IND vs AUS: చిగురిస్తున్న సెమీస్‌ ఆశలు.. భారత్ మ్యాచ్‌కు ఆసీస్ స్టార్ ప్లేయర్లు దూరం

విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో భాగంగా గ్రూప్ ఏ సెమీస్ సమరం ఆసక్తికరంగా మారింది. ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయి శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఆస్ట్రేలియా ఆడిన మూడు మ్యాచ్ ల్లో గెలిచి దాదాపు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే ఆసీస్ జట్టు సెమీస్ కు చేరడం నల్లేరు మీద నడకే. పాకిస్థాన్ రెండు మ్యాచ్ లు ఓడిపోయి దాదాపు ఇంటి ముఖం పట్టింది. నెట్ రన్ రేట్ దారుణంగా ఉండడం పాకిస్థాన్ కు మైనస్ గా మారింది.

ఈ రేస్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ రేస్ లో ఉన్నాయి. ఈ రెండు జట్లలో ఒక్క జట్టే సెమీస్ కు చేరే అవకాశాలు ఉన్నాయి. భారత్ ప్రస్తుతం మూడు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సెమీస్‌‌‌‌ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌లో ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో అదరగొట్టింది. బుధవారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ మూడో లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో టీమిండియా 82 రన్స్‌‌‌‌ తేడాతో శ్రీలంకపై భారీ విజయం సాధించింది. 

నెట్ రన్ రేట్ (+0.576) పెంచుకోవడం భారత్ కు అనుకూలంగా మారింది. మిగిలిన మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే న్యూజిలాండ్, పాకిస్థాన్ పై మెరుగైన రన్ రేట్ ఉంది కాబట్టి సెమీస్ కు చేరుతుంది. ఆసీస్ తో మ్యాచ్ కు ముందు భారత్ కు ఒక విషయం అనుకూలంగా ఉంది. అదేంటో కాదు ఆసీస్ స్టార్ ప్లేయర్లు కెప్టెన్ అలిస్సా హీలీ, ఫాస్ట్ బౌలర్ టేలా వ్లెమింక్‌ గాయాల కారణంగా ఈ మ్యాచ్ లో ఆడడం లేదు. 

హీలే గాయపడడంతో ఆమె స్థానంలో మూనీ కెప్టెన్సీ చేసే అవకాశముంది. దీంతో ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించి సెమీస్ కు వెళ్లేందుకు చక్కని అవకాశం కుదిరింది. అదే సమయంలో శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ తేడాతో గెలవకుండా ఉండాలి. ఆదివారం (అక్టోబర్ 13) జరిగే ఈ మ్యాచ్ కు షార్జా వేదిక కానుంది. పటిష్టమైన ఆసీస్ ను ఓడిస్తేనే భారత్ సెమీస్ చేరుతుంది. ఒకవేళ ఆసీస్ చేతిలో భారత్ ఓడిపోతే మరో మ్యాచ్ లో న్యూజిలాండ్ పై శ్రీలంక గెలిచి తీరాల్సిన పరిస్థితి.