సెంటర్లు ఓపెన్​ చేసి పది రోజులైనా.. పత్తాలేని కొనుగోళ్లు

సెంటర్లు ఓపెన్​ చేసి పది రోజులైనా.. పత్తాలేని కొనుగోళ్లు
  • క్వింటాల్​ వడ్లు కూడా కొనని అధికారులు 
  • మార్కెట్ యార్డ్ కు వడ్లు తెచ్చి, వ్యాపారులకు అమ్ముకుంటున్న రైతులు

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో 62 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. ఇప్పటి వరకు ఒక క్వింటాలు వడ్లు కూడా కొనలేదు. రైతులు వ్యవసాయ మార్కెట్ కు తమ వడ్లను తెచ్చి అమ్ముకుంటున్నారు. దీంతో రైతులకు దక్కాల్సిన మద్దతు ధర లభించడం లేదు.   ఏ గ్రేడ్ వడ్లకు రూ.2320, సాధారణ వడ్లకు రూ. 2,300 చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని కూడా చెప్పింది. కానీ మార్కెట్ యార్డులో వ్యాపారులు  రూ. 1800 నుంచి 2200 లకే  కొంటున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో రైతులు క్వాంటాలుకు 600 నుంచి 800   వరకు నష్టపోయే పరిస్థితి వచ్చింది.

మూడు రోజుల్లో 5వేల క్వింటాళ్ల కు పైగా మార్కెట్ కు

శని సోమ మంగళవారాల్లో దాదాపు 5వేలకు క్వింటాలకు పైగానే వడ్లు మార్కెట్ యార్డ్ కు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. మంగళవారం తీసుకొచ్చిన వడ్లకు మినిమం రూ. 1800 నుంచి మాక్సిమం రూ. 2200 వరకు వ్యాపారులు రైతుల నుంచి కొన్నారు. జిల్లాలో ఈ వాన కాలంలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల  దిగుబడి వస్తుందని అంచనా వేశారు.

 ఇందుకుగాను 62 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ, రైస్ మిల్లర్ల కేటాయింపు పూర్తి చేయలేదు. దీంతో వడ్లను గద్వాల వ్యవసాయ మార్కెట్ కు పెద్ద ఎత్తున తెచ్చి, మద్దతు ధర కోల్పోతున్నారు. మంగళవారం వ్యవసాయ మార్కెట్ లో వచ్చిన వడ్ల క్వింటాల్ కు 1800 నుంచి 2190 వరకు ధర పలికింది. 

పకడ్బందీగా వడ్లు కొనుగోలు చేయాలి

 జిల్లాలో వడ్ల కొనుగోలును పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సూచించారు. ఇటిక్యాల మండలం తిమ్మాపూర్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ లక్ష్మి నారాయణ తో కలిసి పరిశీలించారు. సెంటర్ లో పలు రికార్డులను పరిశీలించారు. టార్గెట్  ప్రకారం..  వడ్లు కొనుగోలు చేయాలన్నారు. కేంద్రం దగ్గర ఆరబోసిన వడ్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

ఇంకా వడ్లు కొనలే.. 

జిల్లాలో 62 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇంకా ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు. రైతులు వడ్లను ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. స్వామి కుమార్, డీఎస్ఓ, గద్వాల