హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. చిక్కడపల్లి పోలీసులు నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అల్లు అర్జున్, అతని భార్య స్నేహ ఇంట్లో ఉన్నారు. అల్లు అర్జున్ కాఫీ తాగుతుండగా పోలీసులు ఆయనకు విషయం చెప్పారు. పోలీస్ స్టేషన్కు రాక తప్పదని స్పష్టం చేశారు. పోలీసులు చెప్పిన మాటతో అల్లు అర్జున్ భార్య స్నేహకు కాసేపు ఏం తోచలేదు.
అల్లు అర్జున్ వైపు చూస్తూ ముభావంగా కనిపించింది. తన భర్తను అరెస్ట్ చేస్తున్నారని అర్థం కావడంతో భావోద్వేగానికి లోనైంది. ఆ సమయంలో తన భార్యను అల్లు అర్జున్ ఓదార్చాడు. ఏం భయపడాల్సిన పని లేదని, తాను తిరిగి వస్తానని చెప్పాడు. దగ్గరికి తీసుకుని ఓదార్చే ప్రయత్నం చేశాడు. తన తండ్రి అల్లు అరవింద్ కు కూడా ధైర్యం చెప్పాడు. అదుపులోకి తీసుకున్న సమయంలో అల్లు అర్జున్ చేతిలో కాఫీ కప్పుతో కనిపించాడు.
Also Read :- అల్లు అర్జున్కు స్టేషన్ బెయిల్ వస్తుందా లేదా కోర్టులో హాజరు పరుస్తారా..?
అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో అతని ఇంట్లో ఎమోషనల్ సీన్ నడిచింది. సంధ్య ధియేటర్ తొక్కిసలాట కేసులో అదుపులోకి తీసుకోవటానికి ఇంటికి వచ్చిన పోలీసుల సమయంలో.. ఇంట్లో వాళ్లు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సమయంలో అల్లు అర్జున్ మాటలు.. ఆయన చేసిన వ్యాఖ్యలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు.. పోలీస్ వాహనంలోనే వెళ్లే సమయంలో.. తండ్రి అల్లు అరవింద్తో మాట్లాడారు. ‘‘నేను కూడా వస్తాను అంటే.. ఇది నా గురించి.. నా కేసు.. నేను చూసుకుంటాలే.. ఎందుకు భయం’’ అంటూ తండ్రికి బన్నీ ధైర్యం చెప్పారు. అల్లు అరవింద్ అయినప్పటికీ పోలీస్ వాహనంలో ఎక్కగా ఆ వాహనం నుంచి దింపేసి అక్కర్లేదని, తాను చూసుకుంటానని బన్నీ చెప్పాడు.
పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం
డ్రస్ మార్చుకునే సమయంలో ఇవ్వలేదు.. నేరుగా బెడ్ రూం వరకు వచ్చేశారు అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. పోలీస్ వాహనం ఎక్కుతున్న సమయంలో.. భార్య స్నేహారెడ్డిని ఓదార్చారు అల్లు అర్జున్.. ఏం కాదు.. ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అంటూ భుజంపై చెయ్యి వేసి మరీ ఓదార్చారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ స్నేహితుడు, ఫ్యామిలీ ఫ్రెండ్ బన్నీ వాసును ఉద్దేశించి మాట్లాడుతూ.. సంతాప సభ కాదు.. సంతాపంలా ఎందుకు అలా ఉన్నావ్ అంటూ నవ్వుతూ కామెంట్ చేశారు అల్లు అర్జున్.