ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 అక్టోబర్ 22న ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు చేతులమీదుగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ వేదికగా ఈ సమ్మిట్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా డ్రోన్ల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్‌లో ఉండటానికి ఈ సదస్సు తొలి అడుగు కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు హాజరైయ్యారు. రెండు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. ఈ రెండు రోజుల్లో 9 ప్యానల్ డిస్కషన్లు, 50 స్టాళ్లలో డ్రోన్ల ప్రదర్శన, రాష్ట్ర ముసాయిదా డ్రోన్ పాలసీ పత్రం ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు జరగనున్నాయి.
డ్రోన్ల వినియోగంలో ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే టాప్‌గా తీర్చిదిద్దేందుకు ఈ సదస్సు తొలి అడుగు కావాలని సీఎం ఆకాక్షించారు. 15 రోజుల్లో డ్రోన్ పాలసీని తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. డ్రోన్ సర్టిఫికేట్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని.. ఓర్వకల్లులో 300 ఎకరాల భూమిని కేటాయిస్తామని ఆయన తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్ లో గేమ్ ఛేంజర్ కానుందని బాబు అన్నారు. తాను 1995 లోనే ఐటీ గురించి ఆలోచించానని, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలను హైదరాబద్ కు తీసుకొచ్చానని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.