- సీఎం ఆగ్రహం, పోలీసుల విచారణ తర్వాత దిగొచ్చిన అల్లు అర్జున్
- శ్రీతేజ్కు అల్లు అరవింద్,చిత్ర నిర్మాతల పరామర్శ
- అర్జున్ రూ. కోటి, సుకుమార్, నిర్మాతలు మరో కోటి సాయం
- ఎఫ్డీసీ చైర్మన్ దిల్‌రాజుకు రూ. 2 కోట్ల చెక్కు అందజేత
- నేడు సీఎం రేవంత్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దల భేటీ
హైదరాబాద్/ సికింద్రాబాద్, వెలుగు: పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ ఎట్టకేలకు తగ్గిండు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తీరును ఇటు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి తప్పుబట్టడం, అటు పోలీసులు ఆధారాలతో వీడియో రిలీజ్ చేయడంతో దిగి వచ్చిండు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను అల్లు అర్జున్తరఫున బుధవారం ఆయన తండ్రి అల్లు అరవింద్, చిత్ర నిర్మాతలు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ నుంచి రూ. కోటి .. ‘పుష్ప2’ డైరెక్టర్ సుకుమార్, నిర్మాతల తరఫున రూ. 50 లక్షల చొప్పున మరో కోటి పరిహారంగా అందజేశారు.
ఈ నెల 4న పుష్ప2 బెనిఫిట్‌షో సందర్భంగా పోలీసులు పర్మిషన్ఇవ్వకున్నా అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వెళ్లగా.. అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనియింది. ఆమె తొమ్మిదేండ్ల కొడుకు శ్రీతేజ్కోమాలోకి వెళ్లాడు. అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ తీరును సీఎం రేవంత్తప్పుపట్టారు. దీనికితోడు మంగళవారం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను విచారణకు పిలిచి.. ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించడంతో ఆయన తన తప్పును ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అర్జున్ తండ్రి అల్లు అరవింద్, చిత్ర నిర్మాతలు బుధవారం శ్రీతేజ్ దగ్గరికి వెళ్లారు. రేవతి కుటుంబానికి సాయంగా రూ. 2 కోట్ల చెక్కును ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకు అందజేశారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డిని దిల్ రాజ్ నేతృత్వంలో తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కలువనున్నారు. సంధ్య థియేటర్ఘటన అనంతర పరిణామాలపై వివరణ ఇవ్వనున్నారు.
సీఎం ఎంటర్ అయ్యాకే మారిన సీన్
ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో పుష్ప 2 బెనిఫిట్ షోకు ఆ సినిమా హీరో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో అటెండ్ అయ్యారు. ఎలాంటి అనుమతి లేకుండా ఓపెన్ టాప్ కారులో రావడం, ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇదే ఘటనలో గాయపడ్డ ఆమె కుమారుడు శ్రీతేజ్ ను కిమ్స్ కు తరలించగా మృత్యువుతో పోరాడుతున్నాడు. దీంతో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఓనర్లు, మేనేజర్, సిబ్బంది మీద పోలీసులు కేసులు నమోదు చేశారు.
అల్లు అర్జున్ ను ఈ నెల 13న అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించి.. మధ్యంతర బెయిల్‌పై మరుసటిరోజు (14న) చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ కు ఇండస్ట్రీ ప్రముఖులు క్యూ కట్టి సంఘీభావం ప్రకటించారు. కానీ, రేవతి కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి తెలుసుకునేందుకు ఆవైపు పెద్దగా ఎవరూ వెళ్లకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అల్లు అర్జున్తోపాటూ సినీ ప్రముఖుల తీరును అసెంబ్లీ వేదికగా సీఎం తప్పుపట్టారు. ‘‘మీ సినిమా చూసేందుకు వచ్చి ఓ మహిళ చనిపోయి, ఆమె కుమారుడు చావుబతుకుల్లో ఉంటే ఆ కుటుంబాన్ని పరామర్శించని మీకు మానవత్వం అనేది ఉందా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ లో సీఎం వ్యాఖ్యల తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించి.. తన తప్పు లేదని, పోలీసులదే తప్పన్నట్లు పరోక్షంగా మాట్లాడాడు. దీనికి పోలీసులు ఆధారాలతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నెల 4న సంధ్య థియేటర్ లోపల, బయట ఏం జరిగిందో ప్రజల ముందు సీసీ ఫుటేజ్ ఉంచారు. బయట తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం సినిమా హాల్లోకి వెళ్లి చెప్పినా అల్లు అర్జున్ వినలేదని, సినిమా చూసే వెళ్తానన్నారని పోలీసులు వెల్లడించారు. బలవంతంగా తాము అల్లు అర్జున్ను బయటకు తీసుకువచ్చామని.. అయినా మరోసారి కారు సన్ రూఫ్ నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లాడని తెలిపారు. ఆ వీడియోలన్నీ విడుదల చేశారు.
