మతిమరుపు దశల్ని గుర్తించేందుకు ప్రస్తుతం కళ్లు స్కాన్ చేయడం, రక్తపరీక్షలు, కనుపాప ట్రాకింగ్ యాప్స్, వాసనకు సంబంధించిన పరీక్షలు వంటివి చేస్తున్నారు. అయితే మూత్రంలోని ఫార్మిక్ యాసిడ్ శాతాన్ని బట్టి కూడా అల్జీమర్స్ తొలిదశను గుర్తించొచ్చట! ఇది తక్కువగా ఉంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు. ఎక్కువ శాతంలో ఉంటే హానికరమట. ఇందుకోసం కొందర్ని ఎంపిక చేసి, ఫార్మిక్ యాసిడ్ శాతాన్ని బట్టి వాళ్లని నాలుగు విభాగాలుగా చేశారు. వాళ్ల జ్ఞాపకశక్తిని పరిశీలిస్తే.. అందులో ఈ ఆమ్లం తక్కువ శాతంలో ఉన్నవాళ్లలో మతిమరుపు తక్కువగా ఉందట. దీన్నిబట్టి అల్జీమర్స్‌ను మొదటి దశలోనే గుర్తిస్తే ట్రీట్మెంట్ ఈజీ అవుతుందని ‘ఫ్రాంటియర్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్’ పత్రిక పేర్కొంది.
మందు ఉందా? లేదా?
న్యూరో కాగ్నిటివ్ టెస్ట్ లేదా న్యూరో సైకలాజికల్ టెస్ట్ ద్వారా పేషెంట్ మెదడులో పరిస్థితి తెలుసుకుంటారు. మెదడులో ఏ భాగం అరిగిపోయిందో ఎంఆర్ఐ స్కాన్‌లో తెలుస్తుంది. అమైలాయిడ్ పీఈటీ (పాసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ) స్కాన్ ద్వారా అల్జీమర్స్ తెలుసుకోవచ్చు. అల్జీమర్స్‌ని పూర్తిగా తగ్గించలేరు. కాకపోతే స్టేజ్‌ని బట్టి మెడిసిన్ ఉంటుంది. అది లక్షణాలను కంట్రోల్ చేస్తుంది. కానీ, పూర్తిగా నయం చేయడానికి ఇప్పటివరకు ఎలాంటి మందూ లేదు. ఇంకా రీసెర్చ్‌లు జరుగుతున్నాయి.
హీలింగ్ థెరపీ
ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. అలాగే ఈ మతిమరుపు సమస్యకు కూడా ఉంది. మెడిసిన్ రాలేదని బాధపడకుండా వేరే పద్ధతులు ట్రై చేయొచ్చు. డాక్టర్ల సలహా మేరకు కొన్ని రకాల మానసిక ప్రశాంతతనిచ్చే వైద్యంపై దృష్టిపెట్టొచ్చు. వాటిలో మ్యూజిక్ థెరపీ, అరోమా థెరపీ వంటివి బాగా పనిచేస్తున్నాయని తెలుస్తోంది. చాలామంది వాటివల్ల ఉపశమనం పొందుతున్నట్టు కొన్ని రిపోర్టులు చెప్తున్నాయి.
సంగీతం..
మ్యూజిక్ వల్ల డిమెన్షియా వ్యక్తులు తిరిగి జ్ఞాపకాలను నెమరువేసుకోగలరని తెలుస్తోంది. సొంతవాళ్లను గుర్తుపట్టలేకపోయినా, వాళ్లను తెలిసిన ట్యూన్స్‌ని పియానో లేదా వయొలిన్లో వాయించగలుగుతారు. ఈ విషయంపై ఈ మధ్య జరిగిన ఒక స్టడీలో మ్యూజికల్ యాక్టివిటీలు ఎక్కువగా చేయడం వల్ల బ్రెయిన్లోని కొన్ని ఏరియాల్లో గ్రే మ్యాటర్ పెరుగుతుంది. అది న్యూరో ప్లాస్టిసిటీ పెంచుతుంది. అది ఏదైనా నేర్చుకోవడానికి, జ్ఞాపకాలను గుర్తు చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. 2023లో చేసిన ఒక స్టడీలో లాంగ్ టర్మ్ మ్యూజిక్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల బ్రెయిన్ చాలా బాగా పనిచేసినట్టు వెల్లడైంది.
పుదీనా వాసనతో...
