సోయిలేని లీడర్లను నిలదీయండి: పాయల్​శంకర్​

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ఎమ్మెల్యే జోగు రామన్నకు ముందుచూపు లేకనే నియోజకవర్గంలో వరదలకు భారీ నష్టం జరిగిందని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్​శంకర్​మండిపడ్డారు. సోయిలేని ఎమ్మెల్యేతోపాటు, బీఆర్​ఎస్​లీడర్లను నిలదీయాలన్నారు. శనివారం ఆయన జైనథ్, బేలా, ఆదిలాబాద్​రూరల్​మండలంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. నియోజకవర్గంలో వంతెనలు రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైందని.. ఇందుకు ఎమ్మెల్యే బాధ్యత వహించాలని డిమాండ్​చేశారు.

నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలి

నిర్మల్: భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోన్ మండలంలోని గాంధీనగర్, షాకెర గ్రామాల్లో బీజేపీ నాయకులు పర్యటించి నష్టపోయిన పంటలు, దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. అనంతరం కార్యకర్తలతో సమావేశం నిర్వహించగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం నాలుగేండ్లుగా పంటలు నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం అందించలేదన్నారు. ఈ ఏడాదైనా ఇవ్వాలని డిమాండ్​చేశారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మేకల అశోక్, ఎంపీపీ హరీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించాలి

మంచిర్యాల: మంచిర్యాలలోని వరద బాధితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించాలని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. శనివారం పార్టీ జిల్లా ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల కొన్నేండ్లుగా మంచిర్యాలలోని కాలనీలు మునుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వరదలను అరికట్టడానికి రాళ్లవాగుకు కరకట్టలు నిర్మించాలని, ఇప్పటివరకు జరిగిన నష్టానికి పరిహారం అందించాలని కోరారు.