- మరింత లోతుకు భూగర్భ జలాలు
- నెలలోనే 1.30 మీటర్లు తగ్గుముఖం
- నీరందక వాడిపోతున్న వరి పొలాలు
- ఇప్పటికే 6 వేల ఎకరాల్లో ఎండిన పంటలు
- అగమ్యగోచరంగా రైతుల పరిస్థితి
యాదాద్రి, వెలుగు: గతేడాది వర్షాభావ పరిస్థితులు, ఈ ఏడాది మండుతున్న ఎండలతో యాదాద్రి జిల్లాలో పంటలు ఎండుతున్నాయి. భూగర్భ జలాలు కూడా అడుగంటడంతో బోర్లు పోయడం లేదు. దీంతో పంటలు ఎలా కాపాడుకోవాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
2.93 లక్షల ఎకరాల్లో సాగు..
వానలు సరిగా కురవకపోవడంతో ఈసారి వరి సాగు తగ్గుతుందని అగ్రికల్చర్ఆఫీసర్లు అంచనా వేశారు. రైతులు కూడా వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే, వారి అంచనాలకు భిన్నంగా గతేడాది మాదిరిగానే ఈ యాసంగిలోనూ రైతులు 2.93 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు.
అడుగంటిన భూగర్భ జలాలు..
జిలాల్లో బోర్లపై ఆధారపడి వరి సాగు ఎక్కువగా చేస్తున్నారు. 2.93 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేస్తుంటే ఇందులో మూసీ కింద 50 వేల ఎకరాలు సాగు అవుతున్నాయి. మిగిలిన మొత్తం బోర్ల కిందనే సాగు అవుతోంది. వానలు సరిగా కురవకపోవడంతో గతేడాది కంటే ఈసారి భూగర్భ జలాలు మరింత తగ్గిపోయాయి. జిల్లా యావరేజీగా గతేడాది జనవరిలో 4.91 మీటర్ల దిగువన జలాలు ఉండగా, ఈ ఏడాది జనవరికి 7.29 మీటర్లకు పడిపోయి 2.38 మీటర్ల తేడా చూపింది. ఈ ఏడాది జనవరి 7.29 మీటర్ల లోతులో ఉంటే ఫిబ్రవరికి 8.59 మీటర్లకు పడిపోయి ఒక్క నెలలోనే 1.30 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయాయి.
ఎండిన ఆరు వేల ఎకరాలు..
లెక్క ప్రకారం ఈనెల మొదటి వారంలోనే కోతలు చేపడుతారు. వచ్చే నెలలో ఊపందుకుంటాయి. ఈసారి కాలం సరిగా కావడం లేదన్న ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నాట్లు వేశారు. దీంతో పంట కాలంలో కొంత తేడా వచ్చింది. ఎండలు బాగా కొడుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటడం వల్ల వ్యవసాయ బోర్ల నుంచి నీరు సరిగా వస్తలేదు. దాదాపు అన్ని బోర్లు ఆపి పోస్తున్నాయి. పొలాలకు సరిగా నీరందక పొట్ట దశలో వరి పంట ఎండిపోతోంది. జిల్లాలో ఇప్పటికే ఆరు వేల ఎకరాల్లో వరి పండ ఎండిపోయింది. ఎక్కువగా వలిగొండ, సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్, రాజాపేట మండలాల్లో పంట ఎండిపోయింది. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
తగ్గనున్న పంట దిగుబడి..
కాలం సరిగా అయితే యాసంగిలో ఎకరాకు 22 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈసారి దిగుబడి తగ్గుతుందని, ఎకరాకు 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. ఈ సీజన్లో 5.40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఉన్నతాధికారులకు నివేదించారు. ఆరు వేల ఎకరాల్లో వరి ఎండిపోయిందని అంచనాలు వేసినా వాస్తవానికి అంతకంటే ఎక్కువ ఎకరాలే ఎండిపోయిందని తెలుస్తోంది. ఆఫీసర్ల అంచనాతో దాదాపు 50 వేల టన్నులు దిగుబడి తగ్గే అవకాశం ఉంది.