గ్రేటర్​లో 88 లక్షల వాహనాలు.. అయినా అవే ఇరుకు రోడ్లు

గ్రేటర్​లో 88 లక్షల వాహనాలు..  అయినా అవే ఇరుకు రోడ్లు
  • రోడ్లు, ఫుట్​పాత్​ ఆక్రమణలు,  పార్కింగ్​తో మరిన్ని సమస్యలు  
  • వెడల్పు చేయకపోవడంతో ట్రాఫిక్ జామ్స్
  • ఆస్తుల సేకరణలో సమస్యలు, కోర్టు కేసులతో డిలే 
  • ఓల్డ్ సిటీలో 40 ఏండ్ల నుంచి 20 నుంచి 40 ఫీట్ల రోడ్లే  
  • స్పీడ్ లిమిట్ లో సగం వేగంతో  కూడా ప్రయాణించని వాహనదారులు

 హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో వాహనాల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగినట్టుగా రోడ్లు వెడల్పు చేయడం లేదు. కొన్ని ప్రాంతాల్లో వెడల్పు చేయడానికి అన్ని అనుమతులు ఉన్నా కేంద్ర ప్రభుత్వ భూములు ఉండడం, కోర్టు కేసుల వల్ల బల్దియా చేతులెత్తేస్తోంది. వాహనాల సంఖ్య సుమారు కోటికి చేరువవుతున్న తరుణంలో ఇరుకు రోడ్లు, ఫుట్​పాత్​ఆక్రమణలు, రోడ్ల పక్కన అక్రమ పార్కింగులతో ఎక్కడపడితే అక్కడ ట్రాఫిక్​జామ్​అవుతోంది. దీంతో వాహనదారులు ఉదయం, సాయంత్రం వేళలతో పాటు మధ్యాహ్నం టైంలో కూడా రోడ్లపైనే గంటల తరబడి గడపాల్సి వస్తోంది.  

ఎక్కువగా ఉన్నవి 2 లైన్స్​రోడ్లే..

నగరంలో 9013 కిలోమీటర్ల మేర రోడ్లు విస్తరించి ఉండగా, 2846 కి.మీ మేర బీటీ రోడ్లు, 6167 కి.మీ మేర ఇంటర్నల్​రోడ్లున్నాయి. బీటీ రోడ్లలో మెయిన్​రోడ్లు 811 కిలోమీటర్లు కాగా, 200 కిలోమీటర్ల  వరకు ఆరు లేన్ల రోడ్లున్నాయి. మిగతా వాటిలో 4 లేన్లు కాగా ఎక్కువగా 2 లేన్ల రోడ్లే ఉన్నాయి. ట్యాంక్ బండ్ నుంచి రాణిగంజ్ వెళ్లే రోడ్డు ఫోర్​లేన్​అయినప్పటికీ వెహికిల్స్ మూవ్ మెంట్ ఎక్కువగా ఉండే దారి కావడంతో ట్రాఫిక్​జామ్స్​తప్పడం లేదు. అయినా వెడల్పుపై బల్దియా దృష్టి పెట్టడం లేదు. మాసబ్ ట్యాంక్ నుంచి విరించి దవాఖాన వరకు ఫోర్​లేన్​ఉన్నా సిగ్నల్ పడిన టైంలో కిలోమీటర్ మేర ట్రాఫిక్​జామ్​అవుతోంది. లంగర్ హౌస్ నుంచి నానల్ నగర్ వెళ్లే రూట్​కూడా నాలుగు లేన్ల రోడ్డు అయినా నానల్ నగర్ సిగ్నల్ వద్ద భారీగా ట్రాఫిక్​జామ్​అవుతోంది. ఇక అలీకేఫ్ చౌరస్తా నుంచి గోల్నాక వరకు ఉన్న 2 లేన్ల రోడ్డు ఏ మాత్రం సరిపోవడంలేదు. 

తిలక్ నగర్ నుంచి నారాయణగూడ వెళ్లే రోడ్డుతో పాటు విద్యానగర్ నుంచి నల్లకుంట రోడ్లు చాలా చిన్నగా ఉన్నాయి. బోయిన్ పల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్లే 2 లేన్​రోడ్డుపై మూవ్​మెంట్​చాలా స్లోగా ఉంటుంది. వీటన్నింటినీ విస్తరించాల్సి ఉన్నా బల్దియా నిర్లక్ష్యం, ఇతర కారణాలు అడ్డంకిగా మారాయి.  కంటోన్మెంట్ పరిధిలోని ఏఓసీ సెంటర్, సిక్ విలేజ్, ఆర్కేపురం, సఫిల్​గూడ, తదితర ప్రాంతాల్లో కూడా ఇరుకు రోడ్లతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్స్ అవుతున్నా బోర్డు ఏమీ చేయలేకపోయింది. వీటితో పాటు ఇంటర్నల్​రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగానే ఉంది. రాంనగర్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రోడ్లు 2 లేన్ల ఉండటంతో ఇక్కడ బస్సులు వస్తే మరో కరికి సైడ్ లభించని పరిస్థితి ఏర్పడింది. 

