లిథియం అయాన్ బ్యాటరీ రంగంలో... అతి పెద్ద పెట్టుబడి అమర్ రాజా బ్యాటరీస్ : మంత్రి కేటీఆర్

లిథియం అయాన్ బ్యాటరీ రంగంలో... అతి పెద్ద పెట్టుబడి అమర్ రాజా బ్యాటరీస్ : మంత్రి కేటీఆర్

మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో ఏర్పాటు చేయనున్న అమర్ రాజా పరిశ్రమ దేశంలోనే లిథియం అయాన్ బ్యాటరీల తయారీ రంగంలో అతి పెద్ద పెట్టుబడి అని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. దివిటిపల్లిలో అమర్ రాజా పరిశ్రమ శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు... దివిటిపల్లిలో విడతల వారీగా రానున్న 10 ఏళ్లలో అమర్ రాజా కంపెనీ రూ.9 వేల 500 కోట్ల పెట్టుబడి పెట్టనుందని అన్నారు.  ఇక్కడ స్థాపించబోయే పరిశ్రమతో ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా చాలా మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 

8 రాష్ట్రాలు పోటీ పడ్డయ్..

అమర్ రాజా కంపెనీ తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్న విషయం తెలిసి 8 రాష్ర్టాలు తమ ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలని కోరినట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ అనుకూల విధానాలే పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తున్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఐటీ రంగంలో 3 లక్షల ఉద్యోగాలు ఉండగా, ఏడేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కొత్తగా వచ్చినట్లు చెప్పారు. దేశంలో యువశక్తి చాలానే ఉన్నా, దాన్ని వినియోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

పూర్తి కాలుష్య రహితం..

దివిటిపల్లిలో ఏర్పాటు చేసే పరిశ్రమ పూర్తి కాలుష్యరహితమని ఎవరికైనా అనుమానాలుంటే అధికారులను కలిసి నివృతి చేసుకోవాలని కోరారు.  జీరో లిక్విడ్ డిశ్చార్జీతో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కంపెనీ స్థాపనకు ముందుకు వచ్చిన గల్లా జయదేవ్ కుటుంబసభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ ఫౌండర్ గల్లా రామచంద్రనాయుడు, అమర్ రాజా సంస్థ  ఛైర్మన్ గల్లా జయదేవ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.  

అమర్ రాజాతో వలసలు బంద్.. : మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఒకప్పుడు వలసలకు మారు పేరు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కంపెనీ కోసం ఎన్నో జిల్లాలు పోటీ పడినా... సీఎం కేసీఆర్ చొరవతో మహబూబ్ నగర్ కే ఈ అవకాశం వచ్చింది. తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటుపై ఆనందంగా ఉందని గల్లా అరుణకుమారి అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం, ప్రభుత్వ అనుకూల విధానాలు ఉన్నాయని  చెప్పారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో తమ కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. మళ్లీ సొంత రాష్ర్టానికి వచ్చినట్లు ఫీల్ అవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.