ఫ్యాషన్​ బ్రాండ్​ ‘జరా’ ఫౌండర్ సక్సెస్ స్టోరీ

ఒకప్పుడు పండుగకు బట్టలు కుట్టించుకోవాలంటే కనీసం వారం, పదిరోజుల ముందే టైలర్​కు ఇవ్వాలి. అయినా సరే చెప్పిన టైమ్​కు కుడతారని గ్యారంటీ లేదు. రెడీమేడ్​ బట్టలొచ్చాక ఆ పరిస్థితి మారిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాల్సిన డ్రెస్​లు తెచ్చుకోవచ్చు. కానీ, ఇవి​ మార్కెట్​లోకి రావడం కూడా అంత ఈజీ కాదు.

ట్రెండ్​కు తగ్గ డిజైన్స్​, క్లాత్ సెలక్షన్​ మొదలు ఫ్యాక్టరీల్లో డ్రెస్​లు కుట్టి మార్కెట్​లోకి తెచ్చేసరికి కనీసం ఆరునెలలు పడుతుంది. అప్పటిలోగా కస్టమర్స్​​ ప్రిఫరెన్సెస్​లో మార్పులొస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కస్టమర్​ ఇష్టపడే డిజైన్​లోని బట్టలు ఎంత స్పీడ్​గా మార్కెట్​లోకి తెస్తే అంత మంచిది. ఈ సూత్రంతోనే సూపర్​ సక్సెస్​ అయిన ఫ్యాషన్​ బ్రాండ్​ జరా. దీని ఫౌండర్​ అమన్షియో ఒర్టెగా గోనా. ఆకలితో పస్తులున్న రోజుల నుంచి ఫ్యాషన్​ పయనీర్​గా ఆయన ఎదగడం వెనక ఉన్న కష్టాలు, పట్టుదల, శ్రమను చెప్పే సంగతులు ఇవి. 

స్పెయిన్​లోని ‘బస్దోంగో డి అర్బస్​’ అనే చిన్న ఊరిలో మార్చి 28, 1936లో పుట్టాడు అమన్షియో ఒర్టెగా గోనా. తల్లిదండ్రులు రోడ్రిగ్జ్, హెర్నాండెజ్. వీళ్లది అత్యంత నిరుపేద కుటుంబం. రోజూ కూలిపనులకు వెళ్తేనే కుటుంబం గడిచేది. పని దొరక్కపోతే ఆరోజు పస్తులుండాల్సిందే. ఆ పేదరికానికి తోడు అమన్షియోకు ఇద్దరు తమ్ముళ్లు ఆంటోనియో, పిలర్, చెల్లెలు జోసెఫా వచ్చారు. 

అప్పు పుట్టక అమ్మ ఏడవడంతో...

ఊళ్లో పనులు దొరకడం కష్టం కావడంతో అమన్షియో కుటుంబం ‘లా కొరునా’ టౌన్​కు మారింది. అక్కడి రైల్వే స్టేషన్​లో కూలీగా చేరాడు రోడ్రిగ్జ్. రైల్వే కార్టర్స్​కు ఆనుకొని ఉన్న ఒక పాడుపడిన ఇంట్లో ఉండేవాళ్లు. రోడ్రిగ్జ్​కు వచ్చే జీతం అంతంత మాత్రమే కావడంతో హెర్నాండెజ్​ ఒక ఇంట్లో పనిమనిషిగా చేరింది. అయినా, కుటుంబం గడవడం కష్టమయ్యేది.

ఇంట్లోకి అవసరమైన సరుకుల్ని దగ్గరలోని కిరాణా కొట్టులో అప్పుకు తెచ్చేది హెర్నాండెజ్​. అప్పు ఎక్కువ కావడంతో ఒకరోజు షాపు ఓనర్​ సరుకులు ఇవ్వలేదు. దాంతో ఆమె ఏడుస్తూ షాపు నుంచి బయటకు వచ్చింది. మరో రెండు, మూడు దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. అమ్మ ఏడ్చుకుంటూ షాపులన్నీ తిరగడం స్కూలు నుంచి వస్తున్న అమన్షియో చూశాడు. అతని మనసు మెలిపెట్టింది. అప్పుడే తాను కూడా ఏదైనా షాపులో పనికి చేరాలనుకున్నాడు. వెంటనే స్కూల్​ మానేశాడు. అప్పటికి అమన్షియోకు 14 ఏండ్లు.

