- జరిగిన దానికి సారీ చెబుతున్నా
- త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తానని వెల్లడి
- జైలు నుంచి విడుదల
- జైలు నుంచి విడుదలైన సినీ నటుడు
హైదరాబాద్/జూబ్లీహిల్స్/బషీర్ బాగ్, వెలుగు: తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి అండగా ఉంటానని సినీ నటుడు అల్లు అర్జున్ ప్రకటించారు. ఈ కేసులో అరెస్టయిన ఆయన.. మధ్యంతర బెయిల్ పై శనివారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. అక్కడి నుంచి నేరుగా గీతా ఆర్ట్స్కార్యాలయానికి వెళ్లి తన లాయర్లతో సమావేశమయ్యారు. తర్వాత జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 68లోని ఇంటికి చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘దేశవ్యాప్తంగా నన్ను సపోర్ట్ చేసిన అందరికీ నా ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలతో నా హృదయం నిండింది. రేవతి కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. ఆ కుటుంబానికి సారీ చెబుతున్నాను. జరిగిన నష్టానికి ఎంతగానో చింతిస్తున్నాను. ఇది ప్రమాదవశాత్తు జరిగింది. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదు. అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటా. నేను నా కుటుంబంతో కలిసి థియేటర్‌లో సినిమా చూస్తుండగా, బయట ఇది జరిగింది. నాకు దీంతో ప్రత్యక్ష ప్రమేయం లేదు.
దాదాపు 20 ఏండ్లుగా సంధ్య థియేటర్‌కు వెళ్తున్నాను. దాదాపు 30 సార్లు అక్కడ సినిమా చూశాను. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. త్వరలోనే ఆ కుటుంబాన్ని కలుస్తాను. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. దీని గురించి ఎక్కువగా మాట్లాడాలనుకోవడం లేదు’’ అని చెప్పారు. కాగా, ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను చూసి కుటుంబసభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన రాగానే భార్య స్నేహారెడ్డి, పిల్లలు ఆలింగనం చేసుకున్నారు. అల్లు అర్జున్ మేనత్త సురేఖ, సొంత మామ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు వచ్చారు.
క్యూ కట్టిన సెలబ్రిటీలు..
అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు సెలబ్రిటీలు క్యూ కట్టారు. బన్నీని డైరెక్టర్ సుకుమార్ హత్తుకొని భావోద్వేగానికి లోనయ్యారు. కె.రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, దిల్‌రాజు, దగ్గుబాటి సురేశ్‌బాబు, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, వెంకటేశ్ తదితరులు తరలివచ్చారు. కాగా, అల్లు అర్జున్ కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
12 గంటలు జైల్లో పుష్ప..
అల్లు అర్జున్ 12 గంటలు జైల్లో ఉన్నారు. శుక్రవారం రాత్రంతా క్లాస్1 మంజీరా బ్యారక్‌లో ముగ్గురు ఖైదీలతో కలిసి ఉన్నారు. ఆయన ఎలాంటి ఆహారం తీసుకోలేదని, నీళ్లు తాగలేదని, నిద్ర కూడా పోలేదని తెలిసింది. శనివారం ఉదయం 6.30 గంటలకే రిలీజింగ్ ప్రాసెస్ పూర్తి కావడంతో 6.49 గంటలకు ఆయన బయటకు వచ్చారు.
భద్రతా పరమైన కారణాల వల్ల మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుక గేట్ నుంచి వెళ్లిపోయారు. కాగా, అల్లు అర్జున్ విడుదల ఆలస్యం కావడంపై జైలు అధికారుల మీద కంటెమ్ట్ వేస్తామని ఆయన తరఫు లాయర్ అశోక్ రెడ్డి తెలిపారు. ‘‘ఆర్డర్స్ అందిన వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ విడుదల చేయలేదు. దీనిపై న్యాయపోరాటం చేస్తం. బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు.
విషమంగానే శ్రీతేజ్ ఆరోగ్యం..
తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగానే ఉందని డాక్టర్లు తెలిపారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ కడల్స్ హాస్పిటల్ డాక్టర్లు ఆర్.చేతన్, విష్ణుతేజ శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీతేజ్ కు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్ సహాయంతో ట్రీట్ మెంట్ అందిస్తున్నట్టు డాక్టర్లు తెలిపారు.
హార్ట్‌రేట్, బ్లడ్ ప్రెజర్, బ్లడ్‌ఫ్లో నిలకడగానే ఉందని.. కానీ అప్పుడప్పుడు జ్వరం వచ్చిపోతున్నదని, ట్యూబ్ ద్వారానే ఆహారం అందిస్తున్నామని వెల్లడించారు. కాగా, శ్రీతేజ్‌ను నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, వైద్య ఖర్చులను తామే భరిస్తామని హామీ ఇచ్చారు.