కంపెనీల్లో కొత్త కొలువుల జోరు

న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతూనే ఉన్నప్పటికీ, నియామకాల జోరు తగ్గడం లేదు. గత నెల ఉద్యోగ నియామకాలు 41 శాతం పెరిగాయి. నౌకరీ డాట్​కామ్ జాబ్‌‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం, 2022 సంవత్సరంలో అన్ని ఇండస్ట్రీల్లో నియామకాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.   ఐటి-, సాఫ్ట్‌‌వేర్, రిటైల్  టెలికాం సెక్టార్లలో జాబ్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది. కార్పొరేట్ ప్రపంచం పుంజుకుంటున్నందున 2022లో జాబ్స్ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా.  2021తో పోలిస్తే ఈ ఏడాది  ప్రధాన రంగాలలో నియామకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే  ఫార్మా (29శాతం), మెడికల్/హెల్త్‌‌కేర్ (10శాతం), ఆయిల్ అండ్ గ్యాస్/పవర్ (8శాతం), బీమా (8శాతం), ఎఫ్ఎంసీజీ ( 7శాతం),  తయారీ (2శాతం)రంగాల్లో జాబ్స్ పెరిగాయి. అయితే, ఆటో/ఆటో అనుబంధ విభాగంలో జాబ్స్ తక్కువగా ఉన్నాయి. ఐటి, -సాఫ్ట్‌‌వేర్,  బిఎఫ్‌‌ఎస్‌‌ఐ రంగాలలో నియామకాలు పెరగడం వల్ల మెట్రోల్లో అవకాశాలు  టైర్-2 నగరాల్లో కంటే ఎక్కువ ఉన్నాయి. ఐటీ హబ్‌‌లు --బెంగళూరు (79శాతం), హైదరాబాద్ (66శాతం),  పూణె (63శాతం) --ఈ ఏడాది జనవరిలో అత్యధిక గ్రోత్ సాధించాయి. ముంబయి (58శాతం), చెన్నై (54శాతం), కోల్‌‌కతా (41శాతం),  ఢిల్లీ/ఎన్‌‌సిఆర్లో (35శాతం) జాబ్స్ పెరిగాయి. నాన్-మెట్రోలలో, అహ్మదాబాద్ (50శాతం) జనవరిలో అత్యధిక గ్రోత్ సాధించింది, తర్వాత కోయంబత్తూర్ (43శాతం), కొచ్చి (27శాతం), వడోదర (12శాతం)  జైపూర్ (8శాతం) ఉన్నాయి. 8–-12 సంవత్సరాల (48శాతం) అనుభవం కలిగిన కేటగిరీకి గత నెల ఎక్కువ డిమాండ్ కనిపించింది. కంపెనీలు సీనియర్ ప్రొఫెషనల్స్‌‌ను భారీగా నియమించుకుంటున్నాయి. మిగతా కేటగిరీలకూ ఆదరణ తగ్గలేదని నౌకరీ డాట్​కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ అన్నారు.