హైదరాబాద్ : అమరరాజా బ్యాటరీస్ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ‘లిథియమ్ సెల్- బ్యాటరీ ప్యాక్’ తయారీకి అతిపెద్ద కంపెనీని స్థాపించబోతోంది.‘అమరరాజా గిగా కారిడార్’ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాంగణానికి మే 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, అమరరాజా గ్రూపు వ్యవస్థాపకుడు డాక్టర్ రామచంద్ర ఎన్. గల్లా, సీఎండీ జయదేవ్ గల్లా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
లిథియమ్ సెల్- బ్యాటరీ ప్యాక్ యూనిట్ నిర్మాణాన్ని ఏడాదిన్నర వ్యవధిలో పూర్తి చేసి, ఉత్పత్తి చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమరరాజా గ్రూపు ప్రతినిధులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన (ఎస్పీవీ) అమరరాజా అడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కింద ఈ యూనిట్‌ను కార్యరూపంలోకి తీసుకువస్తున్నారు. దాదాపు 16 గిగావాట్ల లిథియమ్ ఆయాన్ బ్యాటరీ ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నెలకొల్పనున్నారు.
దశల వారీగా ఈ కారిడార్‌పై వచ్చే పదేళ్లలో రూ.9,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు ఇంతకు ముందే అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యం వెల్లడించింది. ఈ యూనిట్‌కు సంబంధించి కొంతకాలం క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అమరరాజా బ్యాటరీస్ ఒప్పందం కుదుర్చుకుంది.
వాహన, టెలికాం, రక్షణ రంగాలకు అవసరమైన బ్యాటరీలను రెండు దశాబ్దాలకు పైగా అమరరాజా బ్యాటరీస్ ఉత్పత్తి చేస్తోంది. వాహన బ్యాటరీ రిప్లేస్‌మెంట్ విభాగంలో అమరరాజా ‘అమరాన్’ బ్యాటరీలు అత్యధిక మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి.