లేటవుతున్న స్పెషల్ ఫండ్ డెవలప్​మెంట్ పనులు

పెద్దపల్లి, వెలుగు: జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల డెవలప్​మెంట్ కోసం నిధులు మంజూరైనా అధికారుల అలసత్వంతో పనులు ప్రారంభం కావడం లేదు. ఈ ఏడాది ఆగస్టు 29న పెద్దపల్లి కలెక్టరేట్ ఓపెనింగ్ సభలో సీఎం కేసీఆర్​ స్పెషల్ ఫండ్ కింద రూ.30.60 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు ఆ నిధులను ఎలా ఉపయోగించుకోవాలో జీపీలు, మున్సిపాలిటీలు ప్రణాళిక కూడా రూపొందించలేదని తెలుస్తోంది.

రోడ్లు, డ్రైనేజీలకు నిధులు వెచ్చించాలంటున్న ప్రజలు..

కలెక్టరేట్​సభలో స్థానిక సంస్థలకు స్పెషల్ ఫండ్స్​రిలీజ్ చేయాలని సీఎం కేసీఆర్ ను పెద్దపల్లి జడ్పీ చైర్మన్​ పుట్ట మధు రిక్వెస్ట్​చేశారు. దీంతో స్పందించిన సీఎం జిల్లాలోని 266 గ్రామాలకు ఒక్కో జీపీకి రూ.10 లక్షలు,  4 మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం అక్టోబర్​17న ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇందులో 25 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​ ప్రకారం దళితులు, గిరిజన వాడల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నిధులతో ఏ పనులైనా చేసుకునే అవకాశం ఉంది. గ్రామాలు, పట్టాణాల్లో ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం కోసం వెచ్చించాలని ప్రజలు కోరుతున్నారు.

ల్యాప్స్​ అయ్యే ప్రమాదం..

స్పెషల్ ఫండ్ రిలీజ్​కు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయి సుమారు 2 నెలలు గడిచింది. ఇప్పటికీ పనుల ప్రతిపాదనలు ప్లానింగ్ ఆఫీస్​కు చేరకపోవడంతో వచ్చిన నిధులు ల్యాప్స్ అవుతాయేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ జీపీకి రూ.10 లక్షలు, రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్​కు రూ. కోటి చొప్పున మంజూరయ్యాయి. మున్సిపాలిటీలో వార్డులవారీగా నిధులు వినియోగించాలని ప్లాన్ రెడీ చేస్తున్నారు.  డెవలప్​మెంట్ పనుల కోసం రూ.5 లక్షలు మించే క్రమంలో కచ్చితంగా టెండర్లు పిలువాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా అన్ని జీపీలు, మున్సిపాలిటీలలో రూ.5 లక్షలలోపు పనులు గుర్తించే పనిలో ఆయా జీపీలు, మున్సిపాలిటీ అధికారులు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలను నిబంధనలకు అనుగుణంగా సీపీఓ ఆయా మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీఓలకు పంపించారు. గుర్తించిన పనులకు ఇంజనీరింగ్ అధికారులు ఎస్టిమేషన్ వేశారు. స్పెషల్ ఫండ్స్ పనులపై ఆయా జీపీలు, మున్సిపాలిటీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇంతకు ముందుమాదిరిగానే ఎమ్మెల్యేలు, మంథనిలో జడ్పీ చైర్మన్ సూచన మేరకే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సీపీఓకు చేరిన తర్వాత వాటిని కలెక్టర్​కు పంపించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సీపీఓ ప్రోసీడింగ్స్ రిలీజ్ చేస్తారు. అనంతరం పనులు ఎవరికి కేటాయించాలనే నిర్ణయం జరుగుతుంది. అయితే త్వరగా పనులు చేపట్టాలని నిర్ణయించిన సమయంలో ఇవన్నీ జరగకపోతే మంజూరైన నిధులు ల్యాప్స్ అవుతాయని ప్రజలు అధికారులను కోరుతున్నారు.