- అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి
- ఈ సెప్టెంబర్ నుంచే అమలు.. అక్టోబర్లోమరో గ్రూప్–-1 నోటిఫికేషన్
- -నవంబర్‌లో మళ్లీ టెట్.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ
- మే, జులైలో గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్
- ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్‌లో..
- వైద్యారోగ్యశాఖ, గురుకుల, ట్రాన్స్‌కో, సింగరేణి ఉద్యోగాలకు
- నోటిఫికేషన్స్.. జనవరి నుంచి నవంబర్ దాకా పోటీ పరీక్షలు
హైదరాబాద్, వెలుగు : ఏటా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేసి, పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక ప్రణాళికాబద్ధంగా.. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేశారు.
ఏయే ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారనే విషయాలను క్యాలెండర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతల గురించి అందులో పొందుపర్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్-–1 మెయిన్స్ పరీక్షలు అక్టోబరులో, గ్రూప్-–2ను డిసెంబర్లో, గ్రూప్-–3 ఎగ్జామ్స్ నవంబర్‌లో నిర్వహించనున్నారు. ఏడాదిలో మరో 17 నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు జాబ్‌క్యాలెండర్‌లో పొందుపరిచారు.
కొత్తగా గ్రూప్-1,2,3 నోటిఫికేషన్లు
టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్–-1కు ఈ ఏడాది అక్టోబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చి.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రిలిమ్స్.. జులైలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-–2కు వచ్చే ఏడాది మే నెలలో నోటిఫికేషన్ఇచ్చి.. అక్టోబర్‌లో ఎగ్జామ్ పెట్టనున్నారు. గ్రూప్-–3కి ప్రతి ఏటా జులైలో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్‌లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం ఈ సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. టీజీ ట్రాన్స్‌కో, టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్ల లోని ఇంజినీరింగ్, వివిధ ఉద్యోగాల కోసం రాబోయే అక్టోబర్‌లో నోటిఫికేషన్‌ను విడుదల చేసి.. వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు పెట్టనున్నారు.
సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జులైలో నోటిఫికేషన్ ఇచ్చి.. నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి.. ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ సర్వీసెస్ లో గెజిటెడ్ కేటగిరీకి సంబంధించి ఈ ఏడాది అక్టోబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చి.. వచ్చే ఏడాది జనవరిలో పరీక్ష నిర్వహించనున్నట్టు క్యాలెండర్‌లో పేర్కొన్నారు.
మళ్లీ టెట్, డీఎస్సీ.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్
జాబ్ క్యాలెండర్ ప్రకారం మరోసారి నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మరోసారి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి.. ఏప్రిల్‌లో ఎగ్జామ్స్పెడతారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి .. వీటికి మేలో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇక పోలీసు ఉద్యోగాల విషయానికొస్తే.. తెలంగాణ ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి.. ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్‌లో నోటిఫికేషన్స్ ఇచ్చి..సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ రిలీజ్
ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నం. అధికారంలోకి రాగానే 32,410 మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందజేశాం. మరో 13,505 ఉద్యోగాల నియామకం చివరి దశకు చేరుకున్నది. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల వాయిదాలతో నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జాబ్ వైజ్‌గా నోటిఫికేషన్స్.. పరీక్షలు నిర్వహించే నెలలు
ఉద్యోగం నోటిఫికేషన్ ఎప్పుడు పరీక్ష ఎప్పుడు
(నెల) (నెల)
డిగ్రీ లెక్చరర్స్, అకడమిక్ పోస్టులు జూన్ 2025 సెప్టెంబర్ 2025
లైబ్రేరియన్స్, పీడీలు, ఇతర ఈక్విలెంట్
రెసిడెన్షియల్ డిగ్రీ లెక్చరర్స్ జూన్ 2025 సెప్టెంబర్ 2025
ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు(సింగరేణి) జూలై 2025 నవంబర్ 2025
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి 2025 మే 2025
టెట్ (ఈ ఏడాది రెండోసారి) నవంబర్ 2024 జనవరి 2025
టెట్ వచ్చే ఏడాదిలో ఏప్రిల్ 2025 జూన్ 2025
డీఎస్సీ ఫిబ్రవరి 2025 ఏప్రిల్ 2025
ఎస్ఐ (సివిల్/ ఈక్విలెంట్) ఏప్రిల్ 2025 ఆగస్టు 2025
కానిస్టేబుల్ (సివిల్/ ఈక్విలెంట్)
ప్రిలిమనరీ రాతపరీక్ష ఏప్రిల్ 2025 ఏప్రిల్ 2025
ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్,
నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు పోస్టులు సెప్టెంబర్ 2024 నవంబర్ 2024
ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్,
ఎన్పీడీసీఎల్ ఇంజనీరింగ్ పోస్టులు అక్టోబర్ 2024 జనవరి 2025
గెజిటెడ్ కేటగిరీ ఇంజినీర్స్ అక్టోబర్ 2024 జనవరి 2025
గెజిటెడ్ ఆఫీసర్ స్కేల్ పోస్టులు జనవరి 2025 ఏప్రిల్ 2025
గ్రూప్ 1 ప్రిలిమ్స్ అక్టోబర్ 2024 ఫిబ్రవరి 2025
గ్రూప్ -1 మెయిన్స్ అక్టోబర్ 2024 జులై 2025
గ్రూప్ 2 (ఎఫ్ఆర్ఓ పోస్టులు కలిపి) మే 2025 అక్టోబర్ 2025
గ్రూప్ 3 (గ్రూప్ 4 పోస్టులు కూడా) జూలై 2025 నవంబర్ 2025
(ఇప్పటికే నోటిఫికేషన్లు వచ్చినవి)
గ్రూప్ 1 మెయిన్స్ (ఇష్యూడ్) ఈ ఏడాది అక్టోబర్
21వ తేదీ నుంచి 27 వరకు
గ్రూప్ -2 (ఇష్యూడ్ ) డిసెంబర్ 2024
గ్రూప్ -3 (ఇష్యూడ్ ) నవంబర్ 2024