బట్టల కొట్టులో అసిస్టెంట్​గా.. 

స్కూల్​ మానేశాక అదే ఊళ్లోని ‘గాలా’ అనే బట్టలకొట్టులో అసిస్టెంట్​గా చేరాడు అమన్షియో. అందులో పనిచేస్తూనే బట్టలు కుట్టడం నేర్చుకున్నాడు. షర్ట్స్​, ప్యాంట్స్​, టోపీలు, స్వెటర్​లు కుట్టేవాడు. పనిలో చురుగ్గా ఉంటూ అక్కడికి వచ్చే కస్టమర్స్​కు ఫ్రెండ్​లా మారిపోయాడు. వాళ్లకు కావాల్సినవి షాపులో లేకపోతే, ఎలాంటి డిజైన్​లో కావాలో కనుక్కొని కుట్టిచ్చేవాడు. దాంతో దుకాణానికి వచ్చేవాళ్లంతా అమన్షియోను బాగా మెచ్చుకునేవాళ్లు. ఆ తర్వాత1960నాటికి మేనేజర్​ స్థాయికి ఎదిగాడు. 

మొదటి కంపెనీ..

ఖాళీ టైమ్​లో సైకిల్​పై టౌన్ అంతా తిరగడం అమన్షియోకు అలవాటు. అలా ఒకరోజు తిరుగుతూ టౌన్​కు ఆనుకొని ఉన్న ‘గెలీషియా’ అనే ప్రాంతానికి వెళ్లాడు. అదొక రెసిడెన్షియల్​ కమ్యూనిటీ. భర్తను కోల్పోయిన వాళ్లు, అనాథ స్త్రీలు అక్కడ ఉండేవాళ్లు. వాళ్లు కుట్టుపనిలో స్పెషలిస్ట్​లు. రకరకాల నైట్​గౌన్​లు, చిన్నపిల్లల డ్రెస్​లు, లోదుస్తులు కుట్టేవాళ్లు. అయితే, వాళ్ల శ్రమకు తగిన ఆదాయం వచ్చేది కాదు.

దాన్ని గమనించాడు అమన్షియో. ఆ మహిళలను ఒప్పించి వాళ్లందరినీ ఒక సహకార సంఘంగా ఏర్పాటుచేయించాడు. వాళ్లు కుట్టిన దుస్తుల్ని టౌన్​తోపాటు దగ్గరలోని మరిన్ని  ఏరియాలకు పంపేవాడు. దాంతో ఆ సంఘాలతోపాటు అమన్షియోకు కూడా ఆదాయం పెరిగింది. దాదాపు పదేండ్లు పనిచేశాక బట్టలు కుట్టి, అమ్మే పనుల్లో అమన్షియో రాటుదేలాడు. అప్పుడే సొంతంగా కంపెనీ పెట్టాలనుకున్నాడు.

అలా 1963లో ‘కన్​ఫెక్షన్స్​ జి.ఒ.ఎ.’ పేరుతో మొదటి కంపెనీ పెట్టాడు. కంపెనీలో కొత్త ఫ్యాషన్స్​, డిజైన్స్​ డెవలప్​ చేసే డ్యూటీ అమన్షియోది. అతని తమ్ముడు ​ఆంటోనియో మార్కెట్​ పనులు, చెల్లెలు జోసెఫా అకౌంట్స్​ చూసేవాళ్లు. కంపెనీలో పార్టనర్​గా రొసాలియా మెరా గొయెన్షియా చేరింది.1966లో రొసాలియోను పెండ్లి చేసుకున్నాడు అమన్షియో. వీళ్లకు సాండ్రా, మార్కోస్​ అనే ఇద్దరు పిల్లలు. 

