యూట్యూబర్​ : 73 ఏండ్ల వయసులో 100 మందికి వంట!

పంజాబ్​కు చెందిన అమర్ కౌర్.. చాలా ఫేమస్​ యూట్యూబర్​​. అంత ఫేమస్​ ఎందుకు అయ్యిందంటే.. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసులో కూడా కష్టపడి పని చేస్తోంది. వారంలో ఒక్కసారైనా దాదాపు వంద మంది స్కూల్​ పిల్లలకు వంట చేసి ఫుడ్‌‌‌‌ పెడుతుంది. అందుకే ఆమెని ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆమె పిల్లలంతా సెటిల్​ అయ్యారు. మనవలు కూడా పెద్దవాళ్లు అయ్యారు. ఖాళీగా ఉండలేక ఆమె కూడా తన మనవడు హర్దీప్​ శర్మతో కలిసి యూట్యూబ్​ చానెల్​ మొదలుపెట్టింది. మొదట్లో ఒక చిన్న కట్టెల పొయ్యి మీద ఒక కుటుంబానికి సరిపడా వంట చేసేది.

 అయితే, ఆమె వంట చేసే విధానం వల్ల ఎంతోమందిని ఆకట్టుకుంది. దాంతో ఛానెల్​కు బాగా రీచ్​ వచ్చింది. అలా కొన్నాళ్లకు చానెల్ డెవలప్​ అవుతున్న కొద్దీ వంటకాల క్వాంటిటీ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు పెద్ద పెద్ద పొయ్యిల మీద ఒకేసారి దాదాపు వందమందికి వంట చేస్తోంది. పెద్ద మొత్తంలో వంట చేయడానికి ఇంటి వెనకాల అన్ని ఏర్పాట్లు చేయించింది. ఆమె వండిన ఫుడ్​ని వాళ్ల ఊళ్లోనే ఉన్న ఒక గవర్నమెంట్​ స్కూల్​లో పిల్లలకు పెడుతుంటారు.

 అయితే.. వీడియోలు చేయడం మొదలుపెట్టి ఇప్పటికి దాదాపు ఎనిమిదేండ్లు అయ్యింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె చేసినవన్నీ వెజ్​ వంటకాలే. అయినా.. చానెల్​కు రీచ్​ ఏమాత్రం తగ్గడంలేదు. నాన్​వెజ్​ వంటకాలను ఇష్టపడేవాళ్లు కూడా అమర్​  వీడియోలను చూస్తుంటారు. ఈ మధ్యే మనవడు హర్దీప్ శర్మతో కలిసి ఒక రెస్టారెంట్​ కూడా పెట్టింది. దాని పేరు కూడా ‘వెజ్ విలేజ్ ఫుడ్’ అనే పెట్టారు. ఇప్పటివరకు వంటకాల వీడియోలు మాత్రమే పంచుకునేది. ఇప్పుడు తన రెసిపీల రుచులను కూడా అందరికీ పంచుతోంది. అమర్​ ఆరెస్టారెంట్​లో పనిచేయకపోయినా అక్కడ వంటలు మాత్రం ఆమె గైడెన్స్​లోనే చేస్తుంటారు. 

వయసు ఏడు పదులు దాటింది. అయినా..వంద మంది పిల్లలకు ఈజీగా వండి పెడుతుంది ఈ పంజాబీ బామ్మ అమర్​ కౌర్​. ఈ వయసులోనూ ఇన్ఫ్లుయెన్సర్​గా మారి లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకుంది. ఆకలితో ఉన్న పిల్లల కడుపులు నింపుతూ ఎంతోమంది ప్రేమని దక్కించుకుంది. అంతేకాదు.. ఈ తరం నచ్చే కొత్త వంటకాలతోపాటు అన్ని తరాలు మెచ్చే పాత వంటకాలను యూట్యూబ్ ద్వారా అందరికీ నేర్పుతోంది. 

అరుదుగా మాట్లాడుతుంది

అమర్​ కౌర్​ తన వీడియోల్లో చాలా అరుదుగా మాట్లాడుతుంటుంది. ఆమెతో పాటు వీడియోల్లో తన మనవడు కూడా కనిపిస్తుంటాడు. అతను మాట్లాడేది కూడా తక్కువే. వీడియోల్లో మనసుకు ప్రశాంతతని ఇచ్చే ఏఎస్​​ఎంఆర్​ సౌండ్స్​ ఎక్కువగా ఉంటాయి. మాట్లాడకపోయినా వంట వండే విధానం మాత్రం చాలా బాగా చూపిస్తుంటుంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇప్పటికీ అన్ని వంటకాలు కట్టెల పొయ్యిల మీదే చేస్తున్నారు. 

ఛానెల్​ ఇలా.. 

‘వెజ్ విలేజ్ ఫుడ్ ఛానెల్‌‌‌‌’ని 2014లోనే పెట్టారు. కానీ.. 2017 నుంచి వీడియోలు పోస్ట్‌‌‌‌ చేస్తున్నారు. వీడియో లను షూట్ చేయడం నుంచి ఎడిటింగ్​, ప్రమోషన్ల తోసహా చానెల్​కు సంబంధించిన అన్నింటినీ హర్దీప్ శర్మ చూసుకుంటున్నాడు. అప్పుడప్పుడు అతని కజిన్స్, మేనమామలు సాయం చేస్తుంటారు. ప్రస్తుతం చానెల్‌‌‌‌ను 6.17 మిలియన్ల మంది సబ్​స్క్రయిబ్​ చేసుకున్నారు. ఇప్పటివరకు చానెల్‌‌‌‌లో 596 వీడియోలు అప్​లోడ్​ చేశారు. వాటిలో వెయ్యి సమోసాలు చేసిన ఒక వీడియో కు ఏకంగా 147 మిలియన్ల వ్యూస్​ వచ్చాయి. అంతేకాదు.. ఆమె చానెల్‌‌‌‌లో పది మిలియన్ల వ్యూస్​ దాటిన వీడియోలు చాలానే ఉన్నాయి. పెద్ద వీడియోలతోపాటు షార్ట్‌‌‌‌ వీడియోలకు బాగా రీచ్​ వస్తోంది.