మెంథాల్ (పుదీనా) వాసన చూడడం వల్ల అల్జీమర్స్ వ్యాధి లక్షణాల నుంచి రిలీఫ్ ఉంటుందని మరో స్టడీలో వెల్లడైంది. అల్జీమర్స్ అనేది నాడీ వ్యవస్థ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మెంథాల్ వాసన పదేపదే చూస్తే మార్పు కనిపిస్తుందని అంటున్నారు. ఇందుకోసం అల్జీమర్స్ లక్షణాలు ఉన్న ఎలుకలను జన్యుమార్పిడి పద్ధతిలో రూపొందించారు. వాటికి ఆరునెలలపాటు మెంథాల్ వాసన చూపించారు. తర్వాత వాటి ఇమ్యూనిటీ సిస్టమ్ రెస్పాన్స్, విషయాన్ని అర్థం చేసుకునే కెపాసిటీని పరిశీలిస్తే అవి ఉపశమనం పొందినట్లు గుర్తించారు. ఇమ్యూనిటీ సిస్టమ్‌ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడింది. మెమరీ, లెర్నింగ్ స్కిల్స్ మెరుగుపరిచింది.
మెదడుకు మెగ్నీషియం మేలు
ఫుడ్ నుంచి అందే మెగ్నీషియం వల్ల కాంప్రహెన్సివ్ ఎబిలిటీ పెరుగుతున్నట్టు స్టడీలు చెప్తున్నాయి. తక్కువ మోతాదులో మెగ్నీషియం తీసుకునేవాళ్లతో పోలిఈస్తే ఎక్కువ మొత్తంలో తీసుకునే వాళ్లలో డిమెన్షియా ముప్పు 37 శాతం తక్కువగా ఉన్నట్టు తేలింది. మెగ్నీషియం ఎక్కువగా తీసుకునేవాళ్లలో, ముఖ్యంగా మహిళల్లో మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటున్నట్టు బ్రిటన్ సైంటిస్ట్‌లు గుర్తించారు. వీళ్లలో మెదడు పరిమాణం పెద్దగా, తెల్ల పదార్థంలో ఏర్పడే మచ్చలు చిన్నగా ఉంటున్నట్టు బయటపడింది. ఇవి రెండూ డిమెన్షియాను సూచించేవే. రోజుకు 350 మిల్లీ గ్రాములు మెగ్నీషియం తీసుకునేవాళ్లతో పోలిస్తే రోజుకు 550 మిల్లీ గ్రాములు తీసుకునేవాళ్లలో మెదడు వయసు ఒక ఏడాది తక్కువగా ఉంటున్నట్టు తేలింది. మెగ్నీషియం నాడీ కణాల రక్షణకు తోడ్పడుతుంది. అలాగే రక్తపోటును తగ్గేలా చేస్తుంది. మెగ్నీషియం మోతాదు పెంచుకుంటే రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
ఎండుద్రాక్ష, గుమ్మడి గింజలు, బాదంపప్పులు, పాలకూర, జీడిపప్పు, వేరుశనగలు, సోయా బీన్స్, ఉలవలు, ఆలుగడ్డలు, దంపుడు బియ్యం, పెరుగు, ఓట్స్, రాజ్మా, అరటిపండు, చేపలు, పాలు, అవకాడో, చికెన్, యాపిల్, క్యారెట్, బ్రోకలీ వంటివాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.
అల్జీమర్స్ డే
జర్మనీకి చెందిన ఫిజీషియన్ అయిన అలోయిస్ అల్జైమర్ పేరు నుంచి ‘అల్జీమర్’ అనే పదం వచ్చింది. అలోయిస్ ఒక కేసును పరిశీలిస్తున్నప్పుడు ఆమె బ్రెయిన్లో వచ్చిన మార్పులను గుర్తించాడు. దాన్ని ‘అసాధారణమైన వ్యాధి’గా 1906లో గుర్తించాడు. ఆయన1915లో చనిపోయారు. దాంతో ఆ కేసును ఛేదించేందుకు అంతర్జాతీయంగా రీసెర్చ్‌లు మొదలయ్యాయి. 1910లో దీనిపై పని చేసిన జర్మన్ సైకియాట్రిస్ట్ ఎమిల్ క్రేపెలిన్ రాసిన బుక్ ‘సైకియాట్రీ’ ఎనిమిదో ఎడిషన్‌లో ‘అల్జీమర్స్ డిసీజ్’ గురించి పేర్కొన్నారు.
ప్రతి ఏటా సెప్టెంబర్ 21న ‘వరల్డ్ అల్జీమర్స్ డే’ సెలబ్రేట్ చేస్తారు. దీన్ని1994లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది. ఇది అల్జీమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ 1984లో మొదలుపెట్టింది. ఏటా ఒక థీమ్ ఉంటుంది. ఈ ఏడాది థీమ్.. ‘టైం టు యాక్ట్ ఆన్ డిమెన్షియా. టైం టు యాక్ట్ ఆన్ అల్జీమర్స్’ అంటే డిమెన్షియా, అల్జీమర్స్ల విషయంలో టైంకి సరైన చర్యలు తీసుకోవాలని.
