అమరచింతలో బ్యాంక్  చోరీ యత్నం కేసులో ఐదుగురి అరెస్ట్

అమరచింతలో బ్యాంక్  చోరీ యత్నం కేసులో ఐదుగురి అరెస్ట్
  • నిందితుల్లో బీటెక్​ చదివిన మహిళ

వనపర్తి టౌన్ , వెలుగు: అమరచింత యూనియన్  బ్యాంక్  చోరీ కేసులో ఐదుగురిని  పోలీసులు అరెస్ట్  చేశారు. సోమవారం ఎస్పీ ఆఫీస్​లో ఎస్పీ రావుల గిరిధర్  మీడియాకు వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 27న బ్యాంక్ లో చోరీ కోసం ప్రయత్నించారు. స్ట్రాంగ్ రూం తాళాలు పగులగొట్టి లాకర్ ను ఓపెన్  చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తమను గుర్తించకుండా సీసీ కెమెరాలను పగులగొట్టి డీవీఆర్ ను ఎత్తుకెళ్లారు. వనపర్తి మండలం మెంటెపల్లికి చెందిన పసుల అంకిత బీటెక్  చదివింది. 2019లో రైల్వేలో మేనేజర్  జాబ్  ఇప్పిస్తానని సాయి నివాస్  అనే వ్యక్తి రూ.5 లక్షలు తీసుకొని మోసం చేశాడు.

ఆ తర్వాత వేరే ప్రైవేట్  ఉద్యోగం చేస్తూ, తాను కూడా ఇతరులను మోసం చేయాలని నిర్ణయించుకుంది. రైల్వేలో టికెట్  కౌంటర్  మేనేజర్  ఉద్యోగాలు ఇప్పిస్తానని గద్వాల జిల్లాకు చెందిన ముగ్గురిని నమ్మించి, రూ.6 లక్షల చొప్పున వసూలు చేసింది. ఆ డబ్బులతో గోవా, బెంగళూరు వెళ్లి జల్సాలు చేసింది. 2022లో వనపర్తి మండలం మెంటెపల్లికి చెందిన రాచాల జగదీశ్వర్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. ఇదిలాఉంటే గత ఏడాది నవంబర్ లో ఉద్యోగాల పేరిట మోసపోయిన బాధితులు గద్వాల, అయిజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయాన్ని భర్తకు చెప్పగా, రాచాల జగదీశ్వర్ రెడ్డి బాధితులో మాట్లాడి డబ్బులు తిరిగి ఇచ్చేందుకు అంగీకరించాడు.

ఇందుకోసం దొంగతనం చేయాలని అంకిత నిర్ణయించుకుంది. తన భర్తను ఒప్పించి బ్యాంక్ లో చోరీకి ప్లాన్  చేసింది. అదే గ్రామానికి చెందిన రాచాల భాస్కర్ రెడ్డి, మంద నాగరాజుతో పాటు వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన  గణేశ్​కు డబ్బు ఆశ చూపించి వారిని దొంగతనానికి ఒప్పించారు. గద్వాల, నారాయణపేట, మరికల్   తదితర ప్రాంతాల్లో బ్యాంకుల్లో దొంగతనం చేయడం వీలు కాలేదు. అమరచింత బ్యాంక్​ వెనక వైపు ఉన్న కిటికీ  గ్రిల్స్  ఊడగొట్టి బ్యాంకులోకి వెళ్లారు. నిందితులను అరెస్ట్​ చేసి డీవీఆర్, క్రెటా కారును స్వాదీనం చేసుకున్నారు.