Paris olympics 2024: కాంస్య పట్టు .. యువ రెజ్లర్ అమన్‌కు బ్రాంజ్‌

Paris olympics 2024:  కాంస్య పట్టు .. యువ రెజ్లర్ అమన్‌కు బ్రాంజ్‌
  • ప్లే ఆఫ్‌లో డారియన్‌పై గెలుపు.. ఇండియాకు ఆరో పతకం

భారీ ఆశలు పెట్టుకున్న నిషా దహియా గాయంతో వెనుదిరిగింది.. పతకం అంచుల వరకు వెళ్లిన వినేశ్‌ ఫోగాట్‌ అనర్హతకు గురైంది.. ఇక ఆశల్లేవు అనుకున్న సమయంలో కుస్తీ వీరుడు అమన్‌ షెరావత్‌ పారిస్‌ గడ్డపై పతక గర్జన చేశాడు. తన ఉడుం‘పట్టు’తో ప్రత్యర్థికి చుక్కలు చూపెట్టాడు. ఫలితంగా మెన్స్‌ 57 కేజీల్లో కాంస్యం నెగ్గి రెజ్లింగ్‌లో తొలి మెడల్‌ అందించాడు. అదే టైమ్‌లో ఇండియా పతకాల సంఖ్యను ఆరుకు పెంచాడు. ఓవరాల్‌గా రెజ్లింగ్‌లో ఇండియా మెరుపులు తగ్గలేదని మరోసారి నిరూపించాడు. 

పారిస్‌‌: ఒలింపిక్స్‌‌లో ఇండియాకు మరో పతకం వచ్చింది. రెజ్లింగ్ స్టార్లందరూ రకరకాల కారణాలతో వెనుదిరిగినా వేళ.. యంగ్‌‌ ప్లేయర్‌‌ అమన్‌‌ సెహ్రావత్‌‌ కాంస్య మోత మోగించాడు. శనివారం జరిగిన మెన్స్‌‌ 57 కేజీల ఫ్రీస్టయిల్‌‌ బ్రాంజ్‌‌ మెడల్‌‌ ప్లే ఆఫ్‌‌లో అమన్‌‌ 13–5తో క్రుజ్‌‌ డారియన్‌‌ టోయ్‌‌ (పుర్టారికో)పై సంచలన విజయం సాధించాడు. బరిలోకి దిగిన తొలి గేమ్స్‌‌లో పతకంతో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇక 2008 బీజింగ్‌‌ ఒలింపిక్స్‌‌ నుంచి బరిలోకి దిగిన ప్రతి ఒలింపిక్స్‌‌లో ఇండియన్‌‌ రెజ్లర్లు పతకం సాధించడం విశేషం.

బౌట్‌‌ ఆరంభంలో కొద్దిగా తడబడిన ఇండియన్‌‌ రెజ్లర్‌‌ తర్వాత తన పట్టుతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. తొలి పీరియడ్‌‌లో లెగ్‌‌ బెండింగ్‌‌తో తొలి పాయింట్‌‌ సాధించిన క్రుజ్‌‌ తర్వాత పట్టు కోల్పోయాడు. 0–1తో కుస్తీ మొదలుపెట్టిన అమన్‌‌ క్రుజ్‌‌ను మ్యాట్‌‌పై పడేసి కదలకుండా నిలువరించాడు. దీంతో 2, 2, 2 పాయింట్లు గెలిచాడు. మధ్యలో క్రుజ్‌‌ రెండు పాయింట్లు గెలిచినా అమన్‌‌ 6–3 ఆధిక్యంలో కొనసాగాడు. ఇక రెండో పీరియడ్‌‌లో అమన్‌‌ మరింత జోరు చూపెట్టాడు. క్రుజ్‌‌ను మ్యాట్‌‌పై బోర్లా పడేసి రెండు కాళ్లను కదపకుండా చేశాడు. దాదాపు 50 సెకన్ల పాటు అదిమిపట్టడంతో చకచకా పాయింట్లు వచ్చాయి. ఈ రౌండ్‌‌లో క్రుజ్‌‌ రెండు పాయింట్లే నెగ్గినా, అమన్‌‌ 7 పాయింట్లతో స్పష్టమైన లీడ్‌‌లో నిలిచి ఈజీగా మెడల్‌‌ను సొంతం చేసుకున్నాడు.