అమర్నాథ్ యాత్ర 2024 జూన్ 29 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అమర్‌నాథ్ యాత్రకు ఉగ్రముప్పు పొంచి ఉందన్న ఇంటలిజెన్స్ సమాచారంతో భారీగా బందోబస్తు కల్పించాలని నిర్ణయించింది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రికులకు RFID కార్డ్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని సమాచారం అందుతోంది. ఇవి తప్పిపోయిన యాత్రికుల సమాచారాన్ని కనుగొనేందుకు ఉపయోగపడతాయి. ఇంకా అమర్నాథ్ యాత్ర చేసే ప్రతి ఒక్కరికి రూ. 5 లక్షల ఇన్స్యూరెన్స్ ఇవ్వనున్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ సారథ్యంలో.. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతను వేగవంతం చేయడంతో పాటు అదనపు బలగాలను రంగంలోకి దించాలని డెషిషన్ ఫైనల్ అయింది. పవిత్ర యాత్రకు ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు (SASB) ఇటీవలే ప్రకటించింది. అమర్నాథ్ యాత్రికులు జమ్మూ కాశ్మీర్లోని బల్తాల్, పహల్గామ్ అనే రెండు మార్గాల గుండా ప్రయాణిస్తారు. గత ఏడాది 4.28 లక్షల మంది భక్తులు అమరనాథుడిని దర్శించుకున్నారని, ఈసారి ఆ సంఖ్య ఐదు లక్షలకు చేరుకోవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దక్షిణ కాశ్మీర్ హిమాలయాలలో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ తీర్థయాత్ర జూన్ 29 న ప్రారంభమై ఆగస్టు 19 న ముగుస్తుంది. అయితే ప్రారంభం కావడానికి ముందు ..జమ్మూ కాశ్మీర్లోని రియాసి, కతువా, దోడా జిల్లాల్లో నాలుగు చోట్ల ఉగ్రవాదులు దాడి చేసి తొమ్మిది మంది యాత్రికులు, ఒక CRPF జవాన్ను చంపారు. ఇందులో ఏడుగురు భద్రతా సిబ్బందితో పాటు పలువురు గాయపడ్డారు.కతువా జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్లో లో ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదులు కూడా మరణించారు. వారి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
జమ్మూకాశ్మీర్ లో జరుగుతున్న వరుస ఉగ్రవాద దాడులపై కేంద్ర హెూంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష జరపనున్నారు. జూన్ 29 న అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో యాత్రా సన్నాహాలను, శాంతి భద్రతలను షా తెలుసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు హెూంమంత్రి విస్తృత మార్గదర్శకాలను ఇస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితి, అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి బలగాల మోహరింపు, చొరబాటు ప్రయత్నాలు కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల స్థితి, కేంద్ర పాలిత ప్రాంతంలో పనిచేస్తున్న ఉగ్రవాదుల బలం గురించి చర్చించారు. అమర్నాథ్ యాత్రికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి ఆదేశించారు.