మిడ్ డే మీల్స్ కు బియ్యం పంపలే

మిడ్ డే మీల్స్ కు బియ్యం పంపలే
దాతల సహకారంతో నెట్టుకొస్తున్న టీచర్లు
కొన్ని స్కూళ్లలో ఇంటి నుంచే బాక్స్‌‌‌‌‌‌‌‌లు

సిరికొండ, వెలుగు : సర్కారు స్కూళ్లలో సన్న బియ్యంతో అన్నం పెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఉన్న 1,156 గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ స్కూళ్లలో 1,04,215 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. వీరికి మధ్యాహ్న భోజనం కోసం నెలకు 30 టన్నుల బియ్యం అవసరం ఉంటుంది. ఇవి ప్రతీ నెల 1 నుంచి 10వ తేదీ లోపు సంబంధిత స్కూళ్లకు చేరేవి. అయితే ఈనెల చాలా స్కూళ్లకు బియ్యం సరఫరా కాలేదు. దీంతో 15 రోజులుగా టీచర్లు, స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. 

దాతల సహకారంతో..

స్కూళ్లకు బియ్యం రాపోవడంతో మధ్యాహ్న భోజనం పెట్టడానికి ఏజెన్సీల నిర్వాహకులు, టీచర్లు కొన్ని ప్రాంతాల్లో దాతలను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. స్థానికంగా ఉన్న డీలర్లు, పరిచయస్తుల వద్ద బియ్యాన్ని తెచ్చి పది రోజుల పాటు భోజనం ఏర్పాటు చేశారు. నాలుగు రోజులుగా ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో చేతులెత్తేసినట్లు హెచ్ఎంలు చెబుతున్నారు. దీంతో పిల్లలు ఇంటి నుంచే లంచ్‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌లు తెచ్చుకుని తింటున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి సకాలంలో బియ్యం సరఫరా చేయాలని కోరుతున్నారు.

ఈ ఫొటోలో ఉన్నది నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా సిరికొండ మండలంలోని గడ్కోల్ ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌. ఇందులో 124 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ఈ నెల మొదటి వారంలో స్కూల్‌‌‌‌‌‌‌‌కు రావాల్సిన సన్న బియ్యం రాలేదు. దీంతో టీచర్లు స్థానికంగా ఉన్న పలువురిని బియ్యం అడిగి భోజనం ఏర్పాటు చేశారు. కానీ నాలుగు రోజులుగా దాతలు ఎవరు దొరకకపోవడంతో వారు చేతులెత్తేశారు. బుధవారం స్కూల్‌‌‌‌‌‌‌‌లో బియ్యం లేక మధ్యాహ్న భోజనం వండలేదు. దీంతో స్టూడెంట్లు ఇంటి నుంచి ఇలా టిఫిన్ బాక్సులు తెచ్చుకుని తిన్నారు. కొంత మంది విద్యార్థులు లంచ్‌‌‌‌ కోసం ఇంటికి వెళ్లారు. ఒక్క గడ్కోల్‌‌‌‌‌‌‌‌ స్కూలే కాదు.. జిల్లాలో చాలా బడుల్లో ఇదే పరిస్థితి ఉంది.

ఇంటి కాడ తిని వస్తున్న..

నన్ను పొద్దుగాల అమ్మ బడి కాడ దింపి పొలం పనులకు పోతుంది. మధ్యాహ్నం నేను ఇంటికి పోయి తిని వస్తున్నా. బియ్యం లేక బడిలో అన్నం వండుతలేరు. రెండు రోజుల నుంచి ఇంటికి పోయి వస్తున్నా.

- వర్షిణి, రెండో తరగతి, గడ్కోల్ స్కూల్​

సకాలంలో బియ్యం అందించాలి

స్కూళ్లకు సకాలంలో బియ్యం రావడం లేదు. పదిహేను రోజులుగా దాతల సాయంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. పైఆఫీసర్లు స్పందించి సకాలంలో బియ్యాన్ని సప్లై చేయాలి.

-  సి.హెచ్ రాజేశ్, హెచ్ఎం, కొండాపూర్​ 

రెండు రోజుల్లో కోటా వస్తుంది

పదిహేను రోజులుగా స్కూళ్లకు బియ్యం రాకపోవడం మాట వాస్తవమే. రెండు రోజుల్లో అన్ని స్కూళ్లకు కోటా వస్తుందని సివిల్ సప్లయ్ ఆఫీసర్లు తెలిపారు. మధ్యాహ్న భోజనం ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.

-  దుర్గా ప్రసాద్, డీఈవో