హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లాడు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ జైలుకెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అయితే బన్నీ జైలుకు వెళ్లిన సమయంలో, జైలు నుంచి తిరిగొచ్చాక చిరంజీవి కుటుంబం అల్లు అర్జున్కు, అతని కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపింది. బన్నీ జైలు నుంచి విడుదల కాగానే చిరంజీవి భార్య సురేఖ అల్లు అర్జున్ను స్వయంగా ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ వార్తలు మీడియాలో ప్రసారం కాగానే.. విషయం తెలుసుకున్న మెగా బ్రదర్ నాగబాబు జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఇలా.. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కష్ట కాలంలో అల్లు కుటుంబానికి అండగా నిలిచింది. అందుకు కృతజ్ఞతగా చిరంజీవిని నేరుగా కలిసి ధన్యవాదాలు తెలిపేందుకు ఆయన నివాసానికి బన్నీ వెళ్లినట్లు తెలిసింది. అల్లు అర్జున్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా చిరంజీవి ఇంటికి వెళ్లారు. మెగా కుటుంబంతో కలిసి అల్లు కుటుంబం లంచ్ చేయనుంది.
— PSPK UK FAN (@pspk_uk) December 15, 2024
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి ఇంటికి రాగానే పలువురు సెలబ్రెటీలు అల్లు అర్జున్ను కలిసి మద్దతు తెలిపారు. బన్నీని కలిసి మద్దతు తెలిపిన వారిలో పుష్ప సినిమా నిర్మాతలు నవీన్, రవిశంకర్, దర్శకుడు సుకుమార్, రాఘవేంద్ర రావు, దిల్ రాజు, విజయ్ దేవరకొండ, రానా, ఉపేంద్ర, థమన్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, వక్కంతం వంశీ, మంచు విష్ణు, సురేందర్ రెడ్డి, వెంకటేశ్, నాగచైతన్య, సుడిగాలి సుధీర్, సుధీర్ బాబు, శర్వానంద్, మారుతి, శ్రీకాంత్, బోయపాటి శీను, సిద్ధు జొన్నలగడ్డ, అఖిల్ తదితర సినీ ప్రముఖులు ఉన్నారు.
Also Read : రేవతి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటాం
డిసెంబర్ 4న రాత్రి 9.30కు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ లో పుష్ప-2 సినిమా ప్రీమియర్ పడింది. ఈ ప్రీమియర్ షోను అభిమానులతో కలిసి వీక్షించేందుకు అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లాడు. అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాదాపు 10 రోజుల నుంచి ఐసీయూలోనే చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై రేవతి భర్త భాస్కర్ చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు తొక్కిసలాటకు కారణమైన అల్లు అర్జున్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. ఈ కేసులో సంధ్య థియేటర్ యజమానిని, మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అల్లు అర్జున్ను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ బయటికొచ్చాడు.