అలా పుట్టింది ‘జరా’

‘కన్​ఫెక్షన్స్​ జి.ఒ.ఎ’ కంపెనీలో తయారైన దుస్తులు టౌన్​లోని చాలా షాపులకు సరఫరా చేసేవాళ్లు. ఈ దుస్తులకు డిమాండ్​ బాగా పెరిగింది. వేరే టౌన్​లలోని షాపుల నుంచి కూడా ఆర్డర్స్​ మొదలయ్యాయి. దాంతో సొంతంగా రిటైల్​ షోరూమ్​ పెట్టాలనుకున్నాడు అమన్షియో. అలా 1975లో మొదటి ‘జరా’ షాప్​ ఓపెన్​ అయింది. కస్టమర్లు కోరుకున్నవి తక్కువ టైంలో అందించడం, స్టాక్​ను ఎప్పటికప్పుడు మార్చడం, ఒక డిజైన్​లోని డ్రెస్​లను తక్కువ సంఖ్యలో తయారుచేయడం, కొత్త కొత్త వెరైటీలు అందుబాటులో ఉంచడం, వారానికి రెండు సార్లు పాత స్టాక్​ను మార్చడం వంటివాటితో ‘జరా’ బాగా ఫేమస్​ అయింది.

కస్టమర్లు మళ్లీ మళ్లీ వచ్చేలా చేసింది. దాంతో కేవలం ఐదేండ్లలోనే స్పెయిన్​లోని దాదాపు అన్ని సిటీల్లోనూ షాప్​లు మొదలయ్యాయి. అలా ఫాస్ట్​ ఫ్యాషన్​కు​ కేరాఫ్​గా మారింది ‘జరా’.  దాంతో విదేశాల్లోనూ కంపెనీ షోరూమ్​లు మొదలుపెట్టేందుకు వీలుగా కంపెనీ పేరును ‘ఇండిటెక్స్’ గా మార్చాడు అమన్షియో. ఆ తర్వాత 1988లో పోర్చుగల్​లో మొదటి విదేశీల ‘జరా’ షాప్​ మొదలైంది. 1989లో అమెరికాలోకి, 1998లో బ్రిటన్​లోకి ప్రవేశించింది.

‘ఇండిటెక్స్’ గ్రూప్​లో జరా మెయిన్​ అయినప్పటికీ దాంతోపాటు ‘పుల్​ అండ్​ బేర్​’, ‘మాసిమో డుటీ’, ‘స్ట్రాడివేరియస్​’, ‘బెర్స్​కా’, ‘ఓయిష్​’, ‘యురకీ’ పేర్లలో మరికొన్ని ఫ్యాషన్​ బ్రాండ్స్​​ కూడా ఉన్నాయి. వీటిలో చిన్నపిల్లల డ్రెస్​ల నుంచి షూ, కాస్మొటిక్స్​ వరకు అన్ని రకాల ఫ్యాషన్ ఐటెమ్స్​ దొరుకుతాయి. ​అయితే, ఫ్యాషన్​ వేర్​తోనే అమన్షియో ఆగిపోలేదు. పెట్రోల్​ బంక్స్​, బ్యాంక్స్​, టూరిజం, రియల్​ ఎస్టేట్​లోనూ పెట్టుబడులు పెట్టాడు.  అన్నింటిలోనూ పట్టిందల్లా బంగారమే కావడంతో 2015 నాటికి ఫోర్బ్స్​ ప్రపంచ కుబేరుల్లో టాప్​ ‌‌ ‌‌–2కు చేరాడు అమన్షియో. ​ ప్రస్తుతం ‘ఇండిటెక్స్​’కు దాదాపు వంద దేశాల్లో సుమారు 6500 స్టోర్​లు ఉన్నాయి. వీటిలో ‘జరా’ స్టోర్సే మూడు వేలు ఉన్నాయి.

పేరు తిరగేసి...  