మంగళవారం అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో 3 గంటల పాటు విచారించి పలు వివరణలు తీసుకున్నారు. ఆధారాలన్నీ ఆయన ముందు పెట్టి ప్రశ్నించారు. దీంతో తన తప్పులను అల్లు అర్జున్ ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో బుధవారం అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్కు వచ్చి, శ్రీతేజ్‌ను పరామర్శించడం, అల్లు అర్జున్ తరఫున కోటి రూపాయలు, సినిమా డైరెక్టర్ సుకుమార్ తరఫున రూ. 50 లక్షలు, నిర్మాతల తరఫున రూ. 50 లక్షలు.. ఇట్ల మొత్తంగా రూ.2 కోట్ల చెక్కును అందజేశారు.
నేడు సీఎంతో భేటీ
సీఎం రేవంత్‌రెడ్డితో గురువారం సినీ ప్రముఖుల సమావేశం జరగనుంది. బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ భేటీ ఉంటుంది. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతోపాటు సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు తదితరులు హాజరుకానున్నట్లు తెలిసింది.
సీఎంను కలుస్తాం: దిల్ రాజు
సినీ పరిశ్రమ పెద్దలతో వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని గురువారం పది గంటలకు కలుస్తామని ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత దిల్‌రాజు అన్నారు. ఇండస్ట్రీలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఇప్పటికే సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నామని, గురువారం అందుబాటులో ఉన్న సినీ ప్రముఖులందరిని తీసుకువెళ్లి భేటీ అవుతామన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈ సమావేశం ఏర్పాటు చేశామని దిల్‌రాజు పేర్కొన్నారు. తాజా పరిణామాలు, ఇండస్ట్రీ అభివృద్దిపై సమావేశంలో చర్చిస్తామన్నారు. ‘‘నేను చిత్ర పరిశ్రమ వ్యక్తిని. ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి వారధిగా ఉండాలని ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పజెప్పారు. అదే చేస్తున్నా. ఒక నిర్మాతగా, ప్రభుత్వ ప్రతినిధిగా సినిమా ఇండస్ట్రీని సీఎంతో కలిపే బాధ్యత నాది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా’’ అని ఆయన వివరించారు.
అల్లు అర్జున్ తరఫున రూ. కోటి సాయం: అరవింద్
పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల ఆర్థిసాయాన్ని అందిస్తున్నట్లు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తెలిపారు. ఇందులో అల్లు అర్జున్ తరపున కోటి రూపాయలు, పుష్ప-2 సినీ నిర్మాతలు మైత్రి మూవీస్ తరఫున రూ.50 లక్షలు, దర్శకుడు సుకుమార్ తరఫున రూ.50 లక్షలు ఉన్నాయని తెలిపారు. మొత్తంగా రూ. 2 కోట్ల చెక్కును ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న ఎఫ్డీసీ చైర్మన్ దిల్‌రాజుకు అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
దిల్ రాజు, పుష్ప2 నిర్మాతలతో కలిసి బుధవారం అల్లు అరవింద్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్కు వచ్చారు. అక్కడ చికిత్సపొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించారు. అనంతరం అరవింద్ మీడియాతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడుతున్నదని.. వెంటిలేటర్ తీసేసి 72 గంటలు గడిచిందని డాక్టర్లు చెప్పారని అన్నారు. ఆ బాలుడు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
‘‘మా లీగల్ టీమ్ డబ్బులు నేరుగా ఇవ్వకూడదని చెప్పింది. వారి సలహా మేరకు డబ్బులను చెక్కు రూపంలో దిల్‌రాజుకు అందించాం..’’ అని అల్లు అరవింద్ తెలిపారు. కాగా.. జ్యోతిష్యులు వేణుస్వామి కూడా కిమ్స్ కు వచ్చి శ్రీతేజ్‌ను పరామర్శించారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌ను కలిసి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. బాబు ఆరోగ్యం కోసం ఈ వారంలో మృత్యుంజయ హోమాన్ని సొంత ఖర్చులతో నిర్వహిస్తానని వేణుస్వామి తెలిపారు. సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన భార్య, కూతురుతో కలిసి కిమ్స్ హాస్పిటల్కు వచ్చి.. శ్రీతేజ్‌ను పరామర్శించారు. కొరియోగ్రాఫర్స్ తరఫున రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని జానీ మాస్టర్ చెప్పారు.