- మహిళ చనిపోయిందని పోలీసులు చెప్పినా
- సినిమా చూసిండు: మంత్రి వెంకట్‌రెడ్డి
- బయటికొచ్చి చేతులు ఊపుకుంటూ పోవుడు ఏంది?.. కనీస మానవత్వం లేదా?
- సీఎం తప్పుగా మాట్లాడారని అనడం సరికాదు
- అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
యాదగిరిగుట్ట, వెలుగు: సంధ్య టాకీస్ ఘటనలో రేవతి చనిపోవడానికి అల్లు అర్జునే కారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఈ నెల 4న బౌన్సర్లను తీసుకుని సినిమా థియేటర్‌కు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని తెలిపారు. చేసిందంతా చేసి తిరిగి సీఎం రేవంత్ రెడ్డి మీదే కామెంట్లు చేయడం సరికాదన్నారు. సీఎంకు అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలో ఆదివారం మంత్రి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పిన వివరాలే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడిండు.
ఆయన చేసిన కామెంట్లు హాస్యాస్పదంగా ఉన్నయ్. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని, ఆమె కొడుకు పరిస్థితి సీరియస్‌గా ఉందని అల్లు అర్జున్‌కు పోలీసులు చెప్పినా పట్టించుకోలేదు. బయటికొచ్చి చేతులు ఊపుకుంటూ పోవడం ఏంటి? కనీస మానవత్వం లేదా? ప్రాణం పోయిందని చెప్పినా.. సినిమా చూస్తూ ఎంజాయ్ చేశాడు. సంధ్య థియేటర్ ఘటనలో బాధిత ఫ్యామిలీని పరామర్శించలేదు. ఇండస్ట్రీ పెద్దలంతా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టడం ఏంటి?’’ అని మంత్రి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
శ్రీతేజ్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నం
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను అల్లు అర్జున్ తప్పుబట్టడమంటే ఆయన్ను అవమానించినట్టే అని మంత్రి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ‘‘చేసిదంతా చేసి.. తిరిగి సీఎం రేవంత్ రెడ్డినే తప్పు మాట్లాడారని అల్లు అర్జున్ అనుడేంది? దానికి కేటీఆర్, హరీశ్ రావు మద్దతు తెలపడం అసహ్యంగా ఉన్నది. అల్లు అర్జున్ వెంటనే సీఎం రేవంత్ రెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
తన తప్పు సరిదిద్దుకోవాలి. రేవతి కొడుకు శ్రీతేజ్‌కు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించాం. ఎంత ఖర్చు అయినా.. ప్రభుత్వమే భరిస్తది. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవు. ఎక్స్ట్రా షోలకు టికెట్ ధరలు పెంచం. సినిమా రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటది. అంబేద్కర్‌ను అవమానించేలా కామెంట్లు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’అని మంత్రి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.