- చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు
- మొత్తం 23 ప్రశ్నలు వేసిన పోలీసులు.. 15 ప్రశ్నలకు ఆన్సర్
- బెనిఫిట్‌షో చూసేందుకు పోలీసుల పర్మిషన్ గురించి తెలియదని వెల్లడి
- తొక్కిసలాట సంగతి కూడా తనకు తెలియదని సమాధానం
- మూడున్నర గంటలకుపైగా విచారణ.. డీసీపీ సమక్షంలో వీడియో రికార్డింగ్.. మళ్లీ విచారణకు రావాలని పోలీసుల ఆదేశం
- పీఎస్ వద్ద 250 మంది పోలీసులతో భారీ బందోబస్తు
హైదరాబాద్, వెలుగు : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసుల ముందు విచారణకు హాజర య్యాడు. పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు తనకు అనుమతి ఉందో లేదో తెలియదని పోలీసులకు తెలిపాడు. థియేటర్ యాజమాన్యం నుంచి తనకెలాంటి సమాచారం లేదని వెల్లడించాడు. తొక్కిసలాట జరుగుతుందని తాను అనుకోలేదని, తన ప్రమేయం లేకుండానే అనుకోకుండా తప్పిదం జరిగిందని అంగీకరించాడు. చిక్కడపల్లి పోలీసుల ముందు మంగళవారం అల్లు అర్జున్ కన్‌ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను మంగళవారం ప్రశ్నించారు. ఉదయం 11.05 గంటల నుంచి మధ్యాహ్నం 2.45 గంటల వరకు విచారించారు.
సుమారుగా 3 గంటల 35 నిమిషాల పాటు ప్రశ్నించి, స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ఎఫ్‌ఐఆర్, రిమాండ్ కేస్ డైరీలో పేర్కొన్న అంశాల ఆధారంగా దాదాపు 23 ప్రశ్నలు వేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నల్లో 15 ప్రశ్నలకు మాత్రమే అల్లు అర్జున్ సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. మిగతా 8 ప్రశ్నలకు తెలియదు అనే సమాధానం చెప్పినట్టు సమాచారం. అప్పర్ బాల్కనీలోకి వెళ్లిన తర్వాత థియేటర్‌లో చీకటి, భారీ సౌండ్స్, అభిమానుల సందడి మధ్య బయట ఏం జరిగిందో తనకు తెలియలేదని ప్రశ్న దాటవేసినట్టు తెలిసింది. లొక్కిసలాట, రేవతి మృతికి సంబంధించి తనకు ముందస్తు సమాచారం లేదని వివరించినట్టు సమాచారం.
తండ్రి, మామతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు..
పోలీసుల దర్యాప్తునకు సహకరించాలనే హైకోర్టు మధ్యంతర బెయిల్ కండీషన్స్ నేపథ్యంలో ఉదయం 11 గంటలకు చిక్కడపల్లిలోని ఏసీపీ ఆఫీస్‌కు అల్లు అర్జున్ చేరుకున్నారు. ఆయనతో పాటు తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్‌రెడ్డి, బన్నీవాసు సహా న్యాయవాదులు కూడా పీఎస్‌కు వచ్చారు. సెంట్రల్‌జోన్ డీసీపీ అక్షాన్స్ యాదవ్ ఆధ్వర్యంలో చిక్కడపల్లి ఏసీపీ రమేశ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ సహా మొత్తం 8 మంది సభ్యులతో కూడిన స్పెషల్ టీమ్ అల్లు అర్జున్‌ను విచారించింది. బెన్‌ఫిట్ షో,సెలబ్రెటీల అనుమతిని నిరాకరిస్తూ ఈ నెల3న పోలీసులు ఇష్యూ చేసిన లెటర్‌ను అల్లు అర్జున్ ముందు పెట్టి ప్రశ్నించారు.
విచారణ మొత్తాన్ని న్యాయవాది సమక్షంలో వీడియో రికార్డింగ్ చేశారు. ప్రధానంగా ఎఫ్‌ఐఆర్, రిమాండ్ కేస్ డైరీలో పోలీసులు రికార్డ్ చేసిన అంశాలకు తగ్గట్టుగానే ప్రశ్నించినట్టు తెలిసింది. బౌన్సర్స్ ఎంత మంది ఉంటారు? వారికి సంబంధించిన విధులేంటి? అని ఆరా తీసినట్టు సమాచారం. ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్‌కు ప్రధాన బౌన్సర్‌గా ఎవరెవరు ఉన్నారనే సమాచారం సేకరించినట్టు తెలిసింది.