అంచెలంచెలుగా ప్రభావం
‘ఎపిసోడిక్ మెమరీలాస్’... అంటే ఒక్కొక్కటిగా తెలిసిన విషయం, పని మర్చిపోవడం. పొద్దున్న ఏం తిన్నారో గుర్తుండదు. ఒకే విషయాన్ని పదే పదే అడుగుతుంటారు. అల్జీమర్స్ ముదిరేకొద్దీ వస్తువుల పేర్లు కూడా గుర్తుండవు. ఈ కండిషన్‌ని ‘అనోమియా’ అంటారు. రెగ్యులర్‌గా, ఇష్టంగా చేసే పనులు ఉదాహరణకు టీవీ చూడడం, పేపర్ చదవడం, వాకింగ్‌కి వెళ్లడం వంటివాటి మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. దీన్ని ‘లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్’ అంటారు. మాట తడబాటు, ఏం చెప్పినా వెంటనే అర్థం చేసుకోలేకపోవడం, మనుషుల పేర్లను మర్చిపోవడాన్ని ‘అఫేషియా’ అంటారు. కొందరైతే సరిగా నడవలేరు. సొంతంగా పనులు చేసుకోలేరు. తెలిసినవాళ్లని కూడా మొదటిసారి అప్పుడే చూస్తున్నట్టు చూస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రావడం మర్చిపోతుంటారు. అల్జీమర్స్ లక్షణాలు ఎక్కువయ్యేకొద్దీ ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. యాంగ్జైటీ, కోపం, మానసిక ఒత్తిడి వంటివి ఎక్కువ అవుతాయి. వ్యక్తిగత శుభ్రత పాటించరు. దానివల్ల ఇతర ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
గుర్తుంచుకోవాల్సినవి
ఫ్యామిలీ మెంబర్స్‌కి ఉంటే మిగతా వాళ్లకు రాదు. డిమెన్షియా జన్యుపరంగా సంక్రమించే వ్యాధి కాదు. వయసు పైబడినప్పుడు డిమెన్షియా లక్షణాలు కనిపిస్తాయి. 65 ఏండ్ల కంటే ముందే అల్జీమర్స్ డెవలప్ అయితే తద్వారా జన్యుపరంగా వచ్చే రిస్క్ ఉండొచ్చు. ఇప్పటివరకు అయితే డిమెన్షియా కేసులన్నీ అల్జీమర్స్ వ్యాధి వల్ల వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. అంటే డిమెన్షియా అనేది వారసత్వం కాదు.
వృద్ధుల్లో మాత్రమే కాదు. 30 నుంచి 64 ఏండ్ల మధ్య వయసులో కూడా డిమెన్షియా కేసులు వస్తున్నాయని సైంటిస్ట్‌లు చెప్తున్నారు. లక్షమందిలో 30 నుంచి 200 పైగా కేసులు ఉండొచ్చని అంచనా వేశారు. అదే 54 నుంచి 64 ఏజ్ గ్రూప్ తీసుకుంటే దాదాపు 420 మందికి ఎక్కువగా ఉన్నట్టు తేలింది.
డిమెన్షియా ఉన్నవాళ్లలో కోపం ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. కానీ, అందరిలోనూ ఇది కనిపించదు. ఒక స్టడీ ప్రకారం 215 మంది డిమెన్షియా ఉన్నవాళ్లను పరిశీలిస్తే అందులో 41 శాతం మందిలో అగ్రెషన్ కనిపించింది. ఈ స్టడీని రెండేండ్లు చేశారు. కోపం ఎందుకు వస్తుందనే దానికి రెండు కారణాలు చెప్పారు. ఒకటి శారీరక నొప్పి, రెండోది తమ వాళ్లతో లేదా కేర్ టేకర్లతో రిలేషన్షిప్ సరిగా లేకపోవడం వల్లేనని తెలిసింది.
డిమెన్షియా వల్ల మరణాలు జరుగుతాయనేది అపోహ కాదు. వాస్తవమే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక. 2020లో జరిగిన ఒక స్టడీలో 70 నుంచి 99 ఏండ్ల వృద్ధులు చనిపోవడానికి సాధారణ కారణం డిమెన్షియా అని తెలిసింది. 2000 నుంచి 2009 వరకు13.6 శాతం డిమెన్షియా వల్లే చనిపోయినట్టు రిపోర్టులో తెలిపారు.
