తెలంగాణలో ఎడ్యుకేషన్ ​ఎమర్జెన్సీ

కరోనా తర్వాత బడులు తెరుచుకున్నా.. స్టూడెంట్స్​ హాజరు శాతం మాత్రం బాగా పడిపోయింది. రాష్ట్రంలో ఇప్పటికీ 20 నుంచి30 శాతం మంది పిల్లలు స్కూళ్లకు రావడం లేదు. ప్రభుత్వ బడులు, గురుకులాలు, కేజీబీవీలను కలిపితే ప్రతి జిల్లాలో వేలాది మంది పిల్లలు బడి మానేశారు. మార్చి నెలలో దాదాపు 323 బడులను సందర్శించి చూస్తే 44,071 మంది పిల్లలకు గానూ 11,653 (26.4 శాతం) పిల్లలు బడికి రావడం లేదని తెలిసింది. బడి మానేస్తున్న వారిలో బాలురు బాలకార్మికులుగా పనులకు వెళ్తుండగా, ఆడపిల్లలు బాల్యవివాహాలకు బలి అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకో నెల రోజులైతే బడి మొహం చూడకుండానే ఈ విద్యా సంవత్సరం ముగిసిపోతుంది. స్టూడెంట్స్​ హాజరుతోపాటు వారి సామర్థ్యాలను పట్టించుకునే వారే లేకుండా పోయారు. విద్యా శాఖ సిలబస్ పూర్తి చేసే పనిలో ఉన్నది తప్ప కరోనా ప్రభావంతో అభ్యసనంలో వెనకబడిన వారి సామర్థ్యాలు మెరుగుపరిచే ప్రయత్నం చేయడం లేదు. ఖాళీల కొరతతో స్కూళ్ల మీద పైఅధికారుల పర్యవేక్షణ కూడా సరిగా లేదు. లెర్నింగ్​ సంక్షోభంతో పైక్లాసులకు వెళ్తున్న స్టూడెంట్స్​మరింత వెనకబడుతున్నారు. ఈ నిర్లక్ష్యం ప్రభావం ఇప్పుడు కాదు, ఇంకో పదేండ్లకు తెలుస్తుంది. వీరు నైపుణ్యం లేని వ్యక్తులుగా, అసంఘటిత రంగంలో నిస్సహాయంగా దోపిడీకి గురయ్యే సెకండ్​ క్లాస్​ పౌరులుగా, వలస కూలీలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదవర్గాల బిడ్డలు అలా కాకూడదంటే.. రాష్ట్ర విద్యాశాఖ దీన్ని ఎడ్యుకేషన్​ ఎమర్జెన్సీగా పరిగణించి తగిన కార్యాచరణకు పూనుకోవాల్సిన అవసరం ఉంది.

కరోనా మహమ్మారితో దాదాపు రెండు సంవత్సరాలు బడులు మూసేసిన కారణంగా విద్యార్థుల ‘చదువు–బడి’ లయ తప్పారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు ఎదుర్కుంటున్న పెద్ద సమస్య. దేశవ్యాప్తంగా ఒక కోటి మంది బాలికలు బడులు మానివేస్తారని ‘క్రై’ అనే సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. మూడు నెలలు బడులు మూత పడితే ఒక సంవత్సరం సమానమైన చదువును కోల్పోయినట్లేనని, ఈ స్థితి బడులు తెరిచిన తర్వాత కూడా కొనసాగుతుందని, బడికి వచ్చిన పిల్లలు సగం మాత్రమే నేర్చుకోగలరని ఈ ప్రభావం ధీర్ఘకాలంలో పడుతుందని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. లెర్నింగ్​ సంక్షోభం ప్రభావం అన్ని వర్గాల పిల్లలపై పడింది. అణగారిన వర్గాల పిల్లల విషయంలో మరీ ముఖ్యంగా మొదటి తరం బడిలో చేరిన పిల్లలపై మరీ ఎక్కువగా ప్రభావం ఉంటుంది. పిల్లలు తమ తమ తరగతి స్థాయి అంశాలను మరచిపోయారని అజీమ్ ప్రేమ్​ జి వర్సిటీ చేసిన ఓ అధ్యయనంలో తేలింది. ఇది వలస కుటుంబాల పిల్లల పైనా ఇంకా తీవ్రంగా ఉంటుందని ఆ నివేదిక తెలిపింది. ఒకే తరగతిలో వివిధ సామర్థ్యాలతో ఉన్న పిల్లలకు బోధించడం ఉపాధ్యాయులకు ఒక పెద్ద సవాలు. వెనుకబడిన పిల్లలు పైతరగతులకు వెళ్లే కొద్ది నేర్చుకునే అంతరం పెరిగి విద్య మీద ఆసక్తి సన్నగిల్లేలా చేస్తుంది. దీంతో వారు మొత్తంగా చదువు పట్ల ఆసక్తి కోల్పోతారు. ఈ పరిస్థితి సామాజిక అసమానతలకు దారి తీస్తుంది. పిల్లలు ఇలా లెర్నింగ్ ​సంక్షోభంలో ఉంటే మన విద్యా శాఖ మాత్రం సిలబస్ పూర్తి చేసే పనిలో ఉన్నది తప్ప పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో గుర్తించి వారి సామర్థ్యాలు మెరుగుపరిచే ప్రయత్నం చేయడం లేదు. ఇలా చదువు కోల్పోయిన విద్యార్థులకు రేమిడియేషన్ ప్లాన్ చాలా అవసరం. ఈ విషయంలో విద్యార్థి విద్యార్థికి, పాఠశాల పాఠశాలకు తేడా ఉంటుంది. మొత్తంగా పిల్లలకు కోల్పోయిన విద్యను అందించాలంటే రాష్ట్ర విద్యాశాఖ పరిస్థితిని అత్యయిక పరిస్థితిగా పరిగణించి తగిన కార్యాచరణ రూపొందించాలి. ఈ ప్రక్రియలో తల్లిదండ్రుల, పౌరసమాజ భాగస్వామ్యం చాలా అవసరం అన్న విషయం గుర్తించాలి.

