టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టయి డిసెంబర్ 13న మధ్యంతర బెయిల్ పై రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించగా హైకోర్టు 4 వారాలపాటు మధ్యంతర బెయిల్ ని మంజారు చేసింది. ఈ క్రమంలో ఇటీవలే నాంపల్లి కోర్టు లో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు.
అయితే నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ గడువు ముగియడంతో ఈరోజు (శుక్రవారం) మరోసారి అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరు కానున్నాడు. ఈ విచారణలో సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట గురించి వాదనలతోపాటూ రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై వాదనలు జరగనున్నట్లు సమాచారం.
ఈ విషయం ఇలా ఉండగా డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ సందర్భంగా అల్లు అర్జున్ ని చూడటానికి రేవతి అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలసి వచ్చింది. కానీ తొక్కిసలాట జరగడంతో రేవతి అక్కడిక్కడే మృతి చెందింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. దీంతో పుష్ప 2 టీమ్ మహిళ కుటుంబానికి ఆర్ధిక సాయం రూ.2 కోట్లు అందించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.