ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ నేపథ్యంలో అరెస్ట్ అయ్యి ఈరోజు (శనివారం 14) ఉ 6:30 గంటల ప్రాంతంలో చంచల్ గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. దీంతో పత్రికా విలేఖర్ల సమావేశంలో పాల్గొన్నాడు. ఇందులోభాగంగా సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ అనుకోకుండా జరిగిందని అన్నాడు. అలాంటి ఘటన ఎవరు ఊహించలేదు.. నిజంగా అలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఈ సంఘటన జరిగిన సమయంలో మేం సినిమా థియేటర్లో ఉన్నామని కానీ మహిళ మృతి చెందిన విషయం తెలిసి చాలా బాధేసిందని తెలిపాడు. అలాగే మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అండగా ఉంటామని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఎటువంటి సహాయం అవసరమైనా తమకి సాధ్యమైనంతవరకూ చెయ్యడానికి ప్రయత్నిస్తామని తెలిపాడు. ఇక త్వరలోనే రేవతి కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పుకొచ్చాడు. ఈ కష్టకాలంలో తనకి అండగా ఉంటూ సపోర్ట్ గా నిలిచినా ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు తెలిపాడు.
Also Read : అల్లు అర్జున్ ఇంటికి వస్తున్న సినీ ప్రముఖులు..
ఇదే ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ కూడా మాట్లాడారు. ఇందులోభాగంగా మీడియా వారికి ప్రత్యక్షంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఈక్రమంలో నిన్నటి నుంచి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్న నేషనల్ మీడియాకు కూడా స్పెషల్ థాంక్స్ తెలిపాడు. ఇక బన్నీ సినిమాలను, ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్, నేషనల్ మీడియాకు థాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చానని అన్నారు.
ఈ విషయం ఇలా ఉండగా పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా అల్లు అర్జున్ బుధవారం (డిసెంబర్ 04) రాత్రి 9:30 గంటలకి హైదరాబద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ కి వెళ్ళాడు. ఇదే సమయంలో రేవతి అనే మహిళ తన భర్త పిల్లలతో కలసి సినిమా చూసేందుకు వచ్చింది. అయితే అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి రేవతి అక్కడిక్కడే మృతి చెందింది. రేవతి కుమారుడు శ్రీ తేజ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.
దీంతో అల్లు అర్జున్ టీమ్ స్పందిస్తూ మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షలు నష్ట పరిహారం ప్రకటించారు. అయితే ఈ ఇన్సిడెంట్ పై సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ టీమ్ పై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.