ఈ గాడ్జెట్స్ వాళ్లకోసమే!
డిమెన్షియా పేషెంట్లకు ఎప్పుడూ ఒక మనిషి తోడు అవసరం. ఎందుకంటే వాళ్లు ఎప్పుడు? ఏం చేస్తారో? ఎలా ఉంటారో తెలియదు. ఎక్కడికి వెళ్తారో తెలియదు. కాబట్టి వాళ్లని ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి. అందుకోసమే కొన్ని గాడ్జెట్స్ మార్కెట్లోకి వచ్చాయి.
జీపీఎస్ ట్రాకర్..
జీపీఎస్ ట్రాకర్ ఉండే స్మార్ట్ వాచ్‌లు, పెండెంట్స్, రిస్ట్ బ్యాండ్స్ వంటివి. వాటి ఆధారంగా వాళ్ల కదలికలను మానిటర్ చేయొచ్చు. దీంతో వాళ్లు స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్లగలుగుతారు. ఎక్కడికి వెళ్లినా కుటుంబ సభ్యులకు లొకేషన్ తెలుస్తుంది. ఎమర్జెన్సీ అయితే కనుక ఆ గాడ్జెట్స్ సాయంతో వాళ్ల గురించి సమాచారం ఇతరులు ఎవరైనా ఇచ్చే అవకాశం ఉంది.
డోసెట్ బాక్స్‌లు
డోసెట్ బాక్స్ లేదా పిల్ ఆర్గనైజర్స్ అనేవి చూడ్డానికి కంటెయినర్స్లా ఉంటాయి. అవి డిమెన్షియా పర్సన్స్ కరెక్ట్ టైంకి మెడిసిన్ తీసుకునేందుకు సాయం చేస్తాయి. మందులు వేసుకోవడం మర్చిపోరు. అలాగే మర్చిపోయి డోస్ ఎక్కువ వేసుకోవడం అనేది కూడా ఉండదు. ఎందుకంటే ప్రతి కంపార్ట్మెంట్లో డోసుల వారీగా టైంకి మెడిసిన్ తీసుకునేలా వారం, రోజు లేబుల్ చేసి ఉంటాయి.
యాప్స్‌లో కొన్ని ఇవి...
స్మార్ట్ ఫోన్ చాలా అవసరాలకు ఉపయోగపడుతోంది. డైలీ లైఫ్‌లో ప్రతి అవసరానికి యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే డిమెన్షియా పేషెంట్లకు సాయం చేసేందుకు కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఫోన్స్‌లో పనిచేసే ఆ యాప్స్‌లో కొన్నింటి గురించి..
లుమొసిటీ(lumosity)
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 100 మిలియన్ల మంది ఈ యాప్ వాడుతున్నారట! ఇందులో బ్రెయిన్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్లు ఉంటాయి. మెమరీ, స్పీడ్, లాజిక్, ప్రాబ్లమ్ సాల్వింగ్, మ్యాథ్స్, లాంగ్వేజ్ స్కిల్స్‌కు సంబంధించి మొత్తం 40 యాక్టివిటీలు ఉంటాయి. ఫ్రీ, ప్రీమియం వెర్షన్లలో ఉంటాయి ఇవి. ఫ్రీ వెర్షన్లో లిమిటెడ్ గేమ్స్ ఉంటాయి. ప్రీమియం వెర్షన్ కావాలంటే నెలకు కొంత డబ్బు చెల్లించి సబ్స్క్రయిబ్ చేసుకోవాలి.
అమ్యూజ్ ఐటీ(AmuseIT)
ఈ యాప్ ద్వారా వెయ్యిమందితో సింపుల్ క్విజ్ కండక్ట్ చేయొచ్చు. అలా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. చేతులు వణకడం, కాగ్నిటివ్ లెవల్స్ బట్టి కస్టమైజ్ చేసుకునే ఆప్షన్లు ఉంటాయి. ఈ యాప్‌ని ఐపాడ్, టాబ్లెట్స్‌లో మాత్రమే వాడగలరు.‘మెమరీ లేన్ గేమ్స్, కాన్స్టంట్ థెరపీ, సింగ్ ఫిట్, మై రీఫ్ త్రీడీ అక్వేరియం, ఇట్స్ డన్’ వంటి యాప్స్ ఉన్నాయి. అలాగే డెస్క్‌టాప్‌లో ఆడేందుకు ‘మైండ్ మేట్, నైంబల్’ వంటి యాప్స్ కూడా ఉన్నాయి.
-- మనీష పరిమి