీవీ రిచర్డ్స్ వంటి దిగ్గజ క్రికెటర్లతో పోల్చడం మానుకోవాలని సూచించాడు.   

Also Read : సౌతాఫ్రికాపై ఘన విజయం

"మీడియా మిత్రులకు నేను ఒకటే చెప్తున్నా.. దయచేసి ఒక్క మంచి ఇన్నింగ్స్ అడగానే ఆటగాళ్లను హైప్ చేయకండి. వారిని దేశవాళీ క్రికెట్‌లో సత్తా నిరూపించుకోనివ్వండి. రెండు.. మూడు సార్లు అగ్రస్థానంలో ఉండనివ్వండి. అప్పుడు వారిపై కథనాలు ప్రచురించండి. అంతేకానీ, 50 పరుగులు చేయగానే ఆకాశానికి ఎత్తద్దు. వారి కెరీర్‌ను నాశనం చెయ్యొద్దు. ఈ మాటలు ఎవరినో ఉద్దేశించి చెప్పడం లేదు. పాకిస్తాన్ క్రికెట్ బాగు కోసం చెప్తున్నా.. నా మాటలు ఆలకించండి.." అని ఇఫ్తికార్ అహ్మద్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. 

విజేత పాంథర్స్

ఇక పాక్ దేశవాళీ టోర్నీ వన్డే కప్ విషయానికొస్తే, షాదాబ్ ఖాన్ సారథ్యంలోని పాంథర్స్ విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం మార్ఖోర్స్‌తో జరిగిన ఫైనల్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మార్ఖోర్స్ 122 పరుగులకే కుప్పకూలగా.. ఆ లక్ష్యాన్ని  పాంథర్స్ 18 ఓవర్లలోనే చేధించింది.