కరోనా తర్వాత పెరిగిన సమస్య.. దేశంలో 24శాతం మందికి ఒబెసిటీ

హైదరాబాద్, వెలుగు: మన దేశంలో జనాలు లావైతున్నారు! అసలు వయసుకు, బాడీకీ సంబంధమే లేకుండా ఒబెసిటీ బారినపడుతున్నారు. దేశంలో దాదాపు ప్రతి పది మందిలో ముగ్గురు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామానికి దూరంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–5’లో తేలింది. 2019-–2021 మధ్య కాలంలో నిర్వహించిన ఈ సర్వే ఫలితాలను పార్లమెంటులో సోమవారం ప్రవేశపెట్టిన2023–24 ఆర్థిక సర్వే నివేదికలో భాగంగా   ప్రస్తావించారు. భారతీయుల్లో ఊబకాయం ఎంత మేర పెరిగిందో గణాంకాలతో సహా వివరిస్తూ.. అందుకు దారితీసిన పరిస్థితులపైనా నివేదికలో విశ్లేషించారు. 

ప్రతి పది మంది భారతీయుల్లో ఇద్దరి నుంచి ముగ్గురి వరకూ అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారని వెల్లడించారు. దేశ జనాభాలో1869 ఏళ్ల వయస్సు మధ్య గల స్త్రీ, పురుషులపై ఈ సర్వేను కేంద్రం నిర్వహించింది. సగటున దేశంలో 22.9 శాతం పురుషులు.. 24% మంది మహిళలు స్థూలకాయంతో బాధ పడుతున్నారని సర్వేలో తేలింది. పురుషుల్లో ఊబకాయం గతంలో 18.9 శాతం ఉండగా.. అది ఇప్పుడు 4% పెరిగి, 22.9 శాతానికి చేరింది. మహిళల్లోనూ స్థూలకాయం 20.6% నుంచి 24%కు పెరిగింది. దాదాపు స్త్రీ, పురుషులిద్దరిలో 4% మేర ఊబకాయం సమస్య పెరిగిందని ఈ గణాంకాలను బట్టి అర్థమవుతోంది.

స్థూలకాయం సమస్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఒబెసిటీతో బాధపడుతున్నవారిలో మహిళలు 36.3% మంది ఉండగా.. పురుషులు 31.1% ఉన్నారు. తెలంగాణలో స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో మహిళలు 30.1%.. పురుషులు 32.3% మంది ఉన్నారు. ఏపీలో పురుషులకంటే మహిళల్లోనే ఎక్కువగా ఊబకాయం సమస్య ఉండగా.. తెలంగాణలో పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది.

పరేషాన్ చేసిన లాక్ డౌన్ 

2019–‌‌2021 మధ్య కాలంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశంలో ఊబకాయుల సంఖ్య పెరిగినట్టు సర్వే నివేదించింది. అదేసమయంలో ఆరోగ్యం కోసం ఎడాపెడా తినేయడం కూడా ఊబకాయానికి కారణమైందని విశ్లేషించింది. అయితే, ఒబెసిటీ ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నట్టు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో అధిక బరువుతో బాధపడేవారు 19.3% మాత్రమే ఉండగా.. నగరాలు, పట్టణాల్లో 29.8% మంది ఊబకాయులేనని నివేదికలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల వారు వ్యవసాయం, లేదా ఇతర వృత్తి పనులతో శారీరక శ్రమ చేస్తున్నందున లావెక్కడం లేదనే వాదన వినిపిస్తోం ది. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్న వృద్ధుల జనాభాతోపాటు ఒబెసిటీ ఆందోళన కలిగిస్తోంది. 

బద్దకం.. అనారోగ్యకర ఆహారం

సోషల్ మీడియా, బద్ధకపు అలవాట్లు, అనారోగ్యానికి దారితీసే ఆహారం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని, తద్వారా దేశ ఆర్థికవ్యవస్థపైనా ప్రభావం ఉంటుందని సర్వే పేర్కొంది. అధిక చక్కెర, కొవ్వు ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునే అలవాటు పెరిగిందని, సగానికి పైగా అనారో గ్యసమస్యలకు ఈ తరహా ఆహారపు అలవాట్లే కారణమని తెలిపింది. వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ గణాంకాల ప్రకారం.. ఇండియాలోని పెద్దల్లో ఊబకాయం రేటు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు అంచనా. ఇది చిన్నారుల్లోనూ వేగంగా పెరుగుతోందని.. ఈ విషయంలో వియత్నాం, నమీబియా తర్వాత భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది.  

విద్యపై కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలి

దేశంలో విద్యా రంగం మెరుగుదల కోసం కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఎకనమిక్ సర్వే తేల్చిచెప్పింది. నూతన విద్యా విధానం (2020) అమలుతో సమీప భవిష్యత్తులోనే థర్డ్ స్టాండర్డ్ పాస్ అయిన విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, లెక్కల పరిజ్ఞానం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. విద్యతో సహా సోషల్ సర్వీసులపై ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం నిరుడు రూ.21.49 లక్షల కోట్లు కాగా.. ఈ ఏడాది 9.36% అధికంగా రూ.23.50 కోట్లకు చేరనుందని పేర్కొంది. 2024 ఫైనాన్షియల్ ఇయర్​లో విద్యపై రూ.8.28 లక్షల కోట్లు వ్యయం చేయగా.. 2023 ఏడాది(రూ.7.68 లక్షల కోట్లు) కంటే ఇది 8% ఎక్కువని వివరించింది.

వృద్ధుల సంక్షేమానికి చర్యలు అవసరం

దేశంలో వేగంగా పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వాళ్ల సంక్షేమం కోసం కొత్త పాలసీలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఎకనమిక్ సర్వే తెలిపింది. ప్రస్తుతం దేశంలో వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ఎల్డర్లీ కేర్ ఇండస్ట్రీ విలువ  రూ.57,881 కోట్ల మేరకు ఉందని పేర్కొంది. 60 నుంచి 69 ఏండ్ల మధ్య వయస్కులకు ఏజ్ ఫ్రెండ్లీ జాబ్స్ కల్పించడం వల్ల జీడీపీ యావరేజ్​గా 1.5% పెరుగుతుందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్టును కూడా సర్వే ప్రస్తావించింది. 2050 నాటికి వృద్ధుల జనాభా 34.7 కోట్లకు పెరుగుతుందని కూడా తెలిపింది.

తిండి, మెంటల్ హెల్త్ పై దృష్టిపెట్టాలె

దేశంలో పెరుగుతున్న జనాభాను ప్రయోజనకరంగా మలచుకోవాలంటే ఇటు ప్రభుత్వం, అటు ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఆర్థిక సర్వే సూచించింది. ప్రజల ఆహారపుటలవాట్లు సమతుల, విభిన్న ఆహారం దిశగా మారితేనే ఆరోగ్య ప్రమాణాలు పెరుగుతాయని తెలిపింది. దేశంలో వైద్య చికిత్సల కోసం చేస్తున్న ఖర్చులో 56.4 శాతం భారానికి అనారోగ్యకర ఆహారమే కారణమన్న ఐసీఎంఆర్ రిపోర్ట్​నూ ప్రస్తావించింది. ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత శారీరక శ్రమ చేయడం ద్వారా దీనిని తగ్గించుకోవచ్చని సూచించింది.