గతం కంటే మస్తు వానలు
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 45% ఎక్కువ కురిసినయ్
14 జిల్లాల్లో అత్యధికం, 12 జిల్లాల్లో అధికం
వనపర్తి జిల్లాలో 150% ఎక్కువగా పడ్డయ్
మరో 4 రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మస్తుగా వానలు పడుతున్నాయి. రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి ముంచెత్తుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి దాకా నార్మల్ కంటే 45 శాతం ఎక్కువగా వర్షాలు కురిశాయి. జూన్ 1 నుంచి శనివారం వరకు సాధారణ వర్షపాతం 67.45 సెంటీ మీటర్లుగా అంచనా వేయగా.. 97.94 సెంటీ మీటర్లు రికార్డయింది. అంటే 30.49 సెంటీ మీటర్లు ఎక్కువగా వానలు పడ్డాయి. 14 జిల్లాల్లో అత్యధికం, 12 జిల్లాల్లో అధికం, 7 జిల్లాల్లో నార్మల్ రెయిన్‌ఫాల్ రికార్డయింది.
రాష్ట్రమంతా ఒక్క సెప్టెంబర్‌లోనే 19 రోజుల్లో నార్మల్ కంటే 82 % ఎక్కువగా వాన కురిసింది. ఈ నెల 1 నుంచి శనివారం వరకు 8.18 సె.మీ సాధారణ వర్షపాతం అంచనా వేస్తే.. 14.89 సె.మీ రికార్డయింది. జూన్‌లో 34 శాతం, జులైలో 9 శాతం, ఆగస్టులో 78 శాతం ఎక్కువగా వర్షాలు కురిశాయి.
వనపర్తిలో అతి ఎక్కువ.. నిర్మల్‌లో అతి తక్కువ
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈసారి వానలు పుష్కలంగా కురుస్తున్నాయి. 14 జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు కురిశాయి. మరో 12 జిల్లాల్లోనూ అధికంగా పడ్డాయి. మిగతా 7 జిల్లాల్లో నార్మల్ రెయిన్ ఫాల్ రికార్డయింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు వనపర్తి జిల్లాలో నార్మల్ కంటే 150% అధికంగా వర్షాలు కురిశాయి. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, ములుగు, నారాయణపేట జిల్లాల్లో నార్మల్ కంటే 60 నుంచి 130 % ఎక్కువగా వానలు పడ్డాయి. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అంచనా వేసిన నార్మల్ కంటే 20 నుంచి 60% ఎక్కువగా వానలు పడ్డాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నిర్మల్ జిల్లాలో నార్మల్ కన్నా 15 శాతం తక్కువగా రెయిన్‌ఫాల్ నమోదైంది. ఇక్కడ 90.3 సె.మీ వర్షపాతం అంచనా వేయగా.. 76.6 సెంటీమీటర్లు మాత్రమే రికార్డయింది.
మూడు రోజులుగా జోరు వాన
రాష్ట్రంలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పొంగుతున్నాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు రంగారెడ్డిలోని ఇబ్రహీంపట్నంలో 13 సె.మీ, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లోని సిర్పూర్, జోగులాంబ గద్వాలలోని అగ్రహారంలో 8 సె.మీ, మహబూబ్‌నగర్‌లోని చిన్నచింతకుంట, నాగర్ కర్నూల్‌లోని అచ్చంపేట, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లోని కాగజ్‌నగర్‌లో 7 సె.మీవర్షపాతం రికార్డయింది.
రాబోయే 4 రోజులు పెద్ద వానలు
రాష్ట్రంలో పలు చోట్ల ఆదివారం నుంచి నాలుగు రోజులు పెద్ద వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ ఆఫీసర్ రాజారావు చెప్పారు.
నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నవాబుపేట మండలంలోని లోతట్టు గ్రామం దొడ్డిపల్లి శనివారం ఉదయం నీట మునిగింది. ఆకులోనికుంట నీళ్లతో పాటు ఎగువనుంచి వరద పోటెత్తడంతో ఎనిమిది ఇండ్లు పూర్తిగా మునిగిపోయాయి. అడ్డాకుల మండలంలో ఓ కోళ్ల ఫారంలో వరద నీరు చేరడంతో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. మల్దకల్ మండలంలో ఓ పవర్ ప్లాంట్‌ను వరద ముంచెత్తడంతో ఉద్యోగులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. బెంగళూరు–హైదరాబాద్ నేషనల్ హైవేకు కొద్దిలో ముప్పు తప్పింది. అడ్డాకుల మండలం శాఖాపూర్ చెరువు నుంచి భారీగా నీరు హైవే వైపు వచ్చి రోడ్డు కొట్టుకుపోయింది. రోడ్డు కుంగిపోవడం, ట్రాఫిక్ పెద్దగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆఫీసర్లు జేసీబీ తెప్పించి రిపేర్లు చేయించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షాలకు ముగ్గురు మృతి
శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు కురిశాయి. భారీ వర్షాలకు నాగర్ కర్నూల్‌లో ఒకరు, నారాయణపేట జిల్లాలో ఇద్దరు చనిపోయారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వాగులో పడి యువకుడు గల్లంతయ్యాడు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం బాలన్‌పల్లిలో మట్టి గోడ కూలి ఆరేండ్ల చిన్నారి పూజ మృతి చెందింది. పాప తల్లిదండ్రులు మమత, భీమయ్యను ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి పరామర్శించిపదివేలు అందజేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నారాయణపేట జిల్లా పెరపళ్ళ శివారులోని నీటి కుంటలో పడి బాలు అనే వ్యక్తి చనిపోయాడు. ఊట్కూరు మండలం లక్ష్మీపల్లి శివారులోని వరిచేనులో పడి గుర్తు తెలియని వ్యక్తి, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం దుందుభి వాగులో అఫ్రోజ్ (21) అనే యువకుడు ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు.
For More News..