సెలబ్రిటీలకు అనుమతి లేదని తెలియదా?
సెలబ్రిటీలకు అనుమతి లేదనే సమాచారం థియేటర్ యాజమాన్యం అందించలేదా? అని అల్లు అర్జున్‌ను పోలీసులు అడిగినట్టు తెలిసింది. థియేటర్ యాజమాన్యం కానీ, వ్యక్తిగత మేనేజర్ కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అల్లు అర్జున్ వివరించినట్టు తెలిసింది. థియేటర్‌కు వచ్చే సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ర్యాలీ ఎందుకు తీశారని, పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసి కూడా పోలీస్ బందోబస్తు ఎందుకు కోరలేదని అడిగినట్టు సమాచారం. ఇలాంటి విషయాలు తన మేనేజర్ చూసుకుంటాడని, తనకేమీ తెలియదని అల్లు అర్జున్ చెప్పినట్టు తెలిసింది.
‘‘తొక్కిసలాట జరిగిన విషయం బౌన్సర్స్ చెప్పలేదా? ఏసీపీ రమేశ్‌కుమార్ వచ్చిన తర్వాత కూడా బయటకు రాకపోవడానికి గల కారణాలేంటి?”అనే ప్రశ్నలు అడిగి అల్లు అర్జున్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. పూర్తి కన్‌ఫెషన్ స్టేట్‌మెంట్ కాపీపై సంతకాలు తీసుకున్నారు. మళ్లీ విచారణకు పిలిచినప్పుడు హాజరు కావాలని సూచించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రికార్డ్ చేసి, చదివి వినిపించారు.
పీఎస్, అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ బందోబస్తు
అల్లు అర్జున్ విచారణ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటితో పాటు చిక్కడపల్లి పీఎస్ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పీఎస్ వద్ద సుమారు 250 మంది పోలీసులను మోహరించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే అన్ని వైపులా 600 మీటర్ల దూరంలో రోడ్లను బారికేడ్లతో మూసివేశారు. పోలీస్ వెహికల్స్ మినహా ఎలాంటి వాహనాలను అనుమతించలేదు. స్థానికులతోపాటు అభిమానులు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
హోటల్స్, ఇతర షాపులు మూయించారు. అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీపీ ఆధ్వర్యంలో భద్రత కల్పించారు. ఇంటి ప్రహరీ చుట్టూ కవర్స్‌తో ప్యాక్ చేశారు. అల్లు అర్జున్ తన ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లే వరకు రెండు ఎస్కార్ట్ వెహికల్స్‌తో రక్షణగా నిలిచారు.
ఏ 18గా మైత్రీ మూవీ మేకర్స్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్‌ను కూడా నిందితులుగా చేర్చారు. కేసులో 18వ నిందితుడుగా పేర్కొన్నారు. అల్లు అర్జున్ బౌన్సర్స్ ఆర్గనైజర్ ఆంటోనీని మంగళ వారం అదుపులోకి తీసుకు న్నారు. ఘటన జరిగిన రోజు ఆంటోనీనే అల్లు అర్జున్‌కు బందోబస్తులో కీలకంగా వ్యవహరిం చినట్టు పోలీసులు గుర్తించా రు. ఓ వైపు అర్జున్‌ను విచారిస్తూనే మరోవైపు ఆంటో నీని కూడా ప్రశ్నించినట్టు తెలిసింది.
బౌన్సర్స్ ఆర్గనైజర్ కావడంతో పోలీసు లపై బౌన్సర్స్ జరిపిన దాడికి సంబంధించి ఆంటోనీపై చట్టపరమైన చర్యలు తీసుకు నే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 18 మందిని నిందితులుగా చేర్చారు. బౌన్సర్ల ఆర్డనైజర్ ఆంటోనీని కూడా కేసులో నిందితుడిగా చేర్చే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది.