Paris Olympics 2024: ఒలింపిక్స్ రిలేలో నేడు తెలుగు అమ్మాయి.. కాంస్య పతక పోరుకు అమన్ సెహ్రావత్

Paris Olympics 2024: ఒలింపిక్స్ రిలేలో నేడు తెలుగు అమ్మాయి.. కాంస్య పతక పోరుకు అమన్ సెహ్రావత్

పారిస్ ఒలింపిక్స్ 14 వ రోజుకు చేరింది. శుక్రవారం (ఆగస్ట్ 9) ఒలింపిక్స్ రిలేలో తెలుగు అమ్మాయి దండి జ్యోతిక శ్రీ ఆడనుంది. మహిళల 4x400 మీటర్ల రిలే తొలి రౌండ్ రిలేలో భారత మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. నేడు జరిగే రిలే తొలి రౌండ్‌లో జ్యోతిక శ్రీ పాల్గొననుంది. మధ్యాహ్నం 2:10 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. దండి జ్యోతిక శ్రీ తో పాటు కిరన్ పాహల్, పూవమ్మ రాజు, విథ్య రామ్‌రాజ్, సుభ వెంకటేశన్ భారత్ తరపున ఆడబోతున్నారు.

శుక్రవారం భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్య పతక పోరులో తలపడనున్నాడు. గురువారం జరిగిన సెమీస్ పోరులో అయిదో సీడ్ అమన్ ఓడిపోయాడు. జపాన్ రెజ్లర్ రీ హిగుచి చేతిలో 10-0తో కేవలం 134 సెకన్లలోనే అమన్ చిత్తయ్యాడు. ఈ మ్యాచ్‌లో అమన్ గెలిచి ఉంటే ఫైనల్‌కు చేరి స్వర్ణం కోసం తలపడేవాడు. కానీ, ఓడటంతో నేడు కాంస్యం కోసం ప్యూర్టోరికా రెజ్లర్ డారియన్‌తో అమన్ తలపడనున్నాడు. రాత్రి 9:45 గంటలకు మ్యాచ్ జరుగుతుంది.  

గురువారం లభించిన రెండు పతకాలతో పారిస్‌లో భారత్‌ ఖాతాలో మొత్తం 5 పతకాలు చేరాయి. పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు భారత్ నాలుగు కాంస్యాలు, ఒక రజతం సహా అయిదు పతకాలు సాధించింది. మూడు కాంస్యాలు షూటింగ్‌లో రాగా, ఒకటి పురుషుల హాకీలో లభించింది. జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ రజతాన్ని గెలిచాడు. పారిస్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ మెడల్.