సౌలత్​లు లేక..

చాలా బడుల్లో ఒకే గదిలో రెండు మూడు తరగతులకు పాఠాలు బోధిస్తున్నారు. స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయులు కూడా కొంత నిరాశలో ఉన్నారు. అధికారులు వ్యవస్థలో అందరినీ ఒకటే గాటన కడతారు. బాగా పని చేసే ఉపాధ్యాయుల నుంచి  నేర్చుకునే ప్రక్రియ కానీ విద్యా శాఖకు అసలే లేదు. మధ్యాహ్న భోజనం వంట చేసే ఏజెన్సీలకు సమయానికి డబ్బులు అందకపోవడంతో వారు పిల్లలకు క్వాలిటీ లేని భోజనం ఇస్తున్నారు. నిత్యావసర సరకుల ధరలు, గుడ్ల ధరలు పెరిగిన దృష్ట్యా కూడా వంట చేసే ఏజెన్సీలకు ఈ పని గిట్టు బాటు కావడం లేదని ఏ స్కూల్ కు వెళ్లినా స్పష్టంగా అర్థమవుతోంది. ఫలితంగా పిల్లలకు  పౌష్టికాహారం అందడం లేదు. ప్రైవేటు బడుల్లో ఉన్న పేద, మధ్యతరగతి పిల్లల పరిస్థితి మరీ దారుణం. రాష్ట్రంలో మొత్తం 34 లక్షల మంది పిల్లలు ప్రైవేటు విద్యలో చదువుతున్నారు.
 పిల్లలు ఎలా చదువుతున్నారు? ఎటువంటి బోధన చేస్తున్నారు? శిక్షణ  పొందిన టీచర్లు ఉన్నారా? బినామీ టీచర్లు ఉన్నారా? తరగతి గదులు ఎలా ఉన్నాయి? ఫీజుల పేరుతో పిల్లలను తల్లిదండ్రులను ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నారు? అనే విషయాల మీద పర్యవేక్షణ లేకుండా పోయింది. దీంతో ప్రైవేటు యాజమాన్యాలకూ జవాబుదారీతనం లేని పరిస్థితి నెలకొంది. పోనీ అక్కడైనా చదువులు బాగున్నాయా అంటే అక్కడ కూడా అదే పరిస్థితి ఉందని వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర నివేదికలు చెబుతున్నాయి. అంటే రాష్ట్రంలో మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో చదువుతున్న అత్యధిక శాతం మంది పిల్లల చదువులు ఈ రెండేండ్లుగా ఆగమైనయి. 

ఖాళీలతో పర్యవేక్షణ లేక..

