ముంబై : ఎన్‌టీపీసీ లిమిటెడ్ కోసం లడఖ్‌లోని లేహ్‌లో భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు అమర రాజా ఇన్‌ఫ్రా సోమవారం తెలిపింది. కేంద్ర విద్యుత్, గృహనిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ సదుపాయాన్ని ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. సముద్ర మట్టానికి 3,400 మీటర్ల ఎత్తులో -25 డిగ్రీల సెల్సియస్ నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు ఉన్న తీవ్ర పరిస్థితుల్లో
రోజుకు 80 కిలోల జీహెచ్2 ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఇంధన స్టేషన్ ప్రాజెక్ట్ రెండేళ్లలో పూర్తయిందని కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ లేహ్ చుట్టుపక్కల ప్రాంతాలలో కాలుష్య రహిత రవాణాను సాధ్యం చేస్తుంది. ఈ ప్రాంతంలో ఎన్‌టీపీసీకి ఐదు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సులు ఉన్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలోకి ప్రవేశించిన మొదటి కంపెనీ తమదేనని అమర రాజా ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌లో బిజినెస్ హెడ్ (పవర్ ఈపీసీ) ద్వారకనాథ రెడ్డి అన్నారు.