- సింగరేణి హైస్కూల్లో సందడి
కోల్‌బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి హైస్కూల్లో ఆదివారం పూర్వ విద్యార్థుల సందడి నెలకొంది. 1978- నుంచి 2023 వరకు పదో తరగతి చదువుకున్న 45 బ్యాచ్‌లకు చెందిన వేల మంది పూర్వ విద్యార్థులు గెట్ టుగెదర్ నిర్వహించారు. పాత స్మృతులను గుర్తుకు తెచ్చుకొని ఆనందంగా గడిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆటపాటలతో సరదాగా గడిపారు. బర్త్‌డేలు, మ్యారేజ్డేలు జరుపుకున్నారు. కొందరు పూర్వ విద్యార్థులు ఒకేరకమైన దుస్తుల్లో వచ్చి ఆకట్టుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులంతా శాలువా కప్పి ఘనంగా సన్మానించి ఆశీర్వాదం పొందారు. అలనాటి విషయాలు పరస్పరం గుర్తుచేసుకున్నారు. మరణించిన ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించారు. సమ్మేళనానికి మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వేడుకలు జరిగాయి.