
భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ‘పుష్ప 2 ది రూల్’ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.500 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని సక్సెస్ చేసిన ఇండియన్స్ అందరికీ థ్యాంక్స్. నాకు పేరొచ్చినా, మా టీమ్‌కు పేరొచ్చినా అన్నింటికీ డైరెక్టర్ సుకుమార్ గారే కారణం. ప్రాంతీయ సినిమా స్థాయిలో మొదలై ఏడాది ఏడాదికి ఎదుగుతూ ఈ చిత్రంతో దేశంలోనే టాప్ గ్రాస్‌లో ఒకటిగా నిలవడం ఆనందంగా ఉంది.
టికెట్ రేట్స్ విషయంలో మాకు సపోర్ట్ చేసిన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు థ్యాంక్యూ. ఏపీ డిప్యూటీ సీఎం, పర్సనల్‌గా మా కళ్యాణ్ బాబాయ్‌కి థ్యాంక్యూ సో మచ్. సినిమా పెద్ద స్థాయిలో వెళ్తుంది. తెలుగు వారంతా గర్వించే స్థాయికి చేరుకుంటుందని అనుకుంటున్నా. ఇలాంటి సినిమాలో నటించినందుకు గర్వంగా ఉంది’ అని చెప్పాడు. అలాగే సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని, త్వరలోనే ఆ ఫ్యామిలీని వ్యక్తిగతంగా కలుస్తానని చెప్పాడు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ ‘థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని ప్రతి నిమిషం ఎంటర్‌టైన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశా. దీనికోసం మా టీమ్ అంతా అహర్నిశలు కష్టపడ్డాం’ అని అన్నారు. ‘ఈ చిత్రానికి అన్నిచోట్ల నుంచి ట్రెమండెస్ రెస్పాన్స్ వస్తోంది. ఫాస్టెస్ట్ గా రూ.500 కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. మరింత విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం’ అని నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ చెప్పారు.