మామ టికెట్ కోసం .. రంగంలోకి అల్లు అర్జున్

మామ టికెట్ కోసం .. రంగంలోకి అల్లు అర్జున్

నల్గొండ, వెలుగు:  నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్​రెడ్డి ఇందుకోసం తన అల్లుడు, సినీ హీరో అల్లు అర్జున్​ను రంగంలోకి దింపుతున్నారు. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్​కు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ సాధించాలనే లక్ష్యంతో బలప్రదర్శనకు దిగుతున్నారు. 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తన మామను ఈ సారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిపించాలన్న పట్టుదలతో ఉన్న అల్లు అర్జున్ సైతం ఎన్నికల ప్రచారం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శనివారం పెద్దవూర మండలంలోని కొత్తగూడెం, బట్టుగూడెం వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన కన్వెన్షన్ హాల్, పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్​గా వస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డిని సైతం ఆహ్వానించడంతో సాగర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 

రచ్చకెక్కిన విభేదాలు.. కొత్త నేతల ఎంట్రీ 

యాదవ ఓటర్లు అధికంగా ఉన్న సాగర్​లో కొన్నేండ్లుగా రెడ్ల ఆధిపత్యం నడుస్తోంది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డిని 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడించింది. ఆ  ఎన్నికల్లో గెలిచిన నోముల నర్సింహయ్య మరణంతో 2021 ఏప్రిల్​లో ఉప ఎన్నిక జరగగా.. నర్సింహయ్య కొడుకు భగత్​ను కేసీఆర్ బరిలోకి దింపారు. మంత్రి జగదీశ్ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిపై హామీ ఇవ్వడం ద్వారా రెడ్ల మద్దతు చేజారకుండా చూసుకున్నారు. దీంతో ఆ ఎన్నికల్లో భరత్ గెలిచారు. కానీ ఆ తర్వాత భగత్, కోటిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు తీవ్రమై గొడవలు రచ్చకెక్కాయి. హైకమాండ్​ జోక్యం చేసుకుని నచ్చచెప్పినా విభేదాలు సమసిపోలేదు. ఇదే అదనుగా కంచర్ల చంద్రశేఖర్​రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ మనమడు రంజిత్ యాదవ్ కొత్తగా ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ కొంతకాలంగా బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అంతర్గత గొడవలతో సాగర్​లో బీఆర్ఎస్ వీక్ అయిందని, వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమని సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టుల్లో తేలడం వల్లే కొత్త నేతలను హైకమాండ్ ప్రోత్సహిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.  

ఇయ్యాల బల ప్రదర్శన  

కాంగ్రెస్​లో సుదీర్ఘ అనుభవం ఉన్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డికి అత్యంత సన్నిహితుడు. గతంలో మిర్యాలగూడ, నల్గొండ ఎంపీ టికెట్​ఆశించినా రాలేదు. దీంతో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లో చేరిన కంచర్ల 2014లో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో టికెట్ రాకపోవడంతో ఈ సారి సొంత నియోజకవర్గం సాగర్​లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తాను టికెట్​ ఆశిస్తున్న సంగతి హైకమాండ్ దృష్టిలో పడేలా సాగర్​లో పార్టీ కార్యకర్తలు, నాయకులతో తరచూ భేటీ అవుతున్నారు. రాజకీయంగా ఇది తనకు  చివరి అవకాశంగా భావిస్తున్న కంచర్లకు తన అల్లుడు అల్లు అర్జున్​సినీ గ్లామర్​తోడవుతుందని భావిస్తున్నారు. టికెట్ కోసం బల ప్రదర్శనలో భాగంగానే కన్వెక్షన్ హాల్, పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్​ను చీఫ్ గెస్ట్​గా ఆహ్వానించారు. మంత్రి జగదీశ్ రెడ్డిని కూడా ఆహ్వానించినా, ఆదివారం సూర్యాపేటలో సీఎం సభ ఉన్నందున ఆయన రాకపోవచ్చని తెలిసింది. కార్యక్రమానికి నియోజకవర్గవ్యాప్తంగా పది వేల మందికి ఇన్విటేషన్లు పంపారు. చంద్రశేఖర్ భార్య అరుణ చేతుల మీదుగా చీరల పంపిణీ చేస్తారని తెలిసింది.