హైదరాబాద్: పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అందులో భాగంగా అల్లు అర్జున్ను సంధ్య థియేటర్ వద్దకు తీసుకెళ్లి ‘‘అసలు ఆ రోజు ఏం జరిగింది..? ఎలా వచ్చారు..? ఎలా వెళ్లారు..? ఓ సారి చేసి చూపించండి..’’ అని పిన్ టూ పిన్ ఆరా తీయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. సంధ్య థియేటర్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం సంధ్య 35 ఎంఎం థియేటర్లో విడుదల పార్ట్-2 సినిమా ప్రదర్శితమవుతుంది.
సంధ్య 70 ఎంఎం థియేటర్లో పుష్ప-2 సినిమా ప్రస్తుతం నడుస్తోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు రెండన్నర గంటల పాటు బన్నీని పోలీసులు విచారించారు. దాదాపు 20కి పైగా ప్రశ్నలు అడిగారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని తెలిసింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు విచారించారు. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు.
పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా బుధవారం రాత్రి(డిసెంబర్ 4, 2024) హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారు. దీంతో ఆయనను చూసేందుకు జనం ఎగబడటంతో తొక్కిసలాట జరిగి ముసురాంబాగ్కు చెందిన రేవతి చనిపోయింది. ఆమె 11 ఏండ్ల కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆ బాబు ఆరోగ్యం విషమంగా ఉంది. అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్‌పై కేసు రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read:-నాకు తెలియదు.. గుర్తు లేదు..: బౌన్సర్లపై ప్రశ్నలకు.. బన్నీ సమాధానం ఇదే
సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే తొక్కిసలాటకు ప్రధాన కారణం. అల్లు అర్జున్ వస్తాడన్న సమాచారం పోలీసులకు ఇవ్వలేదు. తోపులాట జరగకుండా చూడటంలో యాజమాన్యం విఫలమైంది. అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లేందుకు అనువుగా ఏర్పాట్లు కూడా చేయలేదు. దీంతో అతన్ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అల్లు అర్జున్‌తో కలిసి థియేటర్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. లోపల ఉన్నోళ్లు బయటికొచ్చేందుకు ట్రై చేయడంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ హెల్త్ కండీషన్ సీరియస్‌గా ఉన్నది.