చొప్పదండి, వెలుగు : బీఆర్ఎస్సర్కార్ మోసాలను ఎండగట్టి, ఫాంహౌజ్‌లో పడుకున్నోన్ని ధర్నా చౌక్‌కు గుంజుకొచ్చానన్న అక్కసుతో కేసీఆర్తనను ఓడగొట్టాలని కుట్ర చేస్తున్నాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బుధవారం బీఆర్ఎస్ తో పాటు వివిధ పార్టీల లీడర్లు, ముదిరాజ్ సంఘం నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ లీడర్లు దేశం, ధర్మం గురించి మాట్లాడుతున్న తనను కించపర్చేలా మాట్లాడుతున్నారని, తాను వాళ్ల లెక్క దేవుడిపై ఒట్టేసి హామీలు అమలు చేయకుండా మోసం చేయడం లేదన్నారు. ‘కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో నేటికీ తెలియదు.. ఒకాయన పార్టీకి, సీఎంకు చెప్పకుండా వెలిచాల రాజేందర్‌ను తీసుకుపోయి నామినేషన్ వేయించాడట.
ఈ విషయం తెలిసి సీఎం, హైకమాండ్ గరం అయ్యిందట. ఇయ్యాళ అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా నామినేషన్ వేసిండు. గురువారం నామినేషన్లకు ఆఖరు తేదీ అయినా అభ్యర్థి ఎవరో తేల్చుకోలేకపోతున్న అసమర్థ కాంగ్రెస్‌నేతలు బీజేపీని ఓడిస్తామని బీరాలు పలుకుతుంటే నవ్వొస్తుంది’ అని ఎద్దేవా చేశారు. ‘ఆగస్టు 15న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తారట. ఎన్నికల్లోపే ఎందుకు చేయలేదు..ఎన్నికల కోడ్ అయిపోగానే జూన్ 4న రుణమాఫీ చేయవచ్చు కదా.. ఎందుకు చేయరు? పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓట్లు దండుకోవాలని ప్లాన్ వేసింది..అందుకే ఈ కపట నాటకమాడుతూ దేవుడిమీద ఓట్టేసి రాజకీయం చేస్తున్నారు’అని ఆరోపించారు. 6 గ్యారంటీలను అమలు చేయాలని నిలదీస్తుంటే తనను ఓడించడానికి బీఆర్ఎస్ తో కలిసి కాంగ్రెస్ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ పాల్గొన్నారు.