
- నేను ఏ ప్రాజెక్ట్‌ను అడ్డుకున్నానో నిరూపించాలి
- రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడ.. పాలన చేతగాక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు
- లేనిది ఉన్నట్లు చెప్పడం అలవాటైపోయిందని ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి.. తమను అడిగి హామీలు ఇచ్చారా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి వచ్చే ఏ ఒక్క ప్రాజెక్ట్‌ను తాను అడ్డుకోలేదన్నారు. అలా ఏమైనా ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వ పాలనలో ఓ విధానం ఉంటుందని, దానికి అనుగుణంగానే వ్యవహరిస్తారని క్లారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డివి బ్లాక్ మెయిల్ రాజ కీయాలు అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై కిషన్‌రెడ్డి గురువారం కౌంటర్ ఇచ్చారు.
‘‘కేంద్రం నుంచి డబ్బులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని ఎన్నికల్లో రేవంత్ అన్నడు. అయితే, ఆయనవి అన్ని గాలి మాటలే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా? లేక నేనా?. తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో నేను ఆయా రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాస్తూ.. మాట్లాడుతూ.. నిధులు తీసుకొస్తా. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడ. నేను ప్రాజెక్ట్‌లను అడ్డుకుంటున్నట్లు రేవంత్ ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నడు. నేను ఏ ప్రాజెక్ట్‌ను అడ్డుకున్నానో రుజువు చేయాలి. పాలన చేతగాక.. పథకాలు అమలు చేయలేక.. చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నడు. ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే అభివృద్ధి పనులు చేస్తానని రేవంత్ చెప్పాడా? ప్రాజెక్టులకు రూపకల్పన చేశాడా? ఇలా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం ఎంత వరకు కరెక్ట్?’’అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
లేనిది ఉన్నట్టు చెప్పడం రేవంత్ రెడ్డికి అలవాటైందన్నారు. రేవంత్ చేస్తున్న గాలి మాటలన్నీ రాష్ట్ర ప్రజలు వింటున్నారని తెలిపారు. తానేం రేవంత్, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాలతో పార్లమెంట్‌లో అడుగుపెట్టలేదన్నారు. తాను తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటానని, రేవంత్ మాటలకు కాదని స్పష్టం చేశారు. సీఎం స్థాయిలో ఉండి ఎలాంటి అవగాహన లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.