లక్కీ డ్రా తీసి.. వదిలేసిండ్రు.. ఎనిమిది నెలలైనా డబుల్ బెడ్రూంల పంపిణీ లేదు

  •     మొదటి విడతలో 618 మంది ఎంపిక 
  •     మౌలిక సదుపాయాల భారం కొత్త సర్కార్​ పైనే!
  •     గృహలక్ష్మి పథకం అమలైతే తమ పరిస్థితేంటని లబ్ధిదారుల టెన్షన్ 

ఆదిలాబాద్, వెలుగు: డబుల్​ బెడ్రూం ఇండ్ల జాబితాలో తమ పేరొచ్చిందని మురిసిపోయిన లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. ఎనిమిదేళ్లుగా డబుల్ బెడ్ రూంల కోసం ఎదురుచూసిన ఆదిలాబాద్​మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారుల ఎంపికకోసం 8 నెలల క్రితం లక్కీ డ్రా తీసినప్పటికీ సదుపాయాలు లేవనే కారణంగా ఇప్పటికీ పంపిణీ చేయలేదు. దీంతో అవి బూత్ బంగ్లాలుగా మారిపోతున్నాయి. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్​ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని తీసుకురానుంది. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. డబుల్​బెడ్రూం ఇండ్ల జాబితాలో తమ పేరు వచ్చిందని, కానీ వాటిని పంపిణీ చేయడంలేదని..ఇటు గృహలక్ష్మి పథకానికి కూడా తాము అర్హులం కాలేమని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటివరకు ఒక్క ఇంటినీ పంపిణీ చేయలేదు

ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క ఇంటిని కూడా పంపిణీ చేయలేదు. ఎట్టకేలకు మున్సిపాలిటీలో ఇండ్లు పూర్తయ్యి లక్కీ డ్రా నిర్వహించినా వాటిని లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. మున్సిపలిటీ పరిధిలోని 32 వార్డులకు సంబంధించి డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం గత మే నెలలో కలెక్టర్ అధ్యక్షతన లక్కీ డ్రా నిర్వహించారు. లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ ఇంత వరకు ఇండ్లను కేటాయించలేదు. జిల్లాకు 2015–2016 నుంచి విడతల వారీగా 3,579 ఇండ్లు మంజూరయ్యాయి.

2,335 ఇండ్లు టెండర్లు పూర్తి చేయగా అందులో 1697 ఇండ్లు నిర్మాణ దశలో ఉంటే 638 ఇండ్లు పూర్తయ్యాయి. అయితే ఇందులో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నిర్మించిన ఇండ్లలో ఒక్కటి కూడా పంపిణీ చేయలేదు. కాలం గడుస్తున్నా అధికారులు పంపిణీ చేయకపోవడతో కొన్ని మండలాలు, గ్రామాల్లో పూర్తయిన ఇండ్లలో లబ్ధిదారులు నివాసముంటున్నారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ అర్బన్ లో అధికారికంగా 982 ఇండ్ల పంపిణీకి అధికారులు గతంలో అర్హులను గుర్తించారు. ఇందులో మొదటి విడతగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో నిర్వహించిన లక్కీ డ్రాలో 618 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. 

మౌలిక సదుపాయాలెట్ల?

ఇప్పటికే పూర్తయిన ఇండ్లు పంపిణీ చేయాలంటే వాటిలో కనీస సదుపాయాలు కల్పించాల్సి ఉంది. విద్యుత్, రోడ్లు, తాగునీరు, నాలాలు, ఇతర అవసరాలకు సంబంధించి ప్రత్యేక నిధులు అవసరం. నిర్మాణాలు పూర్తయిన ఇండ్లలో ఇప్పటికే చాలా చోట్ల డోర్లు, కిటికీలు విరిగిపోయాయి. కొన్నిచోట్ల నిర్మాణాల్లో ఉపయోగించిన విద్యుత్ వైర్, పైప్ లు చోరీకి గురయ్యాయి. దీంతో అన్ని రకాల సదుపాయాలు కల్పించిన తర్వాతే ఇండ్లను పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

కానీ కొత్త సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభిస్తే డబుల్ బెడ్రూంల పరిస్థితేంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ క్రమంలోనే తమకు కేటాయించిన ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే మొదటి విడతలో ఆదిలాబాద్ పాత మున్సిపాలిటీ వార్డుల్లోని పేదలకు మాత్రమే ఇండ్లు కేటాయించారు. రెండో విడతలో విలీన గ్రామాల్లోని ఆదిలాబాద్ రూరల్, మావల మండలాల్లోని కాలనీలకు సంబంధించిన లబ్ధిదారులకు రెండో విడత పంపిణీ చేయాల్సి ఉంది. రెండో విడతలో 364 ఇండ్ల కోసం 2365 దరఖాస్తులు రాగా పూర్తి విచారణ తర్వాత 758 మందిని అర్హులుగా గుర్తించారు. మొదటి విడత ఇండ్లు పంపిణీ చేసిన తర్వాతనే రెండో విడతకు లక్కీ డ్రా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఇండ్ల పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. 

వసతులు కల్పించిన తర్వాతే పంపిణీ

డబుల్ బెడ్రూంల కేటాయింపుల కోసం గతంలోనే లక్కీ డ్రా నిర్వహించాం. అయితే ఇంకా ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాల్సి ఉండటంతో పంపిణీ చేయడం లేదు. సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.
- బసవేశ్వర్, నోడల్ అధికారి, గృహనిర్మాణ శాఖ