- మెదక్‌లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
- సన్న, దొడ్డు వడ్లకు వేర్వేరు కేంద్రాలు
సిద్దిపేట, మెదక్, వెలుగు: సన్న వడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించినా సిద్దిపేట జిల్లాలో వాటి సాగు తక్కువగానే ఉంది. మొత్తం 3.68 లక్షల ఎకరాల్లో వరి పండిస్తుండగా కేవలం 64 వేల ఎకరాల్లో మాత్రమే సన్నాలను సాగు చేస్తున్నారు. దాదాపు 80 శాతం దొడ్డురకం వడ్ల సాగే జరుగుతోంది. గత సీజన్ తో పోలిస్తే సన్న రకాల సాగు కొంత పెరిగినా గజ్వేల్ డివిజన్ లోనే ఎక్కువగా సాగు చేస్తున్నారు. వర్గల్ మండలంలో అత్యధికంగా 7294 ఎకరాల్లో, అత్యల్పంగా హుస్నాబాద్ మండలంలో 64 ఎకరాల్లో సన్న రకాల సాగు జరుగుతోంది.
ఈ నెలాఖరుకు ధాన్యం మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉండగా జిల్లాలో 417 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో సన్నాల కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది వానకాలం సీజన్ లో 34 వేల ఎకరాల్లో సన్నాల సాగు జరగ్గా ప్రస్తుతం అది 64 వేల ఎకరాలకు పెరగడం విశేషం.
పెట్టుబడి ఎక్కువ దిగుబడి తక్కువ
సన్నాల సాగుకు పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ రావడంతో రైతులు వీటి సాగు పట్ల ఆసక్తి చూపడం లేదు. సన్నాల సాగుకు నీటి అవసరం సైతం ఎక్కువ కాబట్టి వర్షాలు కురవకుంటే పెట్టుబడి నష్టపొతామన్న ఉద్దేశ్యంతో రైతులు వెనుకంజ వేశారు. దీనికి తోడు ఎకరాకు దొడ్డు వడ్లు 28 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే సన్నాలు అత్యధికంగా 23 క్వింటాళ్లు దాటడం లేదు.
సన్నాలకు చీడ పీడల బాధ ఎక్కువ ఉండడం, పెట్టుబడి భారం పెరగడం, పంట కాలం ఎక్కువ కావడంతో ప్రభుత్వం బోనస్ ఇచ్చినా పెద్దగా లాభం ఉండదనే అభిప్రాయం రైతుల్లో ఏర్పడింది. ప్రస్తుతం సాగవుతున్న సన్నాల్లో కూడా ఎక్కువగా రైతులు తమ కుటుంబ అవసరాల కోసమే సాగు చేయడం గమనార్హం.
387 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
మెదక్: జిల్లాలో వానకాలం వరి కోతలు షురూ అయ్యాయి. దసరా తర్వాత నూర్పిళ్లు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు పండిచిన ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సీజన్ లో జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 2,54,915 ఎకరాల్లో వరిపంట సాగైంది. ఇందులో సన్నరకం 1,11,335 ఎకరాల్లో, దొడ్డురకం 1,43,580 ఎకరాల్లో సాగు చేశారు. విత్తనాలకు, ఇంటి అవసరాలకు పోను కొనుగోలు కేంద్రాలకు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా.
ఈ మేరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 387 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పీఏసీఎస్ లవి 267, ఐకేపీవి 101, మార్కెటింగ్ వి 7, ఎఫ్ పీవోల ఆధ్వర్యంలో12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. సన్న ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దొడ్డు వడ్లు, సన్న వడ్లను గుర్తించేందుకు వీలుగా గ్రెయిన్కాలిపర్స్, డయల్ మైక్రో మీటర్లను సమకూరుస్తున్నారు.
43 మిల్లులకు ధాన్యం
మెదక్ జిల్లాలో మొత్తం109 రైస్ మిల్లులు ఉండగా అందులో 66 మిల్లులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. అవిపోనూ 43 మిల్లులకు మాత్రమే 1.40 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని తరలించనున్నారు. మరో 2.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇతర జిల్లాలకు తరలించనున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అడిషనల్ కలెక్టర్వెంకటేశ్వర్లు సివిల్సప్లై, మార్కెటింగ్, కో ఆపరేటివ్, డీఆర్డీఏ, ట్రాన్స్పోర్ట్, లీగల్‌మెట్రాలజీ డిపార్ట్మెంట్అధికారులతో రివ్యూ మీటింగ్‌లు పెట్టారు.
రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వడ్ల తూకం కోసం అవసరమైన కాంటాలతో పాటు, సరిపడ గన్నీ బ్యాగులు, వర్షం వస్తే వడ్లు తడిసిపోకుండా ఉండేందుకు టార్ఫిలిన్లు అందుబాటులో ఉంచాలని, నీడ కోసం టెంట్లు, తాగునీరు, రాత్రి వేళ ఇబ్బంది లేకుండా ఉండేందుకు కరెంట్సదుపాయం కల్పించాలని సూచించారు.