సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి, వెలుగు: పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే చెప్పారు. శనివారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఈసేవా కేంద్రం, కోదాడలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను హైకోర్టు జడ్జిలు జస్టిస్ టీ. వినోద్, జస్టిస్ కే. లక్ష్మణ్, జస్టిస్ బీ.విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ పుల్లా కార్తీక్‌తో కలిసి ప్రారంభించారు.
అనంతరం కోదాడలో రూ. 25 కోట్లతో చేపట్టిన నూతన కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివాహ సంబంధాల వివాదాలతో న్యాయం కోసం కోర్టుకు వస్తున్న మహిళలకు సత్వర న్యాయం చేయాలని సూచించారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాటిచ్చారు.
అంతకముందు కోర్టులో పోలీస్ గౌరవవందనం స్వీకరించారు. అనంతరం బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో పలు సమస్యలపై జడ్జిలకు వినతి పత్రం అందించారు. ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రాజగోపాల్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీవాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె. సురేష్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రశాంతి, కోదాడ జూనియర్ సివిల్ జడ్జి భవ్య, కలెక్టర్ వెంకట్‌రావు,ఎస్పీ రాహుల్ హెగ్డే, హైకోర్టు పీపీ పల్లా నాగేశ్వరరావు, ఆర్డీవో సూర్యనారాయణ, మాజీ మంత్రి రామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.