- సంధ్య థియేటర్ ఘటనపై కేసు కొట్టివేయండి
హైదరాబాద్, వెలుగు: పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట వల్ల ఓ మహిళ మృతి చెందిన ఘటనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హీరో అల్లు అర్జున్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. అల్లు అర్జున్ రాక కారణంగానే తొక్కిసలాట జరిగిందని, దీంతో తన భార్య రేవతి మృతి చెందిందని, కుమారుడు, కుమార్తె గాయపడ్డారంటూ ఎం.భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ జరపడం చట్టప్రక్రియను దుర్వినియోగం చేయడమేనన్నారు.
పుష్ప2 సినిమాపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారన్నారన్నారు. ఈ నేపథ్యంలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుందని, ఇందులో మహిళ మృతిచెందడం బాధాకరమన్నారు. సినిమా విడుదల సందర్భంగా థియేటర్‌కు రావడం సహజమేనని, గతంలో పలుసార్లు సినిమా ప్రదర్శనల సమయంలో థియేటర్లకు వెళ్లానని చెప్పారు. గతంలో ఇలాంటివి చోటుచేసుకోలేదన్నారు. తన రాక గురించి థియేటర్ నిర్వాహకులకు, ఏసీపీ తదితర పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
ఇందులో తన నిర్లక్ష్యమేమీ లేదన్నారు. ఫిర్యాదుదారు ఆరోపణలు అవాస్తవమని, కేవలం తన రాక కారణంగానే ఈ సంఘటన జరిగిందని, దీనికి తానే బాధ్యుడని పేర్కొనడం సరికాదన్నారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, అరెస్ట్‌తో సహా విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. సంధ్య థియేటర్ మేనేజ్మెంట్, థియేటర్ భాగస్వాములు విడిగా మంగళవారం ఇదే తరహా పిటిషన్ వేశారు. వీటిని గురువారం హైకోర్టు విచారణ చేయనుంది.