బల్దియా, ట్రాఫిక్​ పోలీసులు ఏం చేస్తున్నారంటే..  

రోడ్లు వేయడమే కానీ వెడల్పు చేయడంపై బల్దియా పెద్దగా దృష్టి పెట్టింది లేదు. రోడ్లు ఖరాబ్​అయినప్పుడు కొత్త రోడ్లు వేస్తూ వెళ్లిపోతోంది తప్పితే వైడెనింగ్​గురించి ఆలోచించడం లేదు. తాము వెడల్పు చేయాలనుకుంటే కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, దీంతో ఏమీ చేయలేకపోతున్నామంటోంది. వెడల్పు చేయాల్సిన రోడ్ల పక్కన కేంద్ర ప్రభుత్వ భూములు ఉండడం అడ్డంకిగా మారాయని చెప్తోంది. దీంతో వాహనాల సంఖ్య పెరిగినా వాహనదారులకు పాత ఇరుకు రోడ్లే దిక్కయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారమే గ్రేటర్​లో 88 లక్షల వాహనాలుండగా.. ప్రతిరోజూ కొత్తగా1500 వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. రోడ్లు చిన్నగా ఉండడం ప్రధాన సమస్య అయితే వీటికి తోడుగా ఫుట్​పాత్​లు, రహదారుల ఆక్రమణలు వచ్చి చేరాయి. రోడ్ల పక్కన ఇష్టమున్నట్టు వాహనాలను పార్క్​ చేస్తుండడంతో అన్నీ కలిసి ట్రాఫిక్​ జామ్స్​కు కారణమవుతోంది. దీంతో ట్రిఫిక్​ పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఉన్నంతలో సమస్య తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల సిగ్నల్స్​తీసేసి యూటర్న్​లు ఏర్పాటు చేశారు. దీంతో యూటర్న్​తీసుకునే చోట ట్రాఫిక్​ జామ్​అవుతోంది. అలాగే మరికొన్ని చోట్ల మెయిన్​రోడ్ల నుంచి ట్రాఫిక్​ను అంతర్గత రోడ్లకు మళ్లిస్తుండడంతో ఆ రహదారులపై  ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ నిలిచిపోతోంది. దీంతో ట్రాఫిక్​జామ్స్​కు వారే కారకులన్న తప్పుడు అభిప్రాయం జనాల్లో ఏర్పడుతోంది.  

40 ఏండ్ల తర్వాత చేపట్టినా కాలే..

పాతబస్తీలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఇక్కడ చాలా చోట్ల 40 ఏండ్ల కింద వేసిన వెడల్పుతోనే ఇంకా రోడ్లున్నాయి. గత ఏడాది ఎక్కువగా ట్రాఫిక్​ఉండే 12 రోడ్లకు సంబంధించిన వెడల్పు పనులను బల్దియా ప్రారంభించినా ముందుకు సాగడంలేదు. 20 నుంచి 40 ఫీట్లున్న రోడ్లను 60 నుంచి 80 ఫీట్ల దాక పెంచాలని,  30 కిలోమీటర్ల మేర రోడ్ల వైడనింగ్​చేయాలని భావించింది. పనులను వచ్చే  ఏడాదిలోపు పూర్తిచేయాలని అనుకుంది. అయితే, అన్నిప్రాంతాల్లో కలిపి 600 ఆస్తులను సేకరించాల్సి ఉండగా, ఇందులో ఇప్పటివరకు సగం వరకు పూర్తి కాలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే పెండింగ్​లో ఉన్నాయి. దీంతో పాతబస్తీ వైపు వెళ్లాలంటేనే వాహనదారులు వణకాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

వెరీ వెరీ స్లో  మూవ్​మెంట్​

రెండేండ్ల కిందట గ్రేటర్ పరిధిలో రోడ్లపై వాహనాల స్పీడ్ ని బల్దియా పెంచింది. గ్రేటర్ లో ప్రస్తుతం 60 స్పీడ్ తో ప్రయాణించవచ్చు. మధ్యలో డివైడర్ ఉండి 2 లేన్ల నుంచి అంతకుపైగా ఉన్న రోడ్లపై కార్లయితే కిలోమీటర్ కి 60  స్పీడ్, టూవీలర్ తో పాటు మిగతా అన్ని వాహనాలు  50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. డివైడర్ లేని రోడ్లపై కార్లు 50  కిలోమీటర్ల వేగంతో, టూవీలర్ తో పాటు మిగతా వాహనాలు 40 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లాలి. అలాగే ఫ్లై ఓవర్లపై అన్ని వెహికిల్స్ 40 కిలోమీటర్ల స్పీడ్​తో ప్రయాణించాలి. సింగిల్, డబుల్ లేన్లతో ఇంటర్నల్ కాలనీల రోడ్లపై 30 కిలోమీటర్ల స్పీడ్ తో మాత్రమే వెళ్లాలి. కానీ బల్దియా నిర్ధేశించిన స్పీడ్​లో సగం వేగంతో కూడా ప్రయాణించలేకపోతున్నారు.