AlluArjun: శ్రీతేజ్ను చూడాల్సిందే.. కిమ్స్కు అల్లు అర్జున్.. భారీగా మోహరించిన పోలీసులు

AlluArjun: శ్రీతేజ్ను చూడాల్సిందే.. కిమ్స్కు అల్లు అర్జున్.. భారీగా మోహరించిన పోలీసులు

హైదరాబాద్: సికింద్రాబాద్ కిమ్స్‌ హాస్పిటల్కు అల్లు అర్జున్‌ మంగళవారం ఉదయం 10 గంటలకు వెళ్లనున్నట్లు తెలిసింది. సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను అల్లు అర్జున్‌ పరామర్శించనున్నాడు. పోలీసుల అనుమతితో కిమ్స్‌ హాస్పిటల్కు అల్లు అర్జున్‌ వెళుతున్నాడు. అల్లు అర్జున్ వెళుతుండటంతో కిమ్స్‌ వద్ద భారీగా పోలీసుల మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నారు. అల్లు అర్జున్ సోమవారం రోజు పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. శ్రీతేజ్ను పరామర్శించేందుకు కిమ్స్ హాస్పిటల్కు వెళ్లాలంటే ముందస్తుగా తమకు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకోవాలని సూచించారు.

కిమ్స్కు వెళ్లాలని డిసైడ్ అయిన అల్లు అర్జున్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అనుమతి తెలపడంతో మంగళవారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి బన్నీ వెళుతున్నాడు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని షరతు విధించింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. కేసును ప్రభావితం చేసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది.

అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య 70 ఎంఎం థియేటర్ వద్ద డిసెంబర్ 4, 2024న పుష్ప –2 సినిమా బెనిఫిట్​ షో ఏర్పాటు చేశారు. దీనికి హీరో అల్లు అర్జున్ తోపాటు మూవీ టీం వస్తున్నారని తెలుసుకున్న జనం ఎగబడ్డారు. బెనిఫిట్​షో సందర్భంగా అల్లు అర్జున్​ను చూడాలని దిల్​సుఖ్​నగర్​కు చెందిన భాస్కర్, రేవతి(35), వారి కొడుకు శ్రీ తేజ్ (9), కూతురు  కోసం టికెట్లు కొనుగోలు చేశారు. రాత్రి అల్లు అర్జున్​రావడానికి కొద్ది సేపు ముందు వారు థియేటర్​కు చేరుకున్నారు. 

అల్లు అర్జున్ వస్తుండడంతో థియేటర్ వద్ద అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు సుమారు 30 మంది, పోలీసులు 20 మంది ఉన్నారు. అయితే ఊహించనంత సంఖ్యలో అభిమానులు అక్కడ గుమిగూడారు. ఫ్యాన్స్​ను చూసిన అల్లు అర్జున్ కారుపైకి ఎక్కి ర్యాలీగా అందరికీ నమస్కరిస్తూ థియేటర్​లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అల్లు అర్జున్​వైపు అభిమానులు దూసుకువచ్చారు. సెల్ఫీ వీడియోలు తీసుకునే క్రమంలో కొందరు, ఆయనను టచ్​చేయాలని మరికొందరు ముందుకు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయగా, అభిమానులను బౌన్సర్లు, పర్సనల్​సెక్యూరిటీ వెనక్కి నెట్టారు. దీంతో తొక్కి సలాట జరిగింది.  

అల్లు అర్జున్​రాత్రి 9:30 కు థియేటర్కు వెళ్లగా..ఆయన లోపలకు వెళ్లడానికి పోలీసులు, బౌన్సర్లు, పర్సనల్​సెక్యూరిటీ అందరినీ చెదరగొట్టి రూట్​క్లియర్​చేశారు. ఈ క్రమంలో బయటి నుంచి లోపలకు వచ్చేందుకు చాలామంది అభిమానులు దూసుకువచ్చారు. అప్పటికే థియేటర్​లోపల ఒకవైపు భాస్కర్ అతడి కూతురు, మరోవైపు రేవతి, ఈమె కొడుకు శ్రీతేజ్​ ఉన్నారు. అర్జున్​వస్తున్నాడని తెలుసుకుని లోపలున్న అభిమానులంతా తోసుకురాగా వారితో పాటు శ్రీతేజ్ ​కూడా పరిగెత్తాడు. కొడుకును పట్టుకునే క్రమంలో తల్లి రేవతి కూడా వెంట పరుగెత్తింది. దీంతో శ్రీతేజ్ ​కిందపడగా అభిమానులంతా అతడిని తొక్కుకుంటూ వెళ్లారు.

శ్రీతేజ్​ను కాపాడుకునే ప్రయత్నంలో రేవతి కూడా ప్రేక్షకుల కాళ్ల కింద నలిగిపోయింది. మరికొంతమంది కూడా గాయపడ్డారు. ఈ దశలో అక్కడే ఉన్న పోలీసులు.. అరుపులు, కేకలు విని అందరినీ చెదరగొట్టారు. స్పృహతప్పిన రేవతి, అతడి కొడుకును బయటకు తీసుకువచ్చి సీపీఆర్​ చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోవడంతో రేవతిని డీడీ హాస్పిటల్​కు తరలించారు. అక్కడే రేవతి ప్రాణాలు కోల్పోయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజ్ను పోలీసులు హుటాహుటిన కిమ్స్​దవాఖానకు తరలించారు. అప్పటి నుంచి శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.