
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణకు సంబంధించి తన ఇంటిని కూల్చొద్దని కాంగ్రెస్ నేత, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాల విషయంపై మరోసారి ఆలోచన చేయాలని కోరుతూ ఆదివారం వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశపై ఆయన ‘వెలుగు’తో మాట్లాడుతూ.. మహారాజ్ అగ్రసేన్ నుంచి రోడ్ నంబర్ 45లో రోడ్డు విస్తరణకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు మరోసారి ఆలోచన చేయాలని కోరారు.
తాను 25 ఏండ్లుగా ఇక్కడ ఉంటున్నానని.. ఒక్కసారిగా ఇప్పుడు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటే ఎలా అని ప్రశ్నించారు. ‘‘కేబీఆర్ పార్కు చుట్టూ ఈ రోడ్డును వంద ఫీట్లతో నిర్మించారు. ఆ సమయంలో పార్కు సైడ్‌లో కొంత రోడ్డు వదిలిపెట్టారు. ఆ స్థలంలో రోడ్డు డెవలప్ చేస్తే సరిపోతుంది. పార్కు చుట్టూ ఒక్కో దగ్గర ఒక్కో విధంగా రోడ్డు ఉంది. ముందుగా పార్కు చుట్టూ వంద ఫీట్ల రోడ్డు వేయాలి”అని ఆయన అన్నారు.