  • ‘కన్​ఫెక్షన్స్​ జి.ఒ.ఎ’లో చివరి మూడక్షరాలు అమన్షియో పేరును తిరగేసి రాయగా వచ్చిన షార్ట్​ఫామ్​. అంటే.. గోనా(జి) ఒర్టెగా(ఒ) అమన్షియో(ఎ).
  • ‘జరా’ మొదట పేరు ‘జొర్బా’. అమన్షియో భార్య రొసాలియాకు ‘జొర్బా’ పేరుతో వచ్చిన స్పానిష్​ మూవీ అంటే చాలా ఇష్టం. అందుకే ఆ షాప్​కు ఆ పేరు పెట్టారు. కానీ, అదే వీధిలోనే ఆ పేరుతో ఒక రెస్టారెంట్​ ఉండేది. ఆ రెస్టారెంట్​ వాళ్లు అడ్డు చెప్పడంతో కంపెనీ పేరు ‘జరా’గా మార్చారు. 
  • అమన్షియో, రొసాలియా 1986లో విడిపోయారు. ఆ తర్వాత కంపెనీలో పనిచేసే ఫ్లోరా పెరెజ్​ను పెండ్లి చేసుకున్నాడు అమన్షియో. వీళ్లకు మార్టా అనే కూతురు ఉంది. 
  • ‘జరా’ మొదటి లోగో 1976లో వచ్చింది. డ్రెస్​లకు ఉండే బ్రాండ్​ ట్యాగ్​లా ఈ లోగో ఉండేది. ఇందులో ఇంగ్లీష్​లో ‘జరా’ అనే పేరు కింద స్పానిష్​లో ‘తియాందస్​ దె మోద’ అని ఉండేది. ఆ మాటకు అర్థం ‘ఫ్యాషన్​ స్టోర్స్​’. ఈ లోగో 1980 వరకు ఉండేది. ఆ తర్వాత 28 ఏండ్ల పాటు కేవలం ‘జరా’ అనే అక్షరాలతో లోగో ఉండేది. 2008 నుంచి 2019 వరకు ‘జరా’లోని ఒక్కో అక్షరం మధ్య కొంత గ్యాప్ ఇచ్చిన లోగో కనిపించేది. ఆ తర్వాత నాలుగు అక్షరాలను ఒకదానికొకటి అతికించినట్లు ఉన్న లోగో వచ్చింది. ఇప్పుడు వాడుకలో ఉంది ఇదే. 

ఛారిటీకి ముందు.. 

చిన్నప్పుడు అనుభవించిన కష్టాలు అమన్షియోపై బాగా ప్రభావం చూపాయి. అందువల్లే బిలియనీర్​ అయ్యాక ఛారిటీ కార్యక్రమాలకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేవాడు. దానికోసం1986 ‘పైడీయా ఫౌండేషన్​’ ఏర్పాటుచేశాడు. మానసిక, శారీరక సమస్యలతో బాధపడేవాళ్లకు అవసరమైన చికిత్సకు, చదువుకు, ట్రైనింగ్​కు ఈ ఫౌండేషన్​ సాయం చేసేది. ఈ సంస్థకు ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్​ కూడా వచ్చాయి.

అలాగే 2001లో ‘అమన్షియో ఒర్టెగా ఫౌండేషన్​’ పేరుతో మరొక ఎన్జీవోను మొదలుపెట్టాడు అమన్షియో. సైన్స్​, రీసెర్చ్​, ఎడ్యుకేషన్​, సోషల్​ యాక్షన్​, కల్చర్​, వెల్ఫేర్​ అభివృద్ధికి కావాల్సిన ఆర్థిక సాయం ఈ సంస్థ చేసేది. దీనికి 2009లో స్పెయిన్​ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్​ ఆఫ్​ సివిల్​ మెరిట్​’ వచ్చింది. స్పెయిన్​లో నెం.1 కుబేరుడిగా, యూరప్​లో నాలుగో అతిపెద్ద ధనవంతుడిగా పేరొందినప్పటికీ మీడియాకు మాత్రం అమన్షియో దూరంగా ఉండేవాడు.

1999 వరకు ఆయన ఫొటో కేవలం ఒక్కటి మాత్రమే జనానికి తెలుసు. తనతోపాటు తన కుటుంబం వివరాలు మీడియాకు తెలియకుండా జాగ్రత్తపడేవాడు అమన్షియో. ఇప్పటివరకు కేవలం ముగ్గురు జర్నలిస్ట్​లకు మాత్రమే ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చాడు.