భారీ స్కాం.. హైటెక్ సిటీలో ఆఫీస్ కూడా ఎత్తేశారు.. ఒక్క హైదరాబాద్లోనే రూ.850 కోట్లకు దెబ్బేశారు..!

భారీ స్కాం.. హైటెక్ సిటీలో ఆఫీస్ కూడా ఎత్తేశారు.. ఒక్క హైదరాబాద్లోనే రూ.850 కోట్లకు దెబ్బేశారు..!

హైద్రాబాద్: హైదరాబాద్లో మరో భారీ స్కాం వెలుగు చూసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో జరిగిన భారీ మోసం బయటపడింది. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫాల్కన్ సంస్థ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క హైదరాబాద్లోనే ఫాల్కన్ సంస్థ రూ.850 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ డైరెక్టర్ కావ్య నల్లూరితో పాటు సంస్థ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెలును పోలీసులు చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు.

దేశవ్యాప్తంగా 6,979 మంది బాధితుల నుంచి 17 వేల కోట్లు వసూలు చేసిన ఈ ఘరానా మోసం గురించి తెలిసి పోలీసులే కంగుతిన్నారు. బ్రిటానియా, గోద్రెజ్, అమెజాన్ వంటి సంస్థలో పెట్టుబడుల పేరుతో మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫాల్కన్కు అనుబంధంగా 14 సంస్థలు ఏర్పాటు చేసి ఈ వసూళ్లకు పాల్పడ్డారు.

ఇదిలా ఉండగా.. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ (FID) సంస్థకు చెందిన ముగ్గురు కీలక వ్యక్తులు తట్టాబుట్టా సర్దేసుకుని ఇప్పటికే దుబాయ్కు పారిపోయారు. FID చైర్మన్ అమర్దీప్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(COO) ఆర్యన్ సింగ్, సందీప్ దుబాయ్కు పారిపోయారు. ఈ ముగ్గురిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 

మొత్తం ఈ సంస్థకు చెందిన 20 మందిపై సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సంస్థకు చెందిన ఆరుగురు ఉద్యోగులు ఇండియాలోనే ఉన్నారని భావిస్తున్న పోలీసులు వీరి కోసం వెతుకులాట సాగిస్తున్నారు. ఈ ఎఫ్ఐడీ సంస్థకు చెందిన బిజినెస్ హెడ్ పవన్ను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

ALSO READ | ఉలిక్కిపడ్డ హైదరాబాద్.. మేడ్చల్లో ‘రక్త చరిత్ర’ మర్డర్.. పట్టపగలు నడిరోడ్డుపై ఎలా చంపారో చూడండి..

FID కంపెనీకి ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్నారు. ఒకరు అమర్ దీప్ కుమార్, మరొకరు వి.కావ్య. మిగిలిన వాళ్లంతా కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కావడం గమనార్హం. పోలీసులు ఏ1గా అమర్ దీప్ కుమార్ పేరును, ఏ2గా కావ్య పేరును చేర్చారు. ఇన్వెస్టర్ల నుంచి ఒక మొబైల్ యాప్ ద్వారా ఈ ఎఫ్ఐడీ సంస్థ డబ్బులను కలెక్ట్ చేసింది.

కనిష్టంగా 15 రోజులు.. గరిష్టంగా ఆరు నెలల కాల పరిమితి వరకూ పెట్టుబడులు పెట్టొచ్చని ఇన్వెస్టర్లను ఈ సంస్థ నమ్మించింది. కొన్ని నెలల పాటు ఇన్వెస్టర్లకు లాభాలను చూపించింది. ఒక పెద్ద మొత్తం కాగానే కుచ్చుటోపీ పెట్టింది. ఈ కంపెనీ ఆఫీస్ హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఉంది. జనవరి 10 నుంచి ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు డబ్బులు ఎగ్గొట్టింది.