రాష్ట్రంలో 577 ఎంఈవోలు, డీఈవోలు, 62 మంది ఉప జిల్లా విద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటేనే స్కూళ్లపై పర్యవేక్షణ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కలెక్టరు మొదలు జిల్లా మండల విద్యాధికారులు, క్లస్టర్ రిసోర్సు పర్సన్స్ అందరూ పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి  పిల్లల నమోదు, హాజరు లాంటి విషయాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారు ఈ విషయాలపై తప్ప మిగతా అన్ని పనుల హడావిడిలో నిమగ్నమై ఉన్నారు. ‘మన ఊరు– మన బడి’ ప్రణాళికలో నాణ్యమైన విద్య, నమోదు, హాజరు, కొనసాగింపు, అభ్యసనా సామర్థ్యాలను మెరుగుపరచడం అనే అంశాలను ప్రస్తావించినా కూడా,  మౌలిక సదుపాయాల కల్పన అనే అంశం పైనే అందరి దృష్టి ఉంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యా సమస్యల్లో వసతుల కల్పన ఒక ముఖ్యమైన అంశమే. ఎన్నో ఏండ్లుగా కనీసం స్కూల్స్ కు సున్నం వేసిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వాలు. కొన్ని బడులు పాడుపడ్డ బూత్ బంగ్లాలుగా మారిపోయాయి. బడి ఆవరణలో తాగి పడేసిన మద్యం సీసాలు, విరిగి పోయిన తలుపులు, ఉపయోగంలో లేని మూత్రశాలలు, రంగు వెలసిన నల్ల బల్లలు-.. ఇలా దారుణ పరిస్థితి ఉంది. వాటిని బాగు చేసేందుకు బడ్జెట్​లో అవసరమైన పూర్తి స్థాయి నిధులు కేటాయించకుండా వివిధ పద్దుల కింద ఇదివరకే కేటాయించిన నిధుల నుంచి ఖర్చు చేయమని చెప్పడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి లోపం స్పష్టంగా కనిపిస్తోంది. విడతల వారి ప్రణాళికతో ఈ నిధులు ఏ మాత్రం సరిపోవు. ప్రజల ప్రాథమిక సమస్యలైన విద్య, వైద్యం తదితర అంశాలను రాజకీయ సమస్యలుగా మాట్లాడని రాజకీయ పక్షాలు ఉన్నంత కాలం పాలక పక్షానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పిల్లల చదువులు మాత్రం ఆగమైతున్నరు.

 ప్రజాప్రతినిధులకు పట్టింపేదీ..

ప్రజా ప్రతినిధులకు, ముఖ్యంగా శాసన సభ్యులకు పిల్లల గురించి ఆలోచించే సమయం అసలే లేదు. ఏదో అర కొర స్కూల్స్ ను దాతలతో నిర్మించి ప్రారంభోత్సవాలు చేసి మురిసిపోతున్నారు అంతే. వారి నియోజకవర్గాల్లో మొత్తం పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, నాణ్యమైన విద్యలో ఎంత  వెనుకబాటు తనంలో ఉన్నారు? ఎంత మంది పిల్లలు కరోనా తరువాత బడికి రాలేదు? అనే విషయాలను పట్టించుకోవాలనే సోయి ఉన్నట్లు లేదు. పరిస్థితులు ఇలాగే  కొనసాగితే ఒక తరాన్ని విద్యకు దూరం చేసినట్లే అవుతుంది. ఈ నిర్లక్ష్య ప్రభావం ఇప్పుడు కాదు, ఇంకో పదేండ్లకు తెలుస్తుంది. భవిష్యత్​లో విద్యలేక, ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది చాలా ఇబ్బంది పడతారు. నైపుణ్యం లేని నిరక్ష్యరాస్యులుగా, అసంఘటిత రంగంలో నిస్సహాయంగా దోపిడీకి గురయ్యే సెకండ్​ క్లాస్ ​పౌరులుగా, వలస కూలీలుగా మిగిలిపోతారు. ఈ పిల్లలంతా అత్యధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదవర్గాల బిడ్డలే కాబట్టి తక్షణం చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయిదాటి పోతుంది. కేవలం వసతులపై మాత్రమే దృష్టి పెడితే చాలదు. నాణ్యమైన విద్య, నమోదు, హాజరు మొదలగు విషయాలు అత్యవసరం. మనమొక విద్యా అత్యవసర పరిస్థితిలో ఉన్నాం. ఈ పరిస్థితి నుంచి బయటపడాలి. బాధ్యులకు ఉండాల్సిన జవాబుదారీ తనాన్ని ప్రశ్నించాలి. క్షేత్ర స్థాయిలో ఉన్న క్లాస్​​ టీచర్ల నుంచి ముఖ్యమంత్రి దాకా అందరూ దీనికి బాధ్యులే. అందరూ ఈ పిల్లలకు జవాబుదారులే. 

- ఆర్. వెంకట్ రెడ్డి, జాతీయ కన్వీనర్, ఎం. వి. ఫౌండేషన్