- గడ్డం, కత్తిరించిన జుట్టుతో కోర్టుకు అల్లు అర్జున్
హైదరాబాద్, వెలుగు: హీరో అల్లు అర్జున్ గెటప్ మారింది. పుష్ప 2 షూటింగ్ కోసం పెంచిన గడ్డం, జుట్టు కత్తిరించి మాస్ లుక్ నుంచి క్లాస్ లుక్‌లోకి చేంజ్ అయ్యారు. గెటప్ మార్చి న్యూలుక్లో శనివారం నాంపల్లి కోర్టుకు వచ్చారు. పర్సనల్ బాండ్, రూ.50 వేలు పూచికత్తు, ఇద్దరు ష్యూరిటీలను కోర్టుకు అందించారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, ఆయన పర్సనల్ మేనేజర్ షూరిటీలుగా ఉన్నారు. సంధ్య థియేటర్ లో తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి సెషన్స్ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
బెయిల్ కండీషన్స్‌లో భాగంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు ష్యూరిటీలు సమర్పించారు. అల్లు అర్జున్ వచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్య అల్లు అర్జున్ కారును జడ్జీల ఎంట్రీ వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచే ఆయన కోర్టు హాల్ వద్దకు వచ్చారు. బెయిల్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ అందించి వెళ్లిపోయారు. ఈ కేసులో ఈ నెల 10న వ్యక్తిగతంగా హాజరుకావల్సి ఉంటుంది. ఆ తరువాత పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేసిన అనంతరం విచారణ ప్రారంభం అవుతుంది.