నల్గొండలో బీజేపీకి బీజం పడింది: ఈటల రాజేందర్

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినా.. నైతిక విజయం ఆయనదేనని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే రాజీనామా చేయడమే శరణ్యం అని అనుకుని బీజేపీ తరపున పోటీకి దిగాడని చెప్పారు. ఎన్నికల్లో రాజగోపాల్ ఓడిపోయినా.. నైతిక విజయం ఆయనదేనని స్పష్టం అయిందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక.. ఓటమిపై బీజేపీ ముఖ్య నేతల సమావేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. అనంతరం వివరాలను ఈటల మీడియాకు వెల్లడించారు. 

ఉప ఎన్నిక సందర్భంగా అధికార దుర్వినియోగం చేసిన అంశాలు, బిజేపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన విషయాలు,  ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక జరుగలేదనే విషయాలను ఈ రోజు సమావేశంలో చర్చించుకున్నామని ఈటల తెలిపారు. కేసీఆర్ కు గోరి కట్టాలంటే బీజేపీతోనే సాధ్యమని.. ప్రజలు కూడా ఇదే నమ్ముతున్నారని చెప్పారు. మునుగోడు నియోజకవర్గ  ప్రజలు రాజగోపాల్ రెడ్డిని అక్కున చేర్చుకున్నారని..నల్గొండలో బీజేపీకి బీజం పడిందన్నారు. రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగుర వేయడమే లక్ష్యంగా పని చేస్తామని ఈటల రాజేందర్